బక్కపలుచని దేహం. పదునైనా మాటల వ్యూహం. అన్నింటినీ మించి అపజయాలను విజయాలుగా మలచుకొనే ైస్థెర్యం . తనే ఓ ధైర్యమై, ఓ సైన్యమై, ఓ యుద్ధమై దశాబ్దాలుగా వివక్షకు, వెనుకబాటుకు గురైన తెలంగాణ ప్రజల గొంతుకై, కోట్లలో ఒక్కడై దేశాన్నే కదిలించారు కేసీఆర్. స్వరాష్ట్ర స్వప్నం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. రెండు ఎంపీ సీట్లతో, పట్టుమని పదిమంది లేని ఎమ్మెల్యేలతో కలిసి ఆయన చేసిన ఉద్యమం అసామాన్యం.అనితర సాధ్యం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు దఫాలుగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపింది. వినూత్న పథకాలతో ఐక్యరాజ్య సమితిని సైతం మెప్పించింది. రాజకీయ పార్టీల నడుమ భిన్నాభిప్రాయాలున్నా కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ ప్రజల ఆత్మబంధువే. దేశ రాజకీయాల్లో ఆయన బ్రాండ్ ఇమేజ్ నేటి జాతీయ స్థాయి ప్రముఖ నాయకులకు సైతం సరితూగనిది. రాజకీయ చదరంగంలో గెలుపోటములు సర్వసాధారణం.కారణాలు ఏవైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మౌనంగా ఉండడాన్ని కూడా కొందరు విమర్శిస్తునారు. అయితే, అది వ్యూహమని రాకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది భయపడి కాదు. దాని పంజా పవర్ చూపించేందుకేనని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
పులి నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించుకున్న నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు శ్రుతి మించుతున్నాయి. వారు వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంటున్నది. అర్థవంతమైన విమర్శలను పక్కనపెట్టి వ్యక్తిగత ద్వేషంతో చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమంలో ఆయన పాత్రను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యలను తెలంగాణ మేధావి సమాజం, ఉద్యమకారులు ఖండించాలి. ఎందుకంటే అధికారం మారుతూ ఉంటుంది. కానీ, సత్యం మారదు. తెలంగాణ ఓ సత్యం. అందులో కేసీఆర్ పేరు శాశ్వతం.
– ఫిజిక్స్ అరుణ్ కుమార్ 93947 49536