తెలంగాణ గడ్డపై వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అది కోట్లాది మంది జీవనాధారం. ‘రైతు నవ్వితేనే రాష్ట్రం నవ్వుతుంది’ అనే నినాదాన్ని గుండెలకు హత్తుకున్న గడ్డ ఇది. రైతును అన్నదాతగా గౌరవించటం మన సంస్కృతిలో భాగం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తొమ్మిదిన్నరేండ్లలో వ్యవసాయ రంగంలో సాధించిన ఎన్నో విజయాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రైతు స్థితిగతులను విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ఉన్నది.
2018కి ముందు, ప్రతి సాగు సీజన్ ప్రారంభంలో అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతు తిరగటం ఒక చేదు నిజం. ఈ పరిస్థితిని మార్చటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకంగా ఇది చరిత్ర సృష్టించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఏటా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.10 వేలు అందించటం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఈ పథకం కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, అది రైతు ఆత్మగౌరవానికి ప్రతీక. మధ్యవర్తుల ప్రమేయం, అవినీతికి తావులేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు చేరటం వల్ల వ్యవసాయంపై రైతుల్లో నమ్మకం పెరిగింది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కదలిక వచ్చింది. రైతులు సాగు పనులను సకాలంలో ప్రారంభించే వీలు కలిగింది.
పెట్టుబడి కోసం అప్పులు చేసే అవసరం తగ్గటంతో రైతుల ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తెలంగాణ ఏర్పడక ముందు వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది.
అర్ధరాత్రి కరెంటు వస్తే పొలాలకు వెళ్లి పాముకాటుకు గురైన రైతులు ఎందరో. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయటం ప్రారంభించింది. ఇది వ్యవసాయ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి దారితీసింది. నాణ్యమైన విద్యుత్తు వల్ల మోటర్లు కాలిపోయే సమస్య తగ్గింది. రైతులకు విశ్రాంతి దొరికింది. పగటిపూట సాగు పనులు చేసుకోవటం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఉచిత విద్యుత్తు అనేది కేవలం ఒక రాయితీ కాదు, అది తెలంగాణ వ్యవసాయ ఉత్పాదకతను పెంచిన ఒక శక్తివంతమైన సాధనం. ఈ పథకం వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది, తద్వారా తెలంగాణ ‘భారత దేశ ధాన్యాగారం’గా ఎదిగింది.
తెలంగాణ అంటేనే ఎండిన చెరువులు, నెర్రెలు బారిన భూములు అనే ముద్రను తుడిచివేసింది కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం, గోదావరి జలాలను కొండల మీదికి ఎత్తిపోసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నది. దీనికి తోడు ‘మిషన్ కాకతీయ’ ద్వారా వేలాది చెరువుల పునరుద్ధరణ జరిగింది. భూగర్భ జలమట్టం పెరగటం వల్ల బోరుబావుల కింద సాగు విస్తీర్ణం పెరిగింది. నీటి వసతి పెరగటం వల్ల రైతులు వరి మాత్రమే కాకుండా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఒక యజ్ఞంలా సాగటం వల్ల తెలంగాణ నీటి కొరత లేని రాష్ట్రంగా అవతరించింది. పొలాల చెంతకు నీరు చేరటంతో రైతు మోములో చిరునవ్వు చిగురించింది. రైతు చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకూడదనే సదుద్దేశంతో కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ‘రైతు బీమా’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
రైతు ఏ కారణం వల్లనైనా మరణించినా, పది రోజుల్లోనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందేది. రైతు కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించడం విశేషం. ఈ పథకం వేలాదిమంది రైతు కుటుంబాలకు చీకటిలో వెలుగులా పనిచేసింది. కేవలం సాగు మాత్రమే కాదు, రైతు ప్రాణానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం విలువనిస్తుందని ఈ పథకం నిరూపించింది.
2023 ఎన్నికల ప్రచారంలో ‘రైతు భరోసా’ పేరిట ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా మద్దతు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వారి మాటలు నమ్మిన జనం ఆ పార్టీని గెలిపించారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా, రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా అమలుచేసిన పథకాలను కొనసాగించటంలో విఫలమవుతున్నది. రైతుబంధు నిధుల విడుదలలో ఆలస్యం కావటం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్తు కోతలు పెరగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. పంటల సాగుకు వెళ్లాలంటే బ్యాంకుల్లో అప్పులు తీరక, కొత్త అప్పులు పుట్టక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం ప్రాజెక్టుల నిర్వహణను నిర్లక్ష్యం చేయటం లేదా విజయవంతమైన పథకాలను నిలిపివేయటం ఎంతమాత్రం సరికాదు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలి. సాగునీరు, విద్యుత్తు, పెట్టుబడి సాయం అనేవి రైతుకు ఊపిరి. వాటిని అందించటంలో జాప్యం జరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.
కేసీఆర్ హయాం నుంచే తెలంగాణ రైతు ప్రపంచంతో పోటీ పడుతున్నాడు. కొత్త వంగడాలను సాగు చేస్తున్నాడు, సాంకేతికతను వాడుతున్నాడు. ఇలాంటి తరుణంలో వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలి. గిట్టుబాటు ధర కల్పించటం, కొనుగోలు కేంద్రాలను పటిష్టం చేయటంలో చొరవ చూపాలి.
వ్యవసాయ మౌలిక సదుపాయాలను కాపాడుకుంటూ, రైతులను మరింత ఉన్నత స్థానంలో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మాటలు కోటలు దాటడం కాదు, చేతలు కనిపించాలి. రైతు అంటే కేవలం ఆహార ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, ఈ దేశానికి వెన్నెముక. ఆ వెన్నెముక నిటారుగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు రంగంలో వేసిన పునాదిని మరింత పటిష్టపరచాలి. రైతుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే రాజకీయాల కంటే రైతుల అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. తమకు అందాల్సిన సాయం కోసం, శ్రమకు దక్కాల్సిన గౌరవం కోసం తెలంగాణ రైతాంగం ఎదురుచూస్తున్నది. ‘అన్నదాత సుఖీభవ’ అనే సూక్తి కేవలం ఆశీర్వచనంగా కాకుండా, ఒక సామాజిక వాస్తవంగా మారాలి.
-డా. సూర్యదేవర రామకృష్ణ ,94907 54169