కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం 2024-25కు సంబంధించి నేడు ప్రవేశ పెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. ఈ సారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులుంటాయి? పేద, మధ్య తరగతికి దక్కే ఊరట ఏమిటి? ఉద్యోగులకు ఆదాయపు పన్ను, పాత పింఛన్ విధానంపై శుభవార్తలుంటాయా? ధరలు, పన్నుల భారం తగ్గుతుందా? పారిశ్రామిక రంగాలకు ఏయే ప్రోత్సాహకాలుంటాయి? దేశ ప్రజలు ఇలా ఎన్నో ఎంతో ఆశిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కేంద్రానికి ఒక సవాలు వంటిది.
దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు సుమారు లక్షకోట్లకు పైగా చేరడం, అలాగే ఆర్బీఐ నుంచి రూ.2,11,000 కోట్లు డివిడెండ్ కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరడం వంటివి బడ్జెట్‌పై ఉన్న ఆసక్తిని మరింతగా రేపుతున్నాయి. అయితే ఈ అదనపు ఆదాయం సంక్షేమ పథకాలకు మళ్లిస్తారా? లేక 5.5 శాతం నుంచి 4.7 శాతం వరకు ద్రవ్యలోటును తగ్గిస్తారా? అనేది వేచి చూడాలి. అయితే కేంద్రం ఈసారి కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉన్నది.
ముఖ్యంగా, దేశంలో వినియోగదారుల వినిమయ శక్తిని మరింతగా పెంచాలి. అందుకోసం ఐటీ చెల్లింపులలో మార్పులు తీసుకురావాలి. స్లాబ్‌లలో మార్పుల కోసం దేశంలో ఐటీ చెల్లించే 9.37 కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పన్ను చెల్లింపునకు సంబంధించి ఉన్న రెండు విధానాలతో పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, అలాగే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పెంపును ఆశిస్తున్నారు. అలాగే ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్‌ను సుమారు లక్ష రూపాయల వరకు పెంచాలి. వాస్తవ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని, సెక్షన్ 80 సీ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పెంచాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గృహ రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24 బీ కింద వడ్డీ మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలి. కారణం భూములు, ముడిసరుకుల ధరలు పెరగడమే. అలాగే సెక్షన్ 80 ఈఈఏని పునరుద్ధరించి ఆ పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచాలని కోరుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా కార్పొరేట్ టాక్స్ 32 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన ప్రభుత్వం ఈసారి తమ పన్నుల భారాన్ని తగ్గించి తమ పొదుపును పెంచేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలని సగటు ఉద్యోగి కోరుకుంటున్నాడు. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం 8వ వేతన కమిషన్, పాత పింఛన్ విధానంపై ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేస్తున్న పథకాల కేటాయింపులను పెంచి వాటిని బలోపేతం చేయాలి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాం తాల్లో తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి మౌలి క వసతుల కోసం కేటాయింపులు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలి. దాంతో పాటు ప్రజారోగ్యంపైనా దృష్టిపెట్టాలి. ఆరోగ్య భద్రతపై చేస్తున్న మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వ్యయం 1.9% కాగా మొత్తం జీడీపీలో అది 0.28%. ఆరోగ్య కుటుంబ సంక్షేమం లెక్కల ప్రకారం మొత్తం ఆరోగ్య భద్రతకు దేశ ప్రజ లు చేస్తున్న వ్యయంలో సుమారు 47 శాతం స్వయంగా తమ ఆదాయం నుంచి భరిస్తున్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ప్రస్తుతం సుమారు 12 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకున్న ఆరోగ్య బీమాను 10 లక్షలకు పెంచాలి. అలాగే, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగేలా కొన్ని పథకాలను రూపకల్పన చేయాలి.
ఇకపోతే నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే నిర్ణయాలు ఈ బడ్జెట్లో కీలకమైనవి. సీఎంఐ తాజా నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు 9.2 శాతం. భద్రత, మంచి వేతనం కల్పించే తయారీ, సేవారంగానికి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించేలా నిర్ణయాలుండాలి. అటు ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ప్రభుత్వ అంచనాల ప్రకారం టోకు ధరల ద్రవ్యోల్బణం సుమారు 3.4 శాతం, వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 5.1 శాతం, ఆహార ద్రవ్యోల్బణం 9.4 శాతానికి పెరిగాయి. వీటిని కట్టడి చేసే నిర్ణయాలు అవసరం. అలాగే విద్యారంగంలో ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగం బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలుండాలి.
మౌలిక సదుపాయాలు డిజిటల్ విద్య, విద్యారుణాల సబ్సిడీపై నిర్ణయాలు ఆశిస్తున్నారు. ఇక తయారీ రంగంపై కూడా బడ్జెట్లో కీలకమైన అంశాలుండాలి. ముఖ్యంగా, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్, ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు టాక్స్ సబ్సిడీలు కల్పించాలి. టెక్నాలజీకి నరేంద్ర మోదీ సర్కార్ తొలి నుంచీ పెద్దపీట వేస్తున్నది. దీనికి తగ్గట్టు ఆటోమొబైల్ రంగంలో సంస్కరణలకు గత బడ్జెట్లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాలకు మన దేశంలో డిమాండ్ పెరుగుతున్నది. అందుకే గత బడ్జెట్లో ‘ఫేమ్’ పథకం ప్రవేశపెట్టారు.
హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు టాక్స్ తగ్గించడంతో పాటు, వీలైనన్ని రీచార్జి సెంటర్లను నెలకొల్పేవిధంగా నిర్ణయాలుండాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేలాగా బడ్జెట్ ఉండాలని ఆయా రంగ నిపుణులు సైతం కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి అనంతరం ఈ రంగం ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్నది. అలాగే, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా బడ్జెట్ ఉండాలి.
ఇక ఇన్సూరెన్స్ రంగంలో కొన్ని సంస్కరణలు తేవడం ద్వారా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేసుకునే అవకాశం కలుగుతుంది. కంపోజిట్ లైసెన్స్, మూలధన నిబంధనలను మార్చేవిధంగా నిర్ణయాలు ఉండాలి. అటు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నది. క్రెడిట్ ఆధారిత రాయితీ పథకం తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నదీ రంగం. ఇక అందుబాటులోని ఇళ్లపై ఉన్న పరిమితిని రూ.75 లక్షలకు పెంచి జీఎస్టీని 1 శాతానికి పరిమితం చేయాలని కోరుకుంటున్నారు.
రైతులు, రైతు సంఘాలు సైతం వ్యవసాయరంగానికి ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని కోరుతున్నారు. రైతుల ఆదాయం పెంచేవిధంగా, వ్యవసాయ పరిశోధనలు, ఎరువుల రాయితీలు మౌలిక సదుపాయాల అభివృద్ధి వాటిపై నిధులు పెంచాలని రైతులు ఆశిస్తున్నారు. మూలధన పెట్టుబడుల కోసం గత మధ్యంతర బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో అది మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.
ఇటు రక్షణ రంగంలో ఆధునికీకరణ, గ్రామీణాభివృద్ధి వంటి వాటికి కూడా కేటాయింపులు పెరగవచ్చు. బీజేపీ గత ఎన్నికల్లో వయో వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా పథకం, పైపుల ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లు అలాగే, వచ్చే ఐదేండ్ల పాటు ఉచిత రేషన్ వంటి హామీలకు నిధులు కేటాయిస్తూనే, సంస్కరణలకు పెద్దపీట వేయవచ్చు. ద్రవ్యోల్బణం కట్టడి, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం, వృద్ధికి ఊతమివ్వడం వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్-కామర్స్ విభాగం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ)
– డాక్టర్ రామకృష్ణ బండారు 
79057 51940