భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయి దాటింది. వందో రాకెట్ ప్రయోగం దిగ్విజయంగా జరిపి గగన వీధుల్లో భారత కీర్తి పతాకాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకుపోయింది. బుధవారం నాటి ప్రయోగానికి ఇదొక్కటే కాకుండా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నేవిగేషన్, ఎర్త్ అబ్జర్వేటరీ ఉపగ్రహాలను అది అంతరిక్షంలో సురక్షితంగా దిగబెట్టింది. జీఎస్ఎల్ వీ ఎఫ్-15 రాకెట్లో ఎన్వీఎస్ 02 కమ్యూనికేషన్స్ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చారు. దీంతో భారత్ సొంత జీపీఎస్ వ్యవస్థ ఎంతగానో మెరుగుపడుతుంది. పైగా ఇటు రాకెట్, అటు ఉపగ్రహం రెండూ కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే.
అంచెలంచెలుగా ఎదిగిన ఇస్రో ఇప్పటివరకు 548 ఉప గ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసి రికార్డు సాధించింది. వాటి మొత్తం బరువు 120 టన్నులు. అందులో 433 విదేశీ ఉపగ్రహాలు కావడం గమనార్హం. వందమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని పెద్దలు చెప్పారు. 1962లో విక్రం సారాభాయ్ సిఫారసు మేరకు ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంతరిక్ష సంస్థను ఏర్పాటుచేశారు. అప్పట్లో దీని పేరు ఇన్కోస్పార్గా ఉండేది. 1969లో ఇస్రోగా పేరు మార్చారు. ఇస్రో రూపొందించిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లింది.
అనంతర కాలంలో స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధికి కృషి జరిగింది. 1979లో బాలారిష్టాలు దాటి ఇస్రో సొంతంగా తొలి రాకెట్ ప్రయో గం జరిపింది. సారాభాయ్, సతీష్ ధవన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహామహులు అంకితభావంతో జరిపిన అవిరళకృషితో ఇస్రో ఇం తింతై వటుడింతై అన్నట్టు పైపైకి ఎగిసింది. పేద దేశమైన భారత్కు రాకెట్ టెక్నాలజీ ఎందుకు అవసరమని ఈసడించినవాళ్లకు కండ్లు బైర్లు కమ్మేలా సమాధానం చెప్పగలిగాం. సైకిళ్ల మీద రాకెట్ విడిభాగాలు మోసుకెళ్లిన రోజుల నుంచి ఒకే విడతలో వందకు పైగా ఉపగ్రహాలను పంపించే స్థాయికి చేరుకున్నాం. అగ్రరాజ్యాల సరసన సగర్వంగా నిలబడగలిగాం. ఈ ప్రస్థానంలో సోవియట్ సహకారం మరువరానిది. 1984లో తొలి భారత వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి అడుగుపెట్టిందీ సోవియట్ వ్యోమనౌకలోనే అనేది గుర్తుంచుకోవాలి.
ఇస్రో ఆధ్వర్యంలో అంతరిక్ష పరిజ్ఞానంలో స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోగలిగాం. చంద్రుని మీదకు అంగలు వేశాం. అంగారకుని మీదకు అధ్యయన యాత్రలు జరిపాం. సూర్యుని మీదకు దృష్టి సారిం చాం. మూడు చంద్రయాన్ మిషన్లు, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య ఎల్-1 మిషన్.. ఇలా ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగాలు పూర్తిచేసి, రాకెట్ రంగంలో మన స్థానా న్ని పదిలం చేసుకున్నాం. దేశ దేశాలు రాకెట్ ప్రయోగాల నిమిత్తం ఇస్రో ముందు క్యూ కడుతుండటమే ఇందుకు తార్కాణం. ఇస్రో చీఫ్ వి.నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వందో ప్రయోగం జరగడం విశేషం. ఇస్రో ఈ ప్రయోగాల పరంపర మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించబోతున్నది. వందో మైలురాయి దాటేందుకు 46 ఏండ్లు పడితే రాబోయే ఐదేండ్లలో మరో వంద ప్రయోగాలు చేపట్టనున్నట్టు ఇస్రో ప్రకటించడం దేశానికి గర్వకారణం. జయహో ఇస్రో.. జయహో భారత్.