హైదరాబాద్, జూలై 25 (నమస్తేతెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేలు వ్యవహారం చల్లారకముందే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి రగడ రాజుకొన్నది. 11 ఎస్సీ నియోజకవర్గాల్లో దళిత, అగ్రవర్ణ ఎమ్మెల్యేల నడుమ అధిపత్యపోరు నడుస్తున్నదని, ఇది ఒక్క మందుల సామేలో, వేముల వీరేశమో, రాగమయికి ఎదురవుతున్న సమస్య కాదని శనివారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నిచోట్ల దళిత ఎమ్మెల్యేలం అణచివేతకు గురవుతున్నామని, ఇకపై ఊరుకొనే పరిస్థితిలేదని హెచ్చరించడంతో అధికార పార్టీలో రచ్చ రాజుకొన్నది. ఇటీవలే సీఎంను కలిసి ఇవే విషయాలను విన్నవించామని, గత రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయి తమ డిమాండ్లను ఆయన ముందుంచామని ఎమ్మెల్యే పేర్కొనడం కలకలం రేపుతున్నది.
ఎస్సీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని, అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, లిడ్‌క్యాప్, అసెంబ్లీ కమిటీ చైర్మన్లుగా ఎస్సీలనే నియమించాలని, ఎస్సీ బిల్లులో ప్రాధాన్యం కల్పించాలని, లేదంటే పోరాటం తప్పదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎంపీ, ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమక్షంలోనే మీడియా ఎదుట ఎమ్మెల్యే కవ్వంపల్లి బాహాటంగానే చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీలో కల్లోలం రేగుతున్నది. ఇది కాంగ్రెస్‌లో పక్కా తిరుగుబాటుకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సామేలు వ్యవహారం సద్దుమణగక ముందే..
రెండురోజుల క్రితం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి దళిత నియోజకవర్గాలకు నిధులివ్వకుండా అడ్డుకొంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు రాజగోపాల్‌రెడ్డి సైతం గట్టి కౌంటర్ ఇచ్చారు. సామేలు వ్యాఖ్యలు సత్యదూరమని ఖండించారు. ఈ వివాదం సద్దుమణగకముందే కవ్వంపల్లి రూపంలో దూమారం రేగడం హస్తం పార్టీలో ఆధిపత్య పోరుకు అద్దంపడుతున్నదని రాజకీయావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రెడ్డి వర్సెస్ ఎస్సీ..
కాంగ్రెస్‌లో రెడ్డి, ఎస్సీ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నది. మొన్న సామేలు, నేడు కవ్వంపల్లి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అనే ముద్ర ఉన్నది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలను బలపరిచేలా ఉన్నాయని చెప్తున్నారు. రెడ్డి వర్గానికి చెందిన ముఖ్యమంత్రి సైతం తమపై వివక్ష చూపుతున్నారని లోలోన మదనపడుతున్నట్టు తెలుస్తున్నది. ఎస్సీ ఎమ్మెల్యేల అసమ్మతి వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆందోళనకు గురవుతున్నది. ఈ అసమ్మతి అంతిమంగా తిరుగుబాటుకు దారితీసే ప్రమాదమున్నదని కలవర పడుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై పార్టీ అధిష్ఠానం సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఏదేమైనా ఎస్సీ, అగ్రవర్ణ ఎమ్మెల్యేల మధ్య వివాదంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.