‘ఈ దేశానికి పెదాని నేనురా… ఇక దేశమంతా స్కాములతో లూటిరా…’ ఆ ఒక్కటీ అడక్కు సిన్మాలో అటుకులు చిట్టిబాబు లెక్క నాత్రికి నాత్రే రాజయిపోయినట్టుగా .. మన సత్నారి గాడు గూడ నాత్రికి నాత్రే పెదాని అయిపోయినట్టుగా కల గంటూ మంచంలో తెగ ఊగిపోతున్నడు. తెల్లారి పదిగొడ్తున్నా ఇంకా లెవ్వకపోయేసరికి సత్నారి గానికి ఏమన్నయిందా ఏందని ఇత్తారి గానికి డౌట్ గొట్టింది. బకీటెడు నీళ్లు దీస్కొచ్చి మొకం మీద కుమ్మ రిచ్చిండు. అసలే సలికాలం.. నాత్రంతా గోలెంల మలెవడి ఉన్న నీళ్లు ఒక్కసారి కుమ్మరిచ్చేసరికి సత్నారి గాడు గజ్జుమని లేసిండు. సత్నారిగాడు లేసి సూసేసరికి ఇత్తారిగాడు పళ్లిగిలిచ్చుకుంటా పకపకా నవ్వవట్టిండు.
‘వార్నీ ఇత్తారి.. ఇది కలనేనా? నేనింకా పెదాని గాలేదా?’ అని సత్నారి ఇచిత్రంగా అడిగేసరికి… నువ్వేందీ, నీ కథేందీ… ఈ పెదాని అవుడేంది అన్నట్టుగా సత్నారి గాడు బిత్తరవోయి సూసిండు.
‘వారి సత్నారి ప్యాదనో, సాదనో నీకో పిల్లను జూసి జెల్ది లగ్గం జెయ్యాల్రా.. లేకుంటే నువ్వు ఆగమైపోయేటట్టున్నవ్’ అని అదే మంచం మీద గూసొని ఇత్తారి గాడు ఒక్కతీరుగా రందివడ్డడు. ఇంతల బ్రహ్మానందం రేంజ్ల కండ్లను తుడ్సుకొని మంచంలకెళ్లి లేసి… ‘లేదురా ఇత్తారి.. ఈ దేశానికి నేను పెదాని అయినట్టు నాకీ మజ్జన రోజు నాత్రి కలలు వడ్తున్నయ్రా’. అని ఇత్తారి గానితోని శెప్పిండు.
‘మా సాలుగని నువ్వూ, నీ ఏశాలు. ముందుగాళ్లయితే నువ్వో ఇంటోనివి గార. అప్పుడు కట్టసుఖాలు దెలుస్త యి. లేకుంటే తాడుబొంగురం లేనోడు దేశాన్ని ఎట్లా ఏలుతడని జనాలు ఎక్కిరిత్తర్రా?’ అని ఇత్తారి గాడనేసరికి సత్నారి గానికి ఎక్కన్నో కాలింది. పాసువండ్లు తోముకుంటా.. సత్నారి గాడు నోట్లె నోట్లె ఏమో గులిగిండు. ఆ మాటలు ఇత్తారి గానికి అస్సల్కే అర్థం గాక తలికాయ వట్టుకున్నడు.
‘ఒహ్హో.. పెండ్లికి, పెదాని పదవికి ఏం సంబంధం అంటున్నవా?’ అని అర్థమైనట్టు ఇత్తారి గాడు తలికాయ ఊపిండు..
సత్నారి గాడు కాదన్నట్టుగా ‘ఆమ్.. ఊమ్… ఆహా..’ అని చేతిలున్న యాప పుల్ల నేలగ్గొట్టేసరికి మజ్జన.. ‘ఆగాగు సత్నారి గాని బాధ’ నేన్జెప్తా అనుకుం టా లచ్నారి (రేరె) గాడొచ్చిండు. ఎన్నటికైనా తెలంగాణ రాష్ర్టానికి సీఎం గావాలనేది లచ్నారి గాని కల.
‘చెప్పురా లచ్నారి.. సత్నారి గాని బాధ ఏందో’ అని ఇత్తారి గాడు అడిగేసరికి…
‘ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న పెదాని సారుకు పెండ్లయిందా, ఆయన దేశాన్ని పాలిస్తలేడా?, నేన్గూడ గట్లనే పాలిస్తా’ అని శెప్పిండు సత్నారిగాడు అని లచ్నారి గాడు ఇత్తారి గానికి శెప్పిండు.
‘ఒక్కసారి సంబురం పొంగుకొచ్చి సత్నారి గాడు ఊమ్ ఊమ్…’ అని అతడు సిన్మాల త్రిష రేంజ్లో నవ్వవట్టిండు.
‘అరేయ్ బాబులూ… ఇల్లూ, ఇరవాటం.. పెళ్లాం, పిల్లలు.. పిల్లా, జెల్లా ఉంటేనే సంసారం ఇల్వ దెలుస్తది. ఇప్పుడున్న పెదానిగ్గూడ అవేం దెల్వవు గావట్టే ఉప్పూ, పప్పు కాన్నుంచి అన్ని ధరలు ఇట్టమున్నట్టు వెంచిండు. గందుకే ఆయ్నను గూడ జెనాలు పొట్టుపొట్టు తిడ్తున్నర్రా’ అని ఇత్తారి గాడు శెప్పంగనే సత్నారిగాడు తానానికి వోయిండు, లచ్నారి గాడు అక్కన్నుంచి బిచాణా ఎత్తేసిండు. ఇట్లుంటది ఈళ్లతోని..