చరిత్రను చెరిపేయాలనుకోవడం అవివేకమే. ఆ పనికి పూనుకున్నవారు బొక్కబోర్లా పడక తప్పదు. గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చిన సత్యం ఇది. తెలంగాణతో కేసీఆర్ అనుబంధం ఓ చరిత్ర. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ జరిపిన అలుపులేని పోరాటం ఓ చరిత్ర. సాధించిన తెలంగాణను జగద్విఖ్యాతంగా అభివృద్ధిపర్చి నిలబెట్టడం ఓ చరిత్ర. ఈ చరిత్ర గోడమీది రాత కాదు, గీకేయడానికి. నిజం నిప్పులాంటిది. దానిని పొరకలతో కప్పేయాలని చూస్తే మరింత జాజ్వల్యమానంగా పైపైకి ఎగుస్తుంది. సీఎం రేవంత్ తనకేవో భుజకీర్తులు తగిలించుకుందామని సమ్మిట్ నిర్వహిస్తే, అక్కడ కేసీఆర్ కీర్తి పతాకం రెపరెపలాడటం ఆ కోవలోకే వస్తుంది. తెలంగాణ రైజింగ్ పేరిట నలుగురు పెద్దలను పోగేసి వేదిక మీద వెలిగిపోదామని సమ్మిట్ నిర్వహిస్తే అక్కడా డామిట్ కథ అడ్డం తిరిగింది. పొద్దున లేస్తే కేసీఆర్ మీద దుమ్మెత్తి పోయడం తప్ప రేవంత్‌కు మరో విద్య తెలియదు. అదో ‘వైరభక్తి’.
సమ్మిట్‌లో ప్రసంగించిన పెద్దలు కేసీఆర్ పాలనను వేనోళ్ల పొగుడుతుంటే మొక్కుబడిగానైనా, చప్పట్లు కొడుతూనైనా, ఇబ్బందిపడుతూనైనా రేవంత్ తలూపకతప్పలేదు. భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనంతో కూడుకున్న తెలంగాణ పదేండ్లలోనే అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం గొప్పగా వెలిగిపోతున్నదని ఆర్థిక నిపుణుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూటిగా, నిర్మొహమాటంగా కేసీఆర్ పాలనకు మంచి మార్కులు వేయడం సమ్మిట్ హైలైట్ అని చెప్పొచ్చు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మరింత లోతుగా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం గమనార్హం. 2014లో రాష్ట్రం ఏర్పడితే పదేండ్లలోనే జీఎస్డీపీ మూడింతలు పెరగడం ప్రశంసనీయమని లెక్కలతో సహా వివరించడం విశేషం.
సాంకేతికత, సాగుబడితో పాటుగా అన్నిరంగాల్లో అగ్రస్థానానికి ఎగబాకిన తెలంగాణ సమ్మిళిత అభివృద్ధికి నమూనాగా నిలిచిందని చెప్పడం కేసీఆర్ పరిపాలన నైపుణ్యానికి కితాబు. ఇక నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ తెలంగాణ తలసరి ఆదాయంలో అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల సరసన చేరిందని, ఇండియా ఈ స్థాయికి రావాలంటే మరో ఏడేండ్లు పడుతుందని బహుధా ప్రశంసలు కురిపించారు. హైటెక్ సిటీ 2006లో ఓ బోర్డు మాత్రమేనని, ఇప్పుడది ఓ అద్భుతమంటూ, ప్రచారార్భాటాలకు, సిసలైన పరిపాలన సామర్థ్యానికి మధ్య తేడాను చక్కగా వివరించారు.
తెలంగాణ సాధించిన ఈ వైభవంలో సీఎం రేవంత్ పాత్ర ఎంతని ఎవ్వరూ అడుగరు, ఇంత అని ఎవ్వరూ చెప్పరు! ఎందుకంటే అది బహిరంగ రహస్యమే. కూట్లె రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తడా అన్నట్టుగా సీఎం రేవంత్ నిర్వహించిన సమ్మిట్ కేసీఆర్ దశాబ్దకాల స్వర్ణయుగ పాలనను ఆకాశానికెత్తే సభగా పరిణమించడం ఓ చారిత్రక సందర్భం. అదొక అనివార్యత కూడా! రేవంత్ ఏమి ఆశించారో గానీ వచ్చిన పెద్దలు నిజాలే చెప్తారు. మీలాగా, మీ కోసం అబద్ధాలు చెప్పరు. కేసీఆర్ పాలనా వైభవాన్ని వివరించడం తప్ప కొత్త రాష్ట్రంలో చెప్పగలిగింది ఇంకేముంది!
రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ తట్టెడు మట్టి తీయలేదు. జిట్టెడు గోడ పెట్టలేదు. ఒక్క కొత్త ప్రాజెక్టుకైనా పునాది రాయి వేయలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్ సర్కారుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అత్యంత పనికిమాలిన పాలనగా ప్రస్తుత హయాం మిగిలిపోతుందని అప్పుడే జోస్యాలు కూడా వినవస్తున్నాయి. మరోసారి గెలుస్తామని కాంగ్రెస్ నేతలే భావించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన ఇమేజ్ పెంచుకునేందుకు సీఎం రేవంత్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నట్టు పైకి తెలిసిపోతూనే ఉంది. తనను వేలుపట్టి నడిపించిన రాజకీయ గురువు చంద్రబాబు తరహాలో విజన్ గురించి ఊదరగొడుతున్నారు. అప్పట్లో బాబు విజన్ 2020 అని హడావుడి చేసేవారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే తరహాలో విజన్ 2047 అంటున్నారు. కాంగ్రెస్ సీఎంగా ఉండి కూడా బీజేపీ ప్రధాని మోదీ పాటను పాడుతున్నారు. 2047 నాటికి రాజెవరో, మంత్రెవరో?