ఒక సీనియర్ మాజీ ఐఏయస్ అధికారి, మేధావి, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పిన మాటలు వింటుంటే ఆనందం వేసింది. ఎన్నికల వేళ ప్రజలను భ్రమలకు గురిచేసేవిధంగా తెలంగాణలో అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కేటీఆర్‌తో జయప్రకాష్ నారాయణ ఇష్టాగోష్టిలో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆలోచనాపరులకు ఊరట కలిగిస్తున్నాయి.
‘సమభావం, సమన్యాయమే తెలంగాణ మట్టి ఆకాంక్ష అన్న విషయాన్ని రాష్ట్ర సాధన ద్వారా, పాలన ద్వారా అత్యున్నతంగా ప్రతిష్ఠించడం జరిగింది. అందరినీ సమంగా చూసే దృష్టి తెలంగాణ అస్తిత్వవాదానికి ఉన్నది. ఉద్యమ సమయంలో ప్రాంతేతరుల్లో ఉన్న భయాలు, అనుమానాలన్నీ రాష్ట్ర అవతరణ తర్వాత పటాపంచలయ్యాయి. దశాబ్దకాలంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు నెలకొన్న శాంతిభద్రతలు ఎంత పటిష్టంగా ఉన్నాయో దేశం చూసింది. గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి హైదరాబాద్ కేంద్రంగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల మాదిరిగా ప్రగతిరథం దూసుకుపోతుంటే కాంగ్రెస్ కల్లబొల్లి మాట లు చెప్పడం సరైంది కాదు’ అని జయప్రకాష్ నారాయణ చెప్పారు.
ఇది ఎన్నికల సందర్భం కాబట్టి గెలుపు కోసం, కుర్చీల కోసం, తమ పాత పెత్తందారీ పీఠాల కోసం అబద్ధాలను నిజాలు చేసి, నిజాలకు అబద్ధాలను అల్లి ఎైట్లెనా మాట్లాడవచ్చునని కొందరు నాయకులు నాలుకను ఎటంటే అటు తిప్పేస్తున్నారు. వీటికి సరైన సమాధానాన్ని ఆలోచనాపరులు వివేకవంతులే చెప్పాలి. విజ్ఞులనుకున్నవారు సత్యాలను, అసత్యాలను విడమర్చి చెప్పాలి. ఈ పనిని ఎన్నికల సమయంలో తప్పక చేయాలని జయప్రకాష్ చెప్తున్నారు. రాష్ట్రం ఏమైపోయినా బాధ లేనివాళ్లు, పట్టించుకోనివాళ్లు, అధికారపీఠాల లెక్కలు మాత్రమే చూసుకునే వాళ్లకు ఈ గరుకు బీడు భూములపై ప్రవహించిన జలాలు కనిపించకపోవడం విచారకరం. రాష్ట్ర పునర్నిర్మాణంలో మార్పులను చూడలేనివారు అబద్ధాలను మాత్రమే విషప్రచారం చేయగలరని కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నది. కొత్త తరం పిల్లలు ఈ అసత్యాల మాటలు విని గందరగోళం పడకండి. గాంధీ మహాత్ముడు చెప్పిన ‘చెడు వినకు, చెడు కనకు, చెడు చూడకు’ అన్నవి కాంగ్రెస్ నాయకుల దృష్టిలో ‘చెడు వినాలి, చెడు కనాలి, చెడు చేయాలి’ అన్నట్టుగా మారినట్టుంది. అందుకే వాళ్లు అబద్ధాలే తమకు ఓట్లు తేగలవని భావిస్తున్నారు. ప్రజలు చరిత్రకారులన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఈ మట్టి మీద ఆలోచన ఉన్నవాడే, ప్రజల మీద ప్రేమను గుండె నిండా నింపుకొని సంపద పెంచుతాడు, సంపద పంచుతాడు, ప్రజా సంక్షేమాన్ని ప్రాణంగా చేసుకొని పథక రచనవుతాడు.
‘ఈ చెట్లకు పూలెందుకు పూస్తాయి? బుల్లెట్లెందుకు కాయవని’ అడిగిన గుంటూ రు శేషేంద్ర శర్మ కవి అంతరంగం సుపరిచితమే. కానీ, ఈ కాంగ్రెస్ వారి అంతరంగం మాత్రం ఎవరికీ అంతుబట్టదు. వీళ్ల నోళ్లకు అబద్ధాలే పూస్తాయి, అబద్ధాలే కాస్తాయి. అసత్యాలే వాళ్ల బాటలైతాయి. చరిత్ర అబద్ధాలను క్షమించదని చరిత్ర ఎన్నిసార్లు చెప్పినా చరిత్ర హీనులు మాత్రమే అబద్ధాలను, అసత్యాలను సత్యాలుగా భ్రమింపజేస్తారు. రాజకీయాలను అసత్యాల భ్రమల్లో ముంచితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. 75 ఏండ్లు వివిధ రాష్ర్టాల్లో, కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ అసత్య రాజకీయా లే అమలు జరిపింది. అందుకే మన దేశానికి ఈ దుస్థితి. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంతో తనను తాను పునర్నిర్మించుకునేటప్పుడు ఈ అసత్య, అబద్ధపు రాజకీయాలను తిప్పికొట్టి తీరుతుంది. ‘సత్యమేవ జయతే’..
-జూలూరు గౌరీశంకర్