ఉద్యమ సమయం నుంచి తెలంగాణ జనహృదయ నేత కేసీఆర్ ఏమి చేసినా అదొక సంచలనమే. ఆయన ప్రతి అడుగూ ఎన్నో ఊహాగానాలకు తావిస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్తే, ఏమి మంతనాలు జరుపుతారో అని పరాయి శక్తుల గండెల్లో గుబులు పుడుతుంది. ఆయన తన నివాసంలోనే ఉండి ఎవరిని కలువకపోతే, ఆయన ఏమి మంత్రాంగం జరుపుతున్నారో అని ప్రత్యర్థులకు భయం పుడుతుంది. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ మాధ్యమాల్లో పెద్దఎత్తున జనం వీక్షిస్తారు. తెలంగాణ వారిలాగే, ఆంధ్ర వారు అత్యంత ఆసక్తిగా వింటారు. ఈ నెల 27న పార్ట్టీ శ్రేణులతో కేసీఆర్ సమావేశం అవుతున్నారనే వార్తతో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం నిండితే, కాంగ్రెస్ నేతల్లో జంకు పుట్టింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నది. హస్తం పార్టీని ఎందుకు నెత్తిన పెట్టుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తలలు బాదుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు కూడా నిష్పక్షపాతంగా నిధులు ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నామని ప్రతి ఎమ్మెల్యే గర్వంగా చెప్పుకొనే వీలుండేది. కేసీఆర్ అమలు చేసిన పథకాలు ప్రతిపక్ష ఎమ్మేల్యేలకు కూడా ఉపయోగపడ్డాయి అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు పోవడానికి వణుకుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి సంచులు వారు సదురుకొనే పనిలో పడ్డారు. పార్టీ కార్యకర్తలను, ప్రజలను పట్టించుకొనే ఆలోచన ఎవరికీ లేదు. అందుకే ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలే ఆయనను గద్దె దించాలని భావించారు. ఇప్పుడు తెలంగాణలోనూ రేవంత్ సర్కార్ దిగిపోవాలని కాంగ్రెస్ నేతలే కోరుకుంటున్నారు.
కేసీఆర్ పాలనలో పదేండ్ల పాటు అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి వర్గమూ రేవంత్‌రెడ్డి పాలన పట్ల ఆగ్రహంగా ఉన్నది. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్‌ది. ‘నేను రైతును’ అని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి కల్పించిన గొప్పదనం కేసీఆర్‌ది. కానీ రేవంత్‌రెడ్డి రాకతో పరిస్థితి తలకిందులైంది. గ్రామీణ వృత్తులవారు తమకు పెద్ద దిక్కు కేసీఆర్ అని ఇప్పటికీ తల్చుకుంటున్నారు. మొత్తం గ్రామీణ, వ్యవసాయ రంగమంతా సంక్షోభంలో పడిపోయింది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనేది బాబు అండ్ కో ఆదేశం. అంటే రేవంత్ అండ్ టీమ్ బాధ్యత! కానీ అది సాధ్యమయ్యే పనేనా? కేసీఆర్ ఆనవాళ్లు అంటే తెలంగాణ ఆనవాళ్లు. కేసీఆర్ వేగంగా కాళేశ్వరం నిర్మిస్తే, రెండు పిల్లర్లు చక్కదిద్దలేని అసమర్థుడిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రైతుల గోస పోసుకొని, ఊర్లను దిక్కు దివానం లేనివిగా మార్చి దిగిపోతారు. కానీ కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత వాటిని చక్కదిద్దుతారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను రేవంత్ నిలిపివేయవచ్చు. కానీ కేసీఆర్ మళ్లీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత వాటిని కొనసాగిస్తారు. తెలంగాణ వైభవాన్ని పునరుద్ధరించడానికి కేసీఆర్‌కు ఎంతో కాలం పట్టదు. కేసీఆర్ చారిత్రక నాయకుడు. కాంగ్రెస్ పాలకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎదురయ్యే సవాళ్లను కేసీఆర్ గుర్తించి వాటిని అధిగమించే వ్యూహాలను రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే, తాను ఎన్నికల్లో మెజారిటీ సాధించే వ్యూహాలను కూడా రచించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే, అతివేగంగా తన పథకాలను ఆచరణలో పెట్టారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎన్నికల గురించే ఆలోచిస్తూ కూర్చోరు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ ఏయే రంగాల్లో దెబ్బతింటున్నది, వాటిని ఏ విధంగా చక్కదిద్దాలి అనేది పథక రచన చేస్తూ ఉంటారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం తిరిగి కొనసాగించడం తథ్యం.
– గోసుల శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు