నీలగిరి, సెప్టెంబర్ 25 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే రక్తహీనతను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఐసిడిఎస్ సూపర్ వైజర్ మర్రి జయమ్మ అన్నారు. జాతీయ పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చర్లపల్లి సెక్టార్ పద్మనగర్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లతో ఆహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏయే ఆహార పదార్థాల్లో ఎలాంటి విటమిన్లు, పోషకాలు ఉంటాయో తల్లులకు ఆమె వివరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా నమోదు చేయించుకోవాలని, మొదటి వెయ్యి రోజుల పోషణ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమని సూచించారు. పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక రోగాలను దూరం పెట్టవచ్చని తెలిపారు.ఆరేళ్ల లోపు చిన్నారులకు పోషకాహారం ప్రాధాన్యతను వివరిస్తూ అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సునంద, ఆయా, ఆశా వర్కర్లు, మహిళలు, గర్భిణులు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’