“ఏహే… గండ్లయే నీళ్లు తీసి.. గండ్లనే పోసుడు.. ఇటు మోటర్లు నడుస్తనే ఉంటయ్.. అటు నీళ్లు అండ్లదండ్ల తిరుగుతనే ఉంటయ్… అవ్వొడ్వయ్.. ఇవ్వాగయ్. దోని చప్పుడే గని దొయ్యపారింది లేదు.. పనిలేని ఎవలోనట ఏదో గొరిగినట్టున్నది కథ..” ఇది కాళేశ్వరం కట్టాలని సంకల్పించి, ఆచరణలో ముందుకు తీసుకెళ్తున్న వేళ దక్కిన బహుమానాలు, పొందిన గౌరవాలు. నోటికి ఎంతొస్తే అంత, ఎవ్వలు పడ్తే వాళ్లు. సవాళ్లు విసురుడు, మీసం గీక్కుంటమనుడు, చిటికెలేసుడు.. ఇలా కాళేశ్వరంపై తూలడం ఓ ఫ్యాషన్. తప్పులేదు, ఎవరైనా మాట్లాడొచ్చు.. కానీ, నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడితే అభ్యంతరం ఉండదు. భవిష్యత్తు తరాలకు బోధ చేసినట్టూ ఉంటది.
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు ఉన్నది వర్తమాన పరిస్థితి. అరవై గజాలల్ల కట్టుకునే చిన్న కొంపకే అడ్డమైన ఆలోచండ్లు చేత్తం. వాస్తు చూస్తం, సౌలతులు తెల్సుకుంటం, ఎవల పేర్న మంచిగున్నదని ఎంతోమంది అయ్యగార్లను అడుగుతం. ఎట్లచేత్తె బాగుంటదని తెల్సినోళ్లను, అయినోళ్లను అడిగి నానా హంగామా చేస్తం. అసొంటిది ఒకటి కాదు, రెండు కాదు, లక్షల ఎకరాలకు, కోట్ల రూపాలతో కట్టే ఓ ప్రాజెక్టును గుడ్డిగా మొదలుపెడ్తరా? ఓ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టినప్పుడు అంత తేలిగ్గా నిర్ణయాలు జరుగుతయా? అంతా ఆయనే చేసిండు, అన్నీ ఆయన చేతుల్నే.. అన్నంత ఈజీగా జరిగే అవకాశాలున్నయా? వేలాదిగా శ్రామికులు, వందల మంది ఇంజినీర్లు, మేధావులు, బ్యూరోక్రాట్లు, పనులు నడుస్తున్నంత సేపు అక్కడో ప్రత్యేక జీవనశైలే. ఇలా ఎందరో మనసు పెట్టి, రాత్రనక, పగలనక చేయాల్సిన పనిని.. ఆ ఒక్కరో, ఇద్దరో అన్నీ వాళ్లే అన్నట్టుగా కానిచ్చేశారని అనడాన్ని ఏమనుకోవాలి? గీసుకున్న ప్లాన్, కేంద్రం మార్గదర్శకాలు, ఢిల్లీ పాలకుల అనుమతులు, అభ్యంతర, నిరభ్యంతర పత్రాలు సమగ్రం స్పష్టంగా కండ్లముందు ఉన్న తర్వాత పదేపదే అదే ముచ్చట్లను ప్రజలకు చేర్చాలనే ఆ తాపత్రాయాన్ని ఎలా అర్థం చేసుకోవాలే?
152 మీటర్ల ఎత్తుకోసం గులాబీ దళం పడరాని పాట్లు పడ్డది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాళ్ల బేరానికైనా వెనకాడలే. అసలు ఆ ఏడేండ్లు అటు మహారాష్ట్రల, ఇక్కడ ఉమ్మడి ఏపీల అధికారం హస్తానిదే. పైగా పదేండ్లు సెంట్రల్ల పెత్తనం కూడా చేతిలోనే ఉండే. అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్టుగా ఉన్నప్పుడు 152 మీటర్ల ఎత్తులో కట్టుకుంటామని పర్మిషన్ తేవడం పెద్ద కష్టమేమీ కాదు. మరెందుకు తేలేదు? అక్కడ నీళ్లు లేవు, అంతగా ప్రయోజనం ఉండదు.. అనే అభిప్రాయ సేకరణ తర్వాతే మార్చిన ఆ మహాద్భుత స్థలాన్ని వెక్కిరించడం అవమానకరమే. కమిషన్ నివేదిక గోప్యం, కొన్నికొన్ని విషయాలపైనే ముచ్చట్లతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న ప్రజానీకాన్ని, మరీ ముఖ్యంగా అన్నదాతను మరింత ఆగమాగం చేయాల్సిన అవసరమైతే లేదు.
ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా, కండ్లముందు కనిపిస్తున్నది సజీవ సాక్ష్యమే. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపుహౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే మహాసామర్థ్యం, 240 టీఎంసీల నీటి వినియోగానికి కేరాఫ్, 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. ఇదీ కాళేశ్వరం అంటే. ప్రపంచం అబ్బురపడాల్సిన జాతి సంపద. అన్నారం. సుందిళ్ల. మేడిగడ్డ.. ఇలా ఈ మూడు ప్రాంతాల గుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా గోదారి నీళ్లను తరలిస్తూ, బంగారు నేలను తడుపుతూ, నోళ్లు తెరిచిన బీళ్లనే కాదు, నెర్రెలుబారిన చెరువులను, అడుగంటిపోయిన బావులను, ఇంకిన భూగర్భాలను తడుముతూ నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు.. అనే రొడ్డకొట్టుడును ఢీకొట్టి ‘నీరు మిట్టకెగురు, మెట్ట మురిసి పండును’ అన్నట్టుగా సాధించిన ఓ అద్భుతం.
తమ్మిడి హట్టి.. ఎంత ఒత్తొత్తి పలికినా ఏడేండ్లల్ల తట్ట మట్టి తీసింది లే, పనిని తట్టి లేపిందీ లే. ‘లేస్తే మనిషిని గాదు’ అన్నట్టు అదే కరెక్టయితే ఆ జాప్యమెందుకైనట్టు? కావాలని చేసినా, క్లారిటీ లేక చేసినా అది కరెక్ట్ కాదనేది ఆ చేతల్లోనే, అప్పటి ఘటికుల పనుల్లోనే తెలిసిపోయింది. అసొంటి కాడ మళ్లా మొదలుపెట్టి అదే ఆలస్యాన్ని ఇంకా పెంచుకునుడెందుకు, అనుభవశాలుల మాటలతో ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని చేసిందే ముప్పుకొచ్చిందా? నీళ్లు పారింది కావాలే, పంటలు పండింది కావాలే.. తప్ప మరేమీ పట్టదన్నట్టుగా ముందుకెళ్లిన ఆ సంకల్పానికి సలాం చేయకున్నా పర్లేదు గానీ, అవమానకరంగా మార్చాలని చూస్తున్న తీరే ఆక్షేపణీయం.
రాష్ట్రం ఏర్పడినప్పటి పరిస్థితుల్లో నీళ్ల సౌలతెంతా? ఆర్థిక స్థితిగతులేంటి? బాగుపడ్డ గ్రామాలెన్ని? ఎల్లిపోయిన కొంపలెన్ని? ఇప్పుడు ఇతర రాష్ర్టాల ఆడకూలీలే కాదు, మగకూలీలు సైతం తెలంగాణలో నాట్లు, ఇతర వ్యవసాయ పనుల్లో ఎందుకు బిజీగా మారినట్టు? మారిందేంటి, మారాల్సిందేమిటి? పడావుపడ్డ నేల తల్లిని సైతం గంగతో మార్చేందుకు శ్రమిస్తున్నం. ఆ మాటకొస్తే 2014-15లో 129 లక్షల ఎకరాలు ఉన్న రాష్ట్ర స్థూల పంట విస్తీర్ణం ఎనిమిదేండ్లలో అంటే 2022-23లో దాదాపు 233 లక్షల ఎకరాలకు ఎలా పెరిగింది? ఏడు దశాబ్దాలుగా సాధ్యం కానిది ఈ ఏడేండ్లు, అందునా ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రమంతా పంపకానికి ప్లాన్ చేసిన తర్వాతే ఎలా సాధ్యమైందో అంతా తెలిసిందే. తెలంగాణను వరి గుమ్మిగా మార్చిన ఖ్యాతి కాళేశ్వరంతోనే సాధ్యమైందని పంటలే చెబుతున్నాయి.
ఆఖరికి కాళేశ్వరం ఓ ప్రయోగశాలగా మారింది. పనుల్లో బిజీగా ఉండాల్సిన అన్నదాతలకు సంకట స్థితిగా మారింది. మండు వేసవిలో సైతం మత్తడి దుంకిన చెరువులు, మోట బొక్కెనకు లోతు తెల్వకుండా ఊటపెరిగిన బావులు, నీటిని జాగ్రత్తగా నిల్వ చేసిన ప్రయోగంతోనే క్షణమైన కరెంట్ కోత తెల్వని సౌకర్యం. ఇలా కేవలం ఒక్క ప్రాజెక్టుతో తలరాతలు మారిన తీరు నిజంగా ఆశ్చర్యమే. అలాంటి బృహత్తర ప్రాజెక్టులో లోపాలు సహజం. బిల్డర్ కట్టిన గజాల ఇంటికే నెర్రెలు బారుతున్న సాక్ష్యాలు కోకొల్లలు. నెలలు గడువక ముందే పెచ్చులూడుతున్న పైకప్పులు, కుంగుతున్న గోడలు.. ఇలా ఎన్నో చూస్తున్న మనం ఇప్పుడు ఓ రెండు పిల్లర్లు నెర్రెలు బారడం, దాని మీదే ఫోకస్‌తో అంతా వృథా అన్నట్టుగా తేల్చడం ఏమై ఉంటుంది? పొలంల పారాల్సిన నీరు నేతల పాదాల కింద పారుతుండటంతో జరగాల్సిన నష్టం తరుముకొచ్చే ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. కుంగినా, కూలుతున్నా మరమ్మతులు చేస్తూ నిలబెట్టాల్సిందే తప్ప ప్రయోజనం లేదని నిష్ప్రయోజనంగా వదిలేయడానికైతే లేదు కదా? నీటి చుట్టూ రాజకీయాలు పక్క రాష్ర్టాలతో చేసుకున్నా పర్లేదు గానీ, స్వరాష్ట్ర రైతన్నను బలిపశువును చేయాలని చూడటం చారిత్రక తప్పిదంగా మారే అవకాశం ఉంది.
రాజేంద్ర ప్రసాద్ చేలిక