ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అనే మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నది. ఈ నిర్ణయం ఉపాధ్యాయులను అవమానించడమే కాదు, వారి నిబద్ధతపై అపనమ్మకం చూపించడం కూడా. ఉపాధ్యాయులు సమాజానికి మూలస్తంభాలు. వారు చదువు చెప్పేవాళ్లే కాదు, విద్యార్థులకు మార్గదర్శకులు, స్ఫూర్తిదాతలు. అలాంటి ఒక గౌరవనీయమైన వృత్తిని ఒక మొబైల్ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించడం వారి ఆత్మగౌరవాన్ని కచ్చితంగా దెబ్బతీస్తుంది. ఈ చర్య ద్వారా ఉపాధ్యాయ వృత్తిని తక్కువచేసి చూడటమే అవుతుంది.
ఉపాధ్యాయుల పనితీరుపై ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదనడానికి ఈ చర్యే ఒక ఉదాహరణ. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే లక్షలాది మంది ఉపాధ్యాయులను ఇది అవమానించినట్లే. కొద్దిమంది ఉపాధ్యాయులు గైర్హాజరైనంత మాత్రాన, యావత్తు ఉపాధ్యాయ వర్గాన్ని నిఘా నీడలోకి తీసుకురావడం సరికాదు. ఈ విధానం ఉపాధ్యాయుల పట్ల సమాజానికి ఒక చెడు సంకేతాన్ని పంపుతుంది. ఉదయం, సాయంత్రం హాజరు వేసే సమయంలో సిగ్నల్ సరిగా రాక ఉపాధ్యాయులు చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని పాఠశాల ఆవరణ మొత్తం తిరుగాల్సి వస్తున్నది. దీంతో విద్యార్థులు చాలా వింతగా చూస్తుండటం ఉపాధ్యాయులను అసౌకర్యానికి గురిచేస్తున్నది.
ఉపాధ్యాయులు సకాలంలో హాజరవుతున్నారా లేదా అని పర్యవేక్షించడానికి పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, మండలస్థాయిలో మండల విద్యాశాఖాధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారులున్నారు. ఉపాధ్యాయులు ఎవరైనా సమయపాలన పాటించకపోతే వీరు షోకాజ్ నోటీసుల లాంటివి జారీచేసి చర్యలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 612 మండలాలు ఉంటే, 596 మండలాలలో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 66 డిప్యూటీ విద్యాధికారి పోస్టులుంటే, అందులో 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే, 26 జిల్లాలో డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా ఖాళీగా ఉన్న పర్యవేక్షణాధికారుల పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులను పర్యవేక్షించాలనుకోవడం నిజంగా అవివేకమే.
అధికారంలోకి వస్తే విద్యారంగానికి బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 7.57 శాతం నిధులను మాత్రమే కేటాయించి మోసం చేసింది. ఈ విషయాన్ని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు గమనిస్తున్నాయి. తమకు రావాల్సిన డీఏల కోసం, పెండింగ్ బిల్లుల కోసం, పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తుంటే, మరొకవైపు ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ఉపాధ్యాయులను అభద్రతాభావానికి గురిచేస్తున్నది. అయినా, విద్యా ప్రమాణాలు పెరగాలంటే, ఉపాధ్యాయులపై నమ్మకం ఉంచి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.