బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూనే ఇతరత్రా ఆరోపణలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ మీదా అవాకులు చెవాకులు మాట్లాడి తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. లోక్‌సభలో కాళేశ్వరంపై ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన ప్రకటన ఆయన దృష్టికి రాకపోవడం విచిత్రం.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని, తెలంగాణ ప్రభుత్వం తన స్వంత నిధులతోనే ప్రాజెక్టు నిర్మాణం చేసిందని, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కు అన్ని అనుమతులిచ్చిందని, నిర్మాణానికి రూ.80,190 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి షెఖావత్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీటిని వినియోగించి తెలంగాణలో 13 జిల్లాల్లో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం ఇచ్చిందని, పునరావాస కేంద్రాలను నిర్మించిందని ఆయన స్పష్టం చేశారు.షెఖావత్ గారే మరో ప్రశ్నకు జవాబిస్తూ.. ‘దేశంలో 100 శాతం ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ’అని ప్రకటించారు. గతంలో నీతి ఆయోగ్ కూడా తెలంగాణ రాష్ర్టాన్ని ప్రశంసించటం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో నాటి వైఎస్ ప్రభుత్వం డా.బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పేరుతో ప్రాజెక్టుని తలపెట్టింది. 2008లోఈ ఎత్తిపోతల పథకం ప్రారంభించి రూ. 17,875 కోట్లకు అనుమతి మంజూరు చేసింది. ఆ తర్వాత 19 నెలల్లోనే పనులు మొదలు కాకుండానే రూ.38,500 కోట్లకు సవరించింది. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకుండానే టెండర్లు ఖరారు చేసింది. ప్యాకేజీ 3 లో ప్రతిపాదించిన తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పనులు తప్ప అన్ని ప్యాకేజీల్లో పనులు మొక్కుబడిగా మొదలుపెట్టింది. 2010లో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను 40,300 కోట్లకు సవరించి పంపింది. 2014 జూన్‌లో రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాజెక్టుపై మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇతరాల పేర రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. తెలంగాణ ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ నిపుణులతో పెండింగ్ ప్రాజెక్టులను సమీక్షించి వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాలంటే మార్పులు చేయవలసి ఉంటుందని రీఇంజినీరింగ్ చేపట్టినారు. దీని తర్వాత ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,190 కోట్లుగా అంచనా వేశారు. 40,300 కోట్ల అంచనా విలువ 2010 నాటిది. భూసేకరణ చెయ్యక, అటవీ అనుమతులు తేలేక, తమ్మిడిహట్టి బ్యారేజీ సాంకేతిక అంశాలను, మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించక ప్రాజెక్టును 8 ఏండ్లు దేకించిన తర్వాత కూడా ప్రాజెక్టు అంచనావ్యయం రూ. 40,300 కోట్లే ఉంటుందా?
ఈ జలాశయాలను దిగువ గోదావరిలో పుష్కలంగా లభ్యమయ్యే నీటితో పునర్జీవింపజేసి, రీఇంజినీరింగ్తో సమస్యలను పరిష్కరించి మూడేండ్ల రికార్డు సమయంలో ప్రాజెక్టును నిర్మించి రైతాంగానికి నీరు అందించడం జరిగింది. ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ కేసీఆర్ సంకల్ప బలంతో వాటిని అధిగమించి ప్రాజెక్టును సాకారం చేశా రు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా పేరుగాంచింది. ఇది రాష్ర్టానికే కాదు దేశానికి గర్వకారణం. కేంద్ర జలసంఘం నిపుణులు కూడా ఇదొక ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంసించారు.
మేదిగడ్డ బ్యారేజి వద్ద 100 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మసాగర్ జలాశయానికి 10 అంచెలలో నీటిని ఎత్తిపోసే నిర్మాణాలు, బ్యారేజీలు, జలాశయాలు పంప్ హౌజ్‌లు, సొరంగాలు, ప్రధాన కాలువలు అన్నీ పూర్తి అయ్యాయి. ప్రాజెక్టుకు మాతృ జలాశయంగా ఉన్న 50 టీఎంసీల మల్లన్నసాగర్ జలాశయం కూడా పూర్తయింది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, యాదా ద్రి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సాగునీరు అందించే లింకులలో పనులు శరవేగంగా జరుగుతున్నా యి. సమాంతరంగా కాలువల నిర్మాణం కూడా కొనసాగుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త స్థిరీకరణ కలుపుకొని సుమారు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కోటి 80 లక్షల ప్రజానీకానికి తాగునీరు, పరిశ్రమల స్థాపనకు నీరు అందిస్తున్నది. దీంతో తెలంగాణ నుంచి వలసలు ఆగిపోయాయి. ఎల్లంపల్లి,సమ్మక్కసాగర్ బ్యారేజీల మధ్య న 170 కిమీ గోదావరి సజీవమై మత్స్య సంపద పెరిగింది. కనీసం మరో 50 ఏండ్ల వరకు హైదరాబాద్ తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు నీటికి కొరత ఉండదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం అవతరించినందు వల్ల, కేసీఆర్ సంకల్ప బలం వల్ల సాధ్యమైంది.
ఈ పెరిగిన అంచనా వ్యయాల వలన ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని వాదించడం మూర్ఖత్వం.
–సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
(వ్యాసకర్త: వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం)