పెంచికల్పేట్, ఆగస్టు 4 : ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల పరిస్థతి రోజురోజుకూ దీనస్థితిగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వైద్య శాఖలో పనిచేస్తున్న వారికి 18 నెలలుగా జీతాలు అందని పరిస్థితి దాపురించింది. ఒక్క పైసా నోచకోక దుర్భర జీవితం గడుపుతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. కమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 22 పీహెచ్సీలు, 5 సీహెచ్సీలు ఉండగా, అందులో 11 మంది సావెంజర్లు పనిచేస్తున్నారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దవాఖానలను పరిశుభ్రంగా ఉంచేలా విధులు నిర్వహిస్తున్నారు. కానీ, 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేకపోవడంతో పొట్టగడవని పరిస్థితి. అత్యవసర సమయాల్లో దవాఖానల్లోని వైద్యులు, సీహెచ్వో, హెచ్సీవో, ఏఎన్ఎంల నుంచి రూ.100 లేదా రూ.200 తీసుకొని కాలం గడుపుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే క్రమంలో జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం, సర్కారు దవాఖానల్లో పనిచేస్తున్న స్కావెంజర్లను ఏదైనా ఏజెన్సీకి అప్పగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వమే జీతాలు ఇవ్వక ఏజెన్సీలకు అప్పగిస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ 18 నెలల జీతాలు ఇవ్వాలని సావెంజర్లు వేడుకుంటున్నారు.
ఈ విషయమై డీఎంహెచ్వో సీతారంను వివరణ కోరగా.. ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న సావెంజర్లకు 18 నెలలుగా జీతాలు రాకపోవడం వాస్తవమేనని తెలిపారు. సావెంజర్ల జీతాల కోసం ఎన్నిసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు చేయడం లేదని పేర్కొన్నారు. నిధుల కొరత వల్లే జీతాలు ఇవ్వలేకపోతున్నామని, సావెంజర్లను ఏజెన్సీకి అప్పగించాలని వైద్యశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ చేశారని, త్వరలోనే అప్పగిస్తామని వెల్లడించారు.