ఇంట గెలిచి రచ్చ గెలువమన్నది పెద్దలు చెప్పే హితవు. ఒక ముఖ్యమంత్రి ఇంట గెలవడమంటే తన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించి, ఇంటిని చక్కదిద్ది, ప్రజల మనసులను ఆకట్టుకొని పునాదిని పటిష్ఠపరుచుకోవడం. ఆ పని చేసినప్పుడు తన ప్రతిష్ఠ బయట కూడా విస్తరిస్తుంది. ఇంట గెలవడంలో తగు అనుభవాలు రావటం వల్ల రచ్చ గెలిచేందుకు ఆధారాలు ఏర్పడుతాయి. ప్రజలు సైతం తన వెంట నిలుస్తారు. అంతమాత్రాన రచ్చ గెలిచి తీరుతారనే హామీ ఉండకపోవచ్చు, అది పరిస్థితులపై ఆధారపడి కూడా ఉంటుంది. కానీ, తన స్థానిక రంగం మాత్రం అందుకు సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ పెద్దల హితవు తెలియదనలేము. కానీ, ఎందువల్లనో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మొదట ఇంట ఓడి, ఇప్పుడు రచ్చ కూడా ఓడుతున్నారు.
ఇందులో ఆశ్చర్యం లేదు. ఇంట గెలిచి పునాదిని సృష్టించుకోనప్పుడు అనివార్యంగా బయట కూడా ఓటమి ఎదురవుతుంది. రేవంత్ రెడ్డి గత 15 మాసాలుగా ఇంట ఓడటాన్ని చూస్తూనే ఉన్నాం. అందుకు జాతీయస్థాయిలో గానీ, ఇతర రాష్ర్టాలలో గానీ, కొంతకాలం వరకూ ప్రచారం రాలేదు. ఒక విషయం మనకు ఇక్కడ ఎంత ముఖ్యంగా తోచినా, బయటివారికి తమ ప్రపం చం తమకు ఉంటుంది. ఏదైన చాలా పెద్ద పరిణామమో, సంచలనాత్మకమో అయితే తప్ప, ఆ వార్తలు వారి ప్రపంచంలోకి ప్రవేశించవు. ఆ ప్రకారం చూసినప్పుడు, రేవంత్ రెడ్డి పేరంటూ బయటివారు మొదటిసారిగా విన్నది 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచినప్పుడు. ఆ వెంటనే పేరు మరిచిపోయారు కూడా. అందులో వారికి కనిపించింది తాము ఎంతగానో విన్న, ప్రశంసించిన, కేసీఆర్ అనూహ్యంగా ఓడటమే తప్ప, రేవంత్ రెడ్డి ఒక చర్చనీయాంశం కాలేదు. తర్వాత కాలంలో ఆయన గురించి అంతో ఇంతో తెలుసుకున్న సమాచారం కూడా, తనకు విలువ ఏమీ తెచ్చిపెట్టటం లేదు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిండు ఏడాది కాలమంతా అనామకంగానే గడిచిపోయింది. ఆ కాలంలో ఆయన ఢిల్లీలో అధికారిక హోదాలో పలు సమావేశాలలో పాల్గొన్నప్పటికీ ఎవరి దృష్టికీ పెద్దగా రాలేదు. అటువంటి సందర్భం మొదటిసారిగా 2024 నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ, 20 25 ఫిబ్రవరి నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో ఏర్పడింది. ఒకవేళ ఆయన అంతకుముందు ఏడాది కాలంలో తెలంగాణలో తన పరిపాలన ద్వారా ఇంట గెలవడం అన్నది జరిగి ఉంటే ఆ దృష్టి సానుకూలంగా ఉండేది. అటువంటిది లేకపోగా ఆ రెండు రాష్ర్టాలలో తన ప్రచార ధోరణులు ఎదురు తిరిగి తనకే ప్రతికూలంగా మారాయి. అందుకు మూడు విషయా లు తోడయ్యాయి. ఒకటి, తెలంగాణలో ఇచ్చిన హామీల అమలులో, ఇతరత్రా కూడా వైఫల్యా లు. ఆ వివరాలు బయటి ప్రజలు అప్పటికే ఒక మేర వినగా, అక్కడి కాంగ్రెస్ ప్రత్యర్థులు చేసిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మరికొం త తెలిసివచ్చాయి.
రెండు, తన ప్రచార సమయంలో అక్కడి పత్రికలలో తెలంగాణ హామీల అమలు గురించి అబద్ధపు ప్రకటనలు ఇవ్వ టం, మీడియా సమావేశాలతో పాటు బహిరంగ సభలలో అవే అబద్ధాలు చెప్పడం, వీటిని తలదన్నుతూ ఆ బయట రాష్ర్టాలలో కాంగ్రెస్ హామీల అమలు బాధ్యత తనదని సాహసోపేతంగా ప్రకటించటం. అవన్నీ ఆయనను నవ్వుల పాలు చేశాయి. ఇక మూడవది, ఇంత చేసినా మహారాష్ట్రలో కాంగ్రెస్ సీట్లు పోయినసారి కన్నా తగ్గగా, ఢిల్లీలో గత రెండు మార్ల వలె ఈసారి కూడా సున్నా దగ్గరే ఆగిపోవడం.
యథాతథంగా ఈ పరిణామాలే రేవంత్ రెడ్డికి నవంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 4 నెలల కాలంలో ‘జాతీయస్థాయి గుర్తింపు’ను మొదటిసారి తెచ్చిపెట్టగా, ఆ తర్వాత కొద్ది వారాలకు ఆయన ఢిల్లీ ఫలితాల గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఉలిక్కిపడేలా చేసి, ఆ ‘గుర్తింపు’ను మరింత పెంచాయి. ఢిల్లీలో ఆప్ ఓటమికి కాంగ్రెస్ నెగెటివ్ పాత్ర ఒక కారణమని అందరికీ అర్థమైంది. అయితే, తమ పాత్ర గురించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దౌత్య నీతి చాతుర్యంతో మాట్లాడుతూ, తాము ఆప్ వైఫల్యాలను ప్రజల దృష్టికి బాగానే తీసుకువెళ్లగలిగాము కానీ, బీజేపీని ఓడించలేకపోయాం అన్నారు. దౌత్య నీతిలో తగినంత కపటం ఉంటుందని తెలుసు కానీ, రేవంత్ రెడ్డికి దౌత్యం, కపటం రెండూ తెలియవు గనుక, కనీసం ఈ సందర్భంలోనైనా తెలియలేదు గనుక, ఆ పార్టీ కాంగ్రెస్‌ను హర్యానాలో ఓడించిందని, అందువల్లనే తాము వారిని ఢిల్లీలో కావాలనే ఓడించామని కన్ఫెషన్ బాక్స్‌లో నుంచి మాట్లాడినట్టు ప్రకటించి వేశారు. ఢిల్లీ ఎన్నికల చర్చ జాతీయస్థాయి లోఇంకా సద్దుమణగలేదు కనుక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనమయ్యాయి. ఇంతకూ విషయమేమంటే ఆ సరికి ఆయనకు లభించడం మొదలైన జాతీయస్థాయి నెగటివ్ గుర్తింపు, ఈ వ్యాఖ్యల వల్ల మరింత పెరిగింది. రచ్చ ఓడటం విస్తరించింది.
ఇదంతా గతం. ఇక వర్తమానానికి వద్దాం. గతం గురించి ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, వర్తమానానికి గతం ఒక నేపథ్యంగా పనిచేస్తుంది కనుక. ఇంకొంత సూటిగా మాట్లాడుకోవాలంటే, ఏడాది కాలం ఇంట ఓడిన ముఖ్యమంత్రి ఆ పునాదులపై నిలిచి రచ్చ ఓడటం ఈ విధంగా మొదలైందన్నమాట. ఇంట ఓడిన తీరు ఏమిటో ఈసరికి తెలంగాణలో ఆబాల గోపాలానికి తెలిసిందే గనుక, బహుశా ఇక్కడ మళ్లీ రాయనక్కరలేదు. ఇంకా చెప్పాలంటే వైఫల్య సమాచారాలు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అంతటా వ్యాపించడం మొదలైంది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను గత ప్రభుత్వంపైకి నెట్టజూస్తున్నారని అందరికీ అర్థమైంది. గత ప్రభుత్వ విజయాలు మరింతగా తెలిసివచ్చాయి. కష్టాలు ఒంటరిగా రావన్నట్టు, అప్రతిష్టలు ఒంటరిగా రాకపోవటమన్నది గమనించవలసిన మరొక ముఖ్య విషయం. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రస్తుతం మూ డు మిగిలాయి. తెలంగాణ వలెనే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక కూడా హామీల అమ లు వైఫల్యాలతో పాటు ఇతరత్రానూ చెడ్డపేరు తెచ్చుకుంటున్నాయి. దానితో, జా తీయస్థాయిలో, దేశవ్యాప్తంగా మొ త్తం మూడు రా ష్ర్టాలను కలిపి చర్చిస్తున్నారు. మూడింటికి ‘అంటుల్లా’ అయిందన్నమాట. ఇది చాలదన్నట్టు కాంగ్రెస్ తనదే పెత్తనం అన్నట్టు నడిపించజూసిన ఇండియా కూటమి చిందరవందర అవుతుండటం, రాహుల్‌గాంధీ నాయకత్వ బలహీనతలు గతంలోనే తెలిసినా ఇప్పుడు మరింత బయటపడటం అనే వాటి ప్రభావాలు రేవంత్ ప్రతిష్టను ఇంకా నష్టపరుస్తున్నాయి.
సరిగా ఈ పరిణామ క్రమాల నుంచి మొదలై, పూర్తిగా ఇటీవలి వారాలు, నెలల్లో జరుగుతూ వస్తున్నవి కొన్నున్నాయి. రేవంత్‌రెడ్డి గురించి ఇప్పుడు తగినంత తెలిసింది గనుక, ఆయన మాటలను, చేతలను బయటివారూ లోగడ కన్నా ఎక్కువగా గమనించడం మొదలైంది. ప్రశ్నించడం కూడా.
తాను అధికారంలోనైనా లేని పదేండ్ల క్రితం ఓటుకు నోటు కేసును తిరగదోడి ప్రశ్నించడం నుంచి మొదలుకొని, కేవలం కేసీఆర్‌ను బదనాం చేయాలనే ఉద్దేశంతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుత లోటుపాట్లను బీఆర్ఎస్ పాలనకు ఆపాదించజూసిన బలహీనపు ఎత్తుగడల వరకు అన్నీ జాతీయ మీడియాకు, పార్టీలకు, పారిశ్రామిక వర్గాలకు, పరిశీలకులకు అర్థమైపోతున్నాయి. హామీలకు, జీతాలకు, అభివృద్ధి వ్యయానికి డబ్బు లేదని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పటం అందుకు కేసీఆర్ అప్పులు కారణమనటం, ఓట్ల కోసమే అలవి కాని హామీలిచ్చామనటంతో తన పరువు అక్కడి యమునా నది మురికిలో కలిసింది. ఆ విధంగా తనకు రాష్ట్రస్థాయిలో ఇంకా ప్రతిష్ట రాకముందే అప్రతిష్ట మొదలైనట్టు జాతీయస్థాయిలోనూ ప్రతిష్ట ఎప్పుడు కలగకపోగా అప్రతిష్ట మొదలై పెరుగుతున్నది. ఇంట ఓడిన సీఎం రచ్చ ఓడుతున్నా రు. చివరికి ఆయన పేరు సైతం ఇక్కడ పలువురికి వెంటనే గుర్తుకు రాకపోతున్నట్టు, జాతీయస్థాయిలోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నది.
దీనంతటికీ కొసమెరుపు అన్నట్టుగా రేవంత్ రెడ్డి భాషా వైదుష్యం కూడా తెలంగాణ జిల్లాలను దాటి ప్రయాణించడం మొదలైంది. తాజా ఉదంతం ఆయన ఇద్దరు మహిళా జర్నలిస్టుల గురించి సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ వారి బట్టలూడదీసి కొడతానని, ఊరేగిస్తానని హెచ్చరించడం, ఇది తెలిసిన బయటి జర్నలిస్టులే గాక అందరూ దిగ్భ్రాంతి చెందారు.
వారి విచారణ క్రమంలో, ఆయన భాష ఎప్పుడూ ఇంతేనన్నది దృష్టికి వస్తున్నది. లోగడ ఇంకా ఏమేమి అన్నారో తెలుసుకుంటున్నారు ఇప్పుడు. కొద్దిమంది, తను ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే బీహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారుల గురించి ‘బీహార్ డీఎన్ఏ’ అంటూ నిందాపూర్వకంగా అన్న మాటలను గుర్తుచేస్తున్నారు. ఇతర విషయాలకు అదనంగా ఆయన భాష విషయంలోనూ ఇంట ఓడి రచ్చ ఓడుతున్నారు. తనను కాంగ్రెస్ అధినాయకత్వం నియంత్రించకపోవడం కూడా బయటి ప్రపంచపు ఆశ్చర్యానికి కారణమవుతున్నది. వీడియోల భాషను ఎవరూ సమర్థించడం లేదు గానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అందులోనూ అసెంబ్లీలో, ఈ ధోరణి చూపడం వారికి అర్థం కావడం లేదు.
ముఖ్యమంత్రి వల్ల, తన పరిపాలన వల్ల, వ్యక్తిగతంగా తనకే గాక ఒక రాష్ట్ర ప్రతిష్ట పెరగటం, తగ్గటం జరుగుతుంది. రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కేసీఆర్ సాగించి సాధించిన ఉద్యమ లక్ష్యం, తర్వాత పదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాల వల్ల తెలంగాణకు జాతీయస్థాయిలో, దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు బయటి ప్రపంచం 2001-14, 2014-24 కేసీఆర్ నాయకత్వ కాలాలను ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యక్తిత్వంతో, పరిపాలనతో పోల్చిచూడటం మొదలైంది.
– టంకశాల అశోక్