చెన్నై, ఆగస్టు 4 : ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఆమె గౌరవానికి భంగం కలిగించేలా ద్వంద్వార్థం వచ్చే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు సమీపంలోని సెంజిపట్టి పోలీసు స్టేషన్లో దాదాపు 9 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం స్టేషన్ బెయిల్‌పై ఆయనను విడుదల చేశారు. ఆయన పోలీసు స్టేషన్లో ఉన్నంత సేపు బయట వందల సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు ఉత్కంఠగా వేచి ఉన్నారు. వెలుపలకు వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో ఉదయనిధి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్‌ని డమ్మీ సీఎంగా అభివర్ణించారు. ఆయనకు రీల్స్ చేయడం తప్ప ఏమీ రాదని, అధికార పార్టీ పేరును స్కూలు పిల్లల నోట చెప్పిస్తారని ఎద్దేవా చేశారు. తాను ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యల్లో ద్వంద్వార్థం ఏమీ లేదని ఉదయనిధి స్పష్టం చేశారు.
ఎవరి గురించి తప్పుగా మాట్లాడనని, ముఖ్యంగా మహిళల గురించి తాను అసభ్యకరంగా మాట్లాడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. నా కుటుంబం నన్ను అలా పెంచలేదు. నాకూ భార్య, కుమార్తె, సోదరి ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళా నాకు అమ్మ, కుమార్తె, సోదరి వంటిది. నేను ద్వంద్వార్థంతో మాట్లాడానని కొందరు అంటున్నారు. కానీ నేను ఒకే అర్థంతోనే మాట్లాడాను అని ఉదయనిధి అన్నారు. అంతకుముందు ఉదయం పోలీసులు అరెస్టు చేస్తారన్న సమాచారంతో భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు చెన్నై నీలంకరైలోని ఉదయనిధి నివాసం వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన డీఎంకే నాయకత్వం ముందస్తు జామీను కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు చేపట్టక ముందే ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. కుమారుడి అరెస్ట్‌పై ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. విజయ్ సర్కార్‌పై మండిపడ్డారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు.