కాళేశ్వరం.. ఓ వాస్తవం. గిట్టనివారికి కండ్లముందు కనిపించే చేదు నిజం. నీరు వరప్రదాయిని. ఒడిసి పడితే మనుగడ.. వదిలేస్తే కొట్లాడే దుబ్బలో మునుగుడే కదా. కొద్ది కాలమే అవకాశం.. అప్పుడే దాచుకోవాలి.. వాడుకోవడానికి నిల్వ చేసుకోవాలి. దశాబ్దాలుగా చినుకు రాలడం.. తెలంగాణ రైతాంగం నుదుటన మృదువుగా స్పృశించడం.. చిన్నబోతున్న విషణ్ణవదనాలతో మట్టిని ముద్దాడటం.. ఆపేవారు లేక, అక్కరకు రాకుండా పోతున్నాననే దిగులుతో జారుతూ సంద్రాన కలువడం.
నాడు వలస పాలకుల తీరుతో దు:ఖించడానికి కూడా కన్నీళ్లు ఇంకిన రోజులతో కాలం వెల్లదీయాల్సిన దౌర్భాగ్యపు స్థితి తెలంగాణది. బతికి చెడిన రోజులను తల్సుకుంటూ, చెడి బతకాల్సిన దుస్థితిని తట్టుకోలేక పట్టెడన్నం పెట్టే రైతులు పిట్టల్లా రాలుతున్నా దిగమింగుకోవాల్సిన దౌర్భాగ్యం.
రాజకీయం ఎప్పటికీ ఉండేదే.. పాలకుల స్వభావం మారుతూ కనిపించేదే. మారాల్సినవి మార్చకుండా, మారకూడని వాటికోసం సమయాన్ని వృథా చేసుకోవడం కన్నా హీనం మరోటి లేదనే విషయాన్ని అర్థం చేసుకున్న వారు అతి కొద్దిమందే ఉంటారు. జరిగిందేమిటి? జరగాల్సింది ఏమిటి? అనే దూరాలోచన ఉన్నవారే జంకు, బొంకు లేకుండా చేయాల్సింది చేయడానికి సంకల్పిస్తారు. కళ తప్పిన బతుకులు.. కళావిహీనం చేసిన దగుల్బాజీలు.. కండ్లముందు కనిపిస్తున్న వనరులు. ఇవే ఆ మహనీయుడిని అప్పుడు ప్రేరేపించాయి.. ఉసిగొల్పాయి.. నడిపించాయి. బలం ఉన్నదా.. లేదా.. అనేది అప్పటి పరిస్థితులకు అప్రస్తుతం. సహకారం దక్కుతుందా, దక్కదా అనేది నాటి అవసరాల ముందు అనవసరం. సంకల్పం గట్టిదైనప్పుడు అడుగు పడుతుంది.. వనరులు సమకూరుతాయి.
ఏడు పదుల వయసున్న బలవంతపు కాపురానికి ఒక్కరంటే ఒక్కరూ ఒరగబెట్టింది లేదు. నీటికి ముకుతాడు వేసి మరీ తీసుకెళ్లే ప్రయత్నాలు చేసిన వారిని ఆపేవారు అంతకన్నా కరువయ్యారు. చీకట్లెన్ని అలుముకున్నా.. తాకట్లు ఎన్నిపెట్టినా.. ఆరోపణలు చేసినా.. అపవాదులు అంటగట్టినా.. వివాదాలు ముసిరినా.. విచారణలు జరిగినా.. కాళేశ్వరం ముమ్మాటికీ ఓ చరిత్రే.
మనుషులెవరు అనేది అక్కర్లేదిక్కడ, పార్టీలేమిటనేది పట్టించుకోవాల్సిన అవసరం లేని ముచ్చట. ప్రయత్నానికి శ్రీకారం చుట్టినవారే కీలకం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా ఆపకుండా ముందుకు తీసుకెళ్లే భగీరథ ప్రయత్నాలే అతి ప్రధానం. నవ్వులపాలైన తీరును పూడ్చుకుంటూ, కొత్త ఇంటికి కావాల్సిన వాటిని సమకూర్చుకుంటూ వెళ్లినవారే ముఖ్యం.
తోలు కప్పుకున్నంత మాత్రాన పులవుతుందా? రంగుకు పులకించినంత తేలిగ్గా ఊసరవెల్లిని ఇష్టపడతారా? ఎత్తిపోసుడో.. దించిపోసుడో.. ఏదైతేనేం ఎక్కడిదో నీరు మరెక్కడెక్కడికో. ఎత్తని లేదు.. పల్లమని లేదు.. అన్నింటినీ తాకుతూ ప్రకృతి అందరికీ, సంపద ప్రతి ఒక్కరిది అన్నట్టుగా మొత్తం తెలంగాణకే తలమానికంగా మారిన ప్రాజెక్టు కాళేశ్వరం. నెర్రెలుబారిన చెరువులకు కళ ఎట్లా వచ్చిందో.. మండు వేసవిలో సైతం చిన్న కుంట కూడా నిండుకుండలా మారిన తీరు ఎలా సాధ్యమైందో రాష్ట్రం సాధించిన తర్వాత అంతా చూసిందే, అందరికీ తెలిసిందే. దూప తీర్చాలి.. నేలమ్మ కడుపు పండాలనేది కేసీఆర్ కట్టుకున్న కంకణం.. పెట్టుకున్న లక్ష్యమనేది గుర్తించి యావత్ ప్రపంచమే కొనియాడింది. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను ఆయన సమీక్షించిన విధానం.. సహకారం కోసం తపన పడిన సారు తీరును అంతా శ్లాఘించారు. కానీ, చూడలేక కండ్లు మూసుకున్న వారూ కోకొల్లలు అనేది కాలక్రమేణా తేటతెల్లమైంది.
మునిగితే తేల్చాల్సిన అవశ్యం ఉంటుంది. కూలితే నిలబెట్టాల్సిన తరుణాన్ని ఆలోచించాలి. ప్రయోజనాలు పార్టీలకు ఆపాదించకుండా, శాశ్వతాలుగా, సర్వజనులు మెచ్చేవిగా చేస్తే చరిత్ర సృష్టించడం ప్రతి ఒక్కరికి సాధ్యమే అనేది కాలం నేర్పిన సత్యం. తాము చేస్తే ఎవరికో ఏదో దక్కుతుందని, ఆ కొద్ది వాటిని తామెందుకు మీదేసుకుని చేయాలనే వక్రంతో ఆలోచిస్తే ఒరిగేది మేడిగడ్డ కాదు.. కూలేది కాళేశ్వరం అంతకన్నా కాదు.. తప్పకుండా రైతుల ప్రయోజనాలే కూలుతాయి, జనం అవసరాలే కుంగుతాయి.
సమయం చాలా వేగవంతమైనది. అన్నింటికీ అదే పరిష్కార మార్గాలను చూపుతుందనడానికి జరుగుతున్న ఘటనలే సాక్ష్యం. విచారణలు జరగనీ గాక.. వేధింపులు, సాధింపులు కొనసాగనీ గాక.. దిద్దుబాట్లు చేయకుండా నింపాదిగా గడుపుతామంటే గుర్తుపెట్టుకోవడం ఏమో గానీ, గుర్తులే లేకుండా చేసే మొండి బలం ముమ్మాటికీ కాలానికే ఉన్నది. కోట్లాది జనాభాకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు పెట్టేవారు ఒక్కరి కోసమో, కుటుంబం కోసమో పరిస్థితినంతా ఉపేక్షిస్తూ, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తే అది పరాయిపాలవుతూనే ఉంటుంది. బతుకులు ‘ఎప్పటి చిప్ప ఎనుగుల్నే’ అన్నట్టుగా మారుతాయి. గుంట భూమిలో కట్టే ఇంటిగోడలకే కాలక్రమేణా బీటలు వారడం సహజం. ఒక్కరిద్దరితో పని చేసే కట్టడంలోనే లోపాలు పొడసూపడం అతిసాధారణం. అంతమాత్రాన ఆ కట్టడమే తప్పు.. ఈ ఒక్కరిద్దరితోనే తలనొప్పి..
అంటూ తిడుతూ కూర్చుంటే ఒరిగేదేముండదు.. సాగేది అంతకన్నా లేదనేది జగమెరిగినదే. అలాంటిది అంతటి మహా కట్టడంలో ఆ మాత్రం లోపాలను వల్లె వేస్తూ కాలాన్ని సాగదీయడం ఎంతటి విచిత్రమో మేధావులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఉపాయం ఆలోచించాలి.. ప్రత్యామ్నాయం కనుగొనాలి.. బుంగలో, బీటలో పూడ్చాలి. ఇంకా ఏమైనా ఉంటే సరిదిద్దాలి. అటు దాని పని దానిదే.. ఇటు వీరి పని వీరిదే అన్నట్టుగా సాగిస్తే శభాష్ అంటారు తప్ప, కక్ష సాధింపు నెపంతో ఒకే కక్ష్యలో తిరిగితే బొక్కబోర్లా పడటం ఖాయం. పల్లమెరిగిన నీటికి పైకెరగడం చూపిన నేర్పరిని పలుచన చేయాలనే నిషాలో, అదే పైకి చూస్తూ కింద నడుస్తామంటే మునిగేదెవరో మేధావులకు తెలియనిది కాదు. ఏదేమైనా నీరు ఉన్నంత వరకు కాళేశ్వరం.. ప్రాజెక్టు పగలబడి నవ్వినన్నాళ్లు పంటలు పచ్చగా కళకళలాడుతుంటాయి. గొప్ప మనుషుల ఆలోచనలు ఎప్పుడూ చరిత్రగానే మిగులుతాయి.