విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక మహాకవి, తాను రచించిన ‘భక్తి యోగ’ కావ్య సంపుటిని ఒక వ్యక్తికి అంకితం ఇచ్చారంటే, అంకితం పొందిన ఆ వ్యక్తి విశిష్టత ఏమిటో ద్యోతకమవుతుంది.
విశ్వనాథ గుర్తింపు, ఆశీస్సులు పొందిన ఆ వ్యక్తి మరెవ్వరో కాదు.. ఆ రోజుల్లో కరీంనగర్ పట్టణంలో సాహితీ నందనోద్యానవనాన్ని సృష్టించి, కవితా గోష్టుల ద్వారా దాని ఎదుగుదలకు నిరంతరం శ్రమించిన కృషీవలుడు, న్యాయవాది జువ్వాడి గౌతమ రావు.
‘భక్తి యోగ’ అంకితం సందర్భంగా జువ్వాడి గౌతమ రావు గురించి విశ్వనాథ అభిప్రాయం ఆయన పద్యాల రూపంలో…
నిజమునకు భావుకుండని
సృజనన్ పదివేలమంది నెవ్వడొ యొక్కం
డు జనించు, మెఱయు వానికి
రజనీపతి కాంతి భ్రౌ భరమ్మపుడపుడ
వారిలో నొక్కరుండు జువ్వాడి వంశ
రజనికాంతుండు గౌతమరావనంగ
కవికి నట్టిడు నొక చెలికాడు దొరకు
తొలుతటి జనస్సులందలి చెలిమికాడు
కరీంనగర్ పట్టణానికి అతి సమీపంలోని ఇరుకుల్ల గ్రామంలో 1929, ఫిబ్రవరి 1న జన్మించాడు గౌతమ రావు. హైస్కూల్ వరకు విద్యాభ్యాసం కరీంనగర్లో సాగినా, ఆ పై చదువులు భాగ్యనగరంలో కొనసాగి ఓయూ నుంచి బీకాం, ఎల్ఎల్బీ పట్టాలను పొందారు. ఆ తర్వాత కరీంనగర్ పట్టణంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా గౌతమరావు సాహిత్యాభిమాని. స్వతహాగా కవి. అయితే ఆయన ప్రతిభ, న్యాయవాద వృత్తికి, సాహిత్య సేవకు మాత్రమే పరిమితం కాలేదు. వీటితో పాటుగా పత్రికా సంపాదకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన రాణించారు.
హైస్కూల్లో చదివేరోజుల్లో జువ్వాడికి విశ్వనాథ నవలలు చదివే అవకాశం లభించింది. దాంతో ఆయనకు విశ్వనాథ అంటే అభిమానం, గురుభావం ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1953లో జువ్వాడి విజయవాడకు వెళ్లి విశ్వనాథ దర్శనం చేసుకొని పరిచయం పెంచుకున్నారు. దీనితో ఆయనకు విశ్వనాథ రచిస్తున్న ‘రామాయణ కల్పవృక్ష’ పద్యాలను చదివే అవకాశం లభించింది.
జువ్వాడికి విశ్వనాథ అంటే ఎనలేని భక్తి భావన, అందువల్ల రామాయణ కల్పవృక్ష పద్యాలను సాహిత్య సభల్లో జనరంజకంగా చదువుతూ వాటిలోని అంతరార్థాన్ని విపులంగా వివరించేవారు. విశ్వనాథ 1959లో విజయవాడలో పదవీ విరమణ చేశారు. ఇక కరీంనగర్లో ఇప్పుడు ప్రభుత్వ కళాశాలగా ఉన్న ఎస్సారార్ కళాశాల అప్పట్లో ఒక ప్రైవేట్ కాలేజీగా ఉండేది. ఆ కళాశాలకు విశ్వనాథను ప్రిన్స్‌పల్‌గా తీసుకొని రావడంలో విశేష కృషిచేసి కృతకృత్యుడయ్యారు గౌతమ రావు. దీంతో విశ్వనాథ, జువ్వాడిల సాన్నిహిత్యం మరింత బలపడి కరీంనగర్ పట్టణ సాహిత్య దీప్తి నలువైపులా వెలుగులను వెదజల్లింది. విశ్వనాథ వాస్తవంగా పద్యకవి. అయినా ఆయన రామాయణ కల్పవృక్షం రాసే సమయంలో రోజుకు కొన్ని పద్యాలు మాత్రమే రాస్తూ ఉండేవారు. అందువల్ల కృష్ణా జిల్లాలో బాలకాడతో మొదలైన కల్పవృక్షం ముప్పై ఏండ్ల రచనగా కొనసాగి కరీంనగర్లో ఉన్న మూడేండ్లలో యుద్ధకాండతో ముగిసింది. విశ్వనాథ ఆశీస్సులందుకున్న జువ్వాడి సాహితీపరంగా, భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, కాళోజీ నారాయణ రావు, కోవెల సుప్రసన్నాచార్య, సామల సదాశివ లాంటి ప్రముఖులతో సాహిత్య సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఇక ఆయన రాసిన పెక్కు వ్యాసాల్లో ‘కల్ప వృక్షంలో కైకేయి’, ‘వేయి పడగలలో విశ్వనాథ జీవితం’ విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్నాయి. జువ్వాడి వ్యాసాలన్నింటిని వెలిచాల కొండలరావు సంకలనం చేసి ‘సాహిత్యధార’ పేరుతో ప్రకటించారు.
1926 ప్రాంతంలో విశ్వనాథ ఒక సాహితీ మాసపత్రిక ‘జయంతి’ని ప్రారంభించారు. అయితే, ఆర్థిక కారణాల వల్ల ఆ పత్రిక ఎక్కువకాలం కొనసాగలేదు. తర్వాత 1958లో విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటావధాని, కేతవరపు రామకోటి శాస్త్రి, జువ్వాడి గౌతమ రావు సంపాదకవర్గ సభ్యులుగా ‘జయంతి’ పత్రిక పునరుద్ధరించబడింది. సాహితీ దిగ్గజాలు సంపాదక వర్గంలో ఉన్నప్పటికీ దాని నిర్వహణా బాధ్యత అంతా జువ్వాడిదే. ఈ కొత్త బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు జువ్వాడి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి తొలి కవిత ‘జయంతి’లో అచ్చవడం ఒక విశేషం.
ఇక ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, హైదరాబాద్ కాలేజీల్లో చదివే రోజుల్లో జయప్రకాశ్ నారాయణ్ ప్రభావానికి లోనయ్యారు. రామ్మనోహర్ లోహియా వంటి నాయకులతో సాన్నిహిత్యం ఏర్పడింది. వీటి ప్రభావంతో జువ్వాడి సోషలిస్టుగా మారాడు. ఆ రోజుల్లో నిజాం వ్యతిరేక పోరాటంతో హైదరాబాద్ స్టేట్ అట్టుడికిపోతున్నది. 1947, ఏప్రిల్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ భవనం మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది. అది జువ్వాడి పనేనని భావించిన పోలీసులు ‘అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా’ కేసు పెట్టి రెండేండ్ల జైలు శిక్ష విధించారు. అయితే, ఔరంగబాద్ జైలు గోడలు మాత్రం ఆయనను నిర్బంధించలేకపోయాయి. రెండు నెలల్లోనే జైలు నుంచి తప్పించుకొని చాందాకు వెళ్లిపోయారు. చాందాలో స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వియ్యంకుడు కేవీ నరసింగరావు ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాంప్‌లో మిలిటరీ శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌కు వంద మైళ్లు నడుచుకుంటూ వచ్చి మళ్లీ పోరాటం మొదలుపెట్టారు.
సమాజం కోసం ఎంతో పరిశ్రమించినా అప్పట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రభావం వల్ల సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసిన జువ్వాడికి విజయం లభించలేదు. జీవితమంతా సాహిత్య సేవలో, ప్రజా పోరాటాల్లోనూ పాల్గొని, సహృదయుడిగా పేరుగాంచిన జువ్వాడి గౌతమ్ రావు 83 ఏండ్ల వయస్సులో 2012, ఆగస్టు 24 శుక్రవారం రోజున స్వర్గస్థులయ్యారు. కరీంనగర్ పట్టణ సాహితీ నందనోద్యానవనం తన తోటమాలి మరణంతో మౌనంగా రోదించింది.