యాదాద్రి భువనగిరి, జూలై 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో వర్గ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎమ్మెల్యే మందుల సామేల్ తిరుగుబాటు చర్చనీయాంశమైంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సామేల్ ఇంత ధైర్యం చేశారంటే ఆయన వెనుక ‘బడా’ నేత ఎవరో ఉన్నారనే చర్చ సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని మరో ఎమ్మెల్యే సామేల్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు ప్రచారం. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టడం లో భాగంగానే ‘ముఖ్య’ నేత వెనుక ఉండి నడిపిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పరామర్శలతో పంచాయితీ షురూ..
అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి 51,094 ఓట్ల భారీ మెజారిటీతో మందుల సామేల్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా, ఇటీవల మోత్కూరులో ఓ కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోత్కూరు మండలానికి వచ్చారు. అదే సమయంలో ఆయన తుంగతుర్తిలో రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలపై ఇబ్బందులకు గురిచేసినా, కేసులు పెట్టినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పరామర్శకు వచ్చి వెళ్లారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే సామేల్‌కు ప్రొటోకాల్ ప్రకారం సమాచారం లేకుండా బ్రదర్స్ పర్యటించడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఈ క్రమంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై దుమ్మెత్తిపోశారు. ‘నల్లగొండ మీ రాజ్యమా..? తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలపై మీ పెత్తనమేంటి..? దళిత ఎమ్మెల్యేలను హీనంగా చూస్తే ఊరుకునేది లేదు. ముందు మునుగోడు మురికి కడుక్కో..’అని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.
ప్రభుత్వ పెద్ద అండదండలతోనే..
నిజానికి మందుల సామేల్‌కు రాజకీయాల్లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు. ఎమ్మెల్యేగా గెలిచాక రాష్ట్ర ప్రభుత్వ పెద్దతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నేరుగా ముఖ్యనేతను కలిసే అవకాశం దొరకడంతో దూసుకుపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా వారిని కనీసం పరిగణనలోకి తీసుకోవడంలేదు. సదరు ప్రభుత్వ పెద్ద సైతం దళితుడు కావడంతో సామేల్‌ను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారనే చర్చ నడుస్తున్నది. అసలు పెద్ద నేత అండదండలు లేకపోతే ఏకంగా బ్రదర్స్‌కు వ్యతిరేకంగా సామేల్ మాట్లాడే వారే కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బ్రదర్స్‌కు వ్యతిరేకంగా వెళ్లిన వారు ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.
రాజగోపాల్ రెడ్డికి చెక్
మంత్రి పదవి హామీ మేరకు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరానని, ఎంపీ ఎన్నికల సమయంలోనూ భువనగిరి ఇన్చార్జిగా నియమించి, మంత్రి పదవి వాగ్దానం చేశారని రాజగోపాల్‌రెడ్డి చెప్తూ వచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఆయనకు పదవి దక్కలేదు. రాజగోపాల్‌రెడ్డికి పదవి ఇవ్వడం ముఖ్య నేతకు ఇష్టం లేదనే ప్రచారం ఉన్నది. ఈ క్రమంలోనే ఒకే కుటుంబంలో ఒకే మంత్రి పదవి అంశాన్ని తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. దీంతో రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా సామేల్ చేసిన వ్యాఖ్యల్లో రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి అంశం తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ‘రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు. రెండు పదవుల్లో ఒకటి యాదవ వర్గానికి, మరొకటి ఎస్టీలకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. బహిరంగంగా రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిని వ్యతిరేకించడం ముఖ్యనేత గేమ్ అని ప్రచారం నడుస్తున్నది. మంత్రి పదవిపై ఊగిసలాట సాగుతుండగా, జిల్లా ఎమ్మెల్యేనే వ్యతిరేకించడంతో మరింత కయ్యం పెట్టినట్టయ్యింది.
సామేల్‌కు ఆ ఎమ్మెల్యే మద్దతు..!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యనేత చాకచక్యంగా చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. తెర ముందు సామేల్‌తో ఆట రక్తి కట్టిస్తుండగా, తెర వెనుక మరో ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌తో ఇబ్బందులు పడిన ఘటనలు ఉన్నాయి. శాసనసభ్యుడిగా గెలిచాక సైతం ఆ నియోజకవర్గంలో వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. బయటకు బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా.. అంతర్గతంగా అండగా నిలుస్తున్నారు. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యేను కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా చేయడంలో ప్రభుత్వ పెద్ద కుట్రలు చేస్తుండగా, మరి అన్నదమ్ములు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.