ఎవరేం కూతలు కూసినా, రాతలు రాసినా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష. అందుకే ఆయనంటే వాళ్లకు అంత కక్ష. ఒంటరిగా వచ్చి బహువచనమైనవాడు. సకల జనులను సమరానికి సన్నద్ధం చేసిన వాడు. మృత్యుముఖంలోకి వెళ్లివచ్చి గమ్యాన్ని ముద్దాడినవాడు. పాతికేండ్లుగా ఈ మట్టి కథతో పెనవేసుకున్నాడు. తెలంగాణ నిగళాలను తెగటార్చి సార్వభౌమ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసి నవాడు. పరిపాలనా పగ్గాలు చేపట్టి స్వరాష్ర్టానికి తొమ్మిదిన్నరేండ్ల వైభవాన్ని సంతరించిపెట్టాడు. మబ్బులను ముద్దాడే ఆ మహా మేరువును ఈకల సాయంతో పడవేయాలని మరుగుజ్జుల వెంపర్లాట. నిప్పులాంటి చరిత్రను ఎండుటాకులతో కప్పజూసే వెర్రిమొర్రి తండ్లాట. కన్నంలో దొరికిన దొంగలు తమను పట్టుకున్న వారిని ఎన్నడూ క్షమిం చలేరు. అపరాధ భావనతో పశ్చాత్తాపం కలిగితే పోనీలే అనుకోవచ్చు. కానీ ఆత్మలోకంలో దివాళా తీసిన అల్పబుద్ధ్దులకు అలాంటివేమీ ఉం డవు. వారికి తెలిసిందల్లా అశక్త దుర్జనత్వం. దుర్యోధనాది దుష్టచతు ష్టయం రాయబారిగా వచ్చిన కృష్ణుని బంధించ జూడలేదా? మహాభా రతం రిపీట్ అవుతున్నది. కురుక్షేత్రానికి రంగం సిద్ధమవుతున్నది.
పగ, ప్రతీకారం చట్టాల్లో ఉండవు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉండి దుర్వినియోగం చేయాలనుకునే ఆలోచనల్లో ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ ఓ కేసు కానే కేదు. ఆ కేసు నిలిచేది కాదని సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడో తేల్చిచెప్పింది. ఆ సంగతి అలా ఉంచితే ఆ కేసులో కేసీఆర్కు ఇచ్చిన నోటీసూ చెల్లదు. ఓ అధికారి మీద దాఖలైన ఎఫ్ఐఆర్ అడ్డం పెట్టుకుని నోటీసులాట సాగుతున్నది. ఇందులో మాజీ సీఎంకు నోటీసు ఇవ్వడం చట్టం ప్రకారం కుదరదు. అదే విషయం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అయినా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే ప్రజానాయకునిగా దర్యాప్తునకు హాజరై నిజాయితీ నిరూపించుకున్నారు. ప్రశ్నలకు ‘మూతోడ్’ జవాబి చ్చారు. తన సుదీర్ఘమైన పోరాటజీవితంలో ఎందరు తెలంగాణ ద్రోహులను ఆయన మట్టి కరిపించలేదు? తనను ‘బంధించాలని’ ఎందరు, ఎంత గా ఎత్తులు వేయలేదు? రాజకీయ చతురత, నిప్పులాంటి నిజాయితీ కేసీఆర్ రక్షణకవచాలు. కేసీఆర్ అంటే స్వరాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ సారథి మాత్రమే కాదు, రెండు విడతల ప్రజాశీస్సులతో సమర్థ పరిపాల నను అందించిన రాజనీతిజ్ఞుడు. ఆయన మీద ఆ కేసే కాదు ఏ కేసూ నిలిచేదికాదు, గెలిచేది కాదని వాళ్లకూ తెలుసు. ‘సిట్’, ‘స్టాండ్’ అంటూ ఆడించినట్టల్లా ఆడే ‘సిట్’ దగ్గర ఆయన సమాధానం చెప్పలేని ప్రశ్నలు న్నాయా? ఆయన స్థాయిని అందుకోగల సందేహాలున్నాయా?
గురుశిష్యుల గూడుపుఠాణీ బద్దలు కొట్టిన నాయకుడు కేసీఆర్. గురువు కండ్లల్లో ఆనందం చూసేందుకు శిష్యుడు ఆడిన నాటకం రక్తి కట్టకపోగా బెడిసి కొట్టింది. ఖాళీ బుర్రల కాంగ్రెస్ పాలకులారా వేసుకోండి లక్ష ప్రశ్నలు. సంధించండి యక్ష ప్రశ్నలు. కేసీఆర్ దగ్గర అన్నిటికీ సమాధానాలున్నాయి. మీరు ఎన్నటికీ సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు ఆయన వేయగలరు కూడా. ఓటుకు నోటు కేసులో ఒకప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు జాతీయ మీడియా ముందు బుకా యింపులు, దబాయింపులతో అపహాస్యం పాలు కావడం మరచిపోగలమా? ఎవరు నీతిమంతులో, ఎవరు కారో ప్రజలకు తెలియదా? సిట్ విచారణ జరుగుతున్న వేళ రాష్ట్రమంతటా కార్చిచ్చులా రగులుకున్న ప్రజాగ్రహం అందుకు సమాధానం. కేసీఆర్ ఇంటికి పోటెత్తిన జనప్రవాహం అందుకు సమాధానం. కేసీఆర్ బిగించిన పిడికిలి వారికి భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ మార్కు కంత్రీ ఎత్తుగడలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. జ్వాలాముఖిలా భుగభుగలాడుతున్నది. మీ ప్రశ్నలకు అంతిమ సమాధానం చెప్పేందుకు సమాయత్తమవుతున్నది. ఒక్క చాన్స్ ఇస్తే ఊడ్చి అవతల పారేసేందుకు ఓటును మడిచిపెడుతున్నది. కాంగ్రెస్ పాలకులారా ప్రజలకు ప్రశ్నలు వేసే దమ్ముందా?