పహల్గాంలో టెర్రరిస్టులు ఏప్రిల్ 22న దాడి జరిపి 26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసి పలువురిని గాయపరిచిన మరునాడు, భారత ప్రభుత్వం 65 ఏండ్ల నాటి సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పాకిస్థాన్‌తో 1960లో జరిగిన ఆ ఒప్పందం మేరకు నదీజలాలు ఆ దేశంలోకి ప్రవహించకుండా ఆపటం తన ఉద్దేశమని వివరించింది. ఇటువంటి పరిణామం ఇది మొదటిసారి కాదు, పాకిస్థాన్ మద్దతు గల టెర్రరిస్టులు 2016లో ఉడీ సెక్టార్లో 18 మంది భారత సైనికులను బలి తీసుకున్నప్పుడు కూడా ప్రధాని మోదీ ఇదే సింధూ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుంటూ, ‘రక్తం, నీళ్లు కలిసి ఒకేసారి ప్రవహించజాలవ’ని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఉద్దేశంలో, (అ) సింధూ ఒప్పందం దేశానికి అనుకూలమైనది కాదు, (ఆ) టెర్రరిస్టులకు మద్దతునిచ్చే పాకిస్థాన్ ధూర్త ప్రవర్తనను అరికట్టేందుకు సింధూ జలాలను పాకిస్థాన్‌కు ఆపివేయవచ్చు, (ఇ) ఒప్పందాన్ని సస్పెండ్ చేసి నీటిని నిలిపినట్టయితే పాకిస్థాన్‌కు తీవ్రమైన నష్టాలు కలిగి, టెర్రరిజానికి మద్దతు మానివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
పాకిస్థాన్ ప్రోత్సాహంతో సాగే టెర్రరిజాన్ని ఆపేందుకు ఇండియా తను చేయగలిగిందంతా చేయాలి. అయితే, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సింధూ ఒప్పందం నుంచి ఉపసంహరణ తగినంత ప్రభావం చూపగల పద్ధతేనా? సింధూ ఒప్పందంలోని ప్రధానాంశాలు ఏమిటో ముందుగా చూద్దాం. 1960లో ఒప్పందానికి ముందు 1947 నుంచి సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోకుండా, దేశ ప్రయోజనాల పరిరక్షణకు గట్టి చర్చలు జరపకుండా, షరతులు విధించకుండా పాకిస్థాన్‌కు ఏదీ ఉదారంగా ఇవ్వలేదు.
నదికి భారతదేశం ఎగువ ప్రాంతంలో ఉన్నందున, పలు నిబంధనల రూపంలో దాదాపు తాను కోరుకున్నదంతా సాధించుకోగలిగింది. నదీజలాల పంపిణీ కాకుండా సింధూ ఉప నదులను రెండు దేశాలు పంచుకోవాలన్నది ఇండియా వైఖరి. అందుకు పాకిస్థాన్‌ను ఒప్పించటానికి ముందు పలు చర్చోపచర్చలు, తాత్కాలిక ఒప్పందాలు జరిగాయి. అంతిమంగా సంతకాలు జరిగింది నదీజలాల పంపిణీపై కాదని, సింధూ ఉప నదుల పంపిణీ గురించి అన్నది గుర్తుంచుకోవాలి.
తన వైపు నుంచి పాకిస్థాన్ మరొక వైఖరితో వ్యవహరించింది. పలువురు అంతర్జాతీయ నిపుణులను తన పక్షాన నియోగించి, జలాల పంపిణీ నదీ గర్భాలవారీగా జరగాలన్నది. అంతిమంగా, భారతదేశం 1954లో చేసిన ప్రతిపాదనలు ఖరారయ్యాయి. 1960 నాటి ఒప్పందానికి ప్రాతిపదిక అయ్యాయి. అందుకు పాకిస్థాన్ నాలుగేండ్ల తర్వాత ఆమోదం తెలిపింది. అప్పుడు టెన్నెస్సీ వ్యాలీ చైర్మన్‌గా ఉండిన అమెరికన్ నిపుణుడు డేవిడ్ లిలియెంథాల్ ద్వారా ప్రపంచ బ్యాంకుకు ప్రమేయం ఏర్పడింది. ఆ విధంగా సింధూ ఒప్పందానికి దీర్ఘమైన చరిత్ర ఉన్నది. అది ఏ విధంగా చూసినా ఉత్తమమైనదే. దీనంతటికి ప్రపంచ బ్యాంకు మధ్య వర్తిత్వం వహించి, ఒప్పంద పాఠం తయారీలో పాల్గొని, సంతకం చేసి, దాని అమలు విషయమై పాకిస్థాన్‌కు హామీ కూడా ఇచ్చింది.
ఒప్పందంపై 1960 సెప్టెంబర్ 19న కరాచీలో నాటి భారత ప్రధాని పండిట్ నెహ్రూ, పాకిస్థాన్ సైనిక పాలకుడు అయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు. ఆ ఒప్పందపు పీఠిక ఈ విధంగా ఉంది. ‘సింధూ నదీ వ్యవస్థ నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనాలను సంతృప్తికరమైన రీతిలో పొందాలనే కోరిక రెండు దేశాలకూ ఒకేరీతిన ఉన్నందున, సుహృద్భావపూర్వకంగా, జల వినియోగం కోసం రెండు దేశాలకూ గల హక్కులను, బాధ్యతలను గుర్తిస్తూ ఈ ఒప్పందం జరుగుతున్నది. నిజానికి సింధూ ఒప్పందాన్ని ఆ కాలంలో నదీజలాల వివాదాలకు సంబంధించి ఒక చెప్పుకోదగ్గ ఉదాహరణగా భావించారు. వాస్తవంగా కూడా అది పలు పరీక్షలను తట్టుకొని నిలిచింది.
మొత్తం 85 పేజీల నిడివి గల ఆ పత్రంలో 12 ఆర్టికల్స్, అవిగాక అనుబంధాలు, ఇతర వివరణలున్నాయి. పేర్కొనకుండా మిగిలింది ఏమీ లేదు. వీటిలోని 8వ ఆర్టికల్ ప్రకారం ‘శాశ్వత సింధూ కమిషన్’ (పర్మినెంట్ ఇండస్ కమిషన్) ఏర్పాటవుతుంది. దాని పాత్ర ఒప్పందం అమలయ్యేట్టు చూడటం. ఆర్టికల్ 9 ప్రకారం, రెండు దేశాల మధ్య వివాదాల పరిష్కారం జరగాలి. వివాదం తీవ్రమైన పక్షంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటుచేయాలి. ఇండస్ కమిషన్ సమావేశాలు 2022 మే వరకు మొత్తం 118 సార్లు జరిగాయి. తర్వాత సమావేశాల నిర్వహణకు భారతదేశం అంగీకరించకపోవటంతో నిలిచిపోయాయి.
ముందుగా సింధూ నది స్వరూపం గురించి రెండు మాటలు చెప్పుకోవాలంటే, దానికి అయిదు ఉప నదులున్నాయి. సట్లెజ్, బియాస్, రావి, జీలం, చినాబ్లతో పాటు ప్రధాన నదిని కలిపితే అది సింధూ నదీ వ్యవస్థ అవుతుంది. బ్రిటిష్ పాలన ముగిసి 1947లో దేశ విభజన జరిగే సమయానికి పంట కాలువల వ్యవస్థ ఎక్కువగా పశ్చిమ పంజాబ్‌లో అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతం పాకిస్థాన్‌కు వెళ్లింది. ఆ విధంగా పాకిస్థాన్ పంట భూములు పూర్తిగా భారతదేశం నుంచి లభించే నీటిపై ఆధారపడ్డాయి.
పైన ప్రస్తావించిన అమెరికన్ నిపుణుడు డేవిడ్ లిలియోంథాల్ ఈ పరిస్థితి గురించి 1951లోనే ఊహించి రాస్తూ ‘పాకిస్థాన్ భూములను, ప్రజలను సజీవంగా ఉంచటానికి బదులు సర్వనాశనం చేయాలంటే భారతదేశం నీటి సరఫరాను శాశ్వతంగా ఆపివేసినందువల్ల జరిగే నష్టం ఏ సైన్యం, ఏ బాంబులు, ఏ ఫిరంగులు కూడా చేయలేవు’ అన్నాడు. ఒప్పందంలో ప్రపంచబ్యాంకు పాత్ర వహించటానికి ముఖ్య కారకుడయ్యాడు. నీటి పంపిణీ నిరాటంకంగా సాగేందుకు అన్ని నదుల నుంచి కూడా నీటిని రెండు దేశాలకూ సరఫరా చేయాలని సూచించాడు. అది సమస్య తలెత్తకుండా పరిష్కారమైతే కావచ్చుగాని, అప్పటి ఇప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అందులో చాలా చిక్కులున్నాయి.
అందువల్ల, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3ని అనుసరించి, తూర్పు ఉప నదులైన సట్లెజ్, బియాస్, రావి ఉప నదులను భారతదేశానికి, పశ్చిమ ఉప నదులైన జీలం, చీనాబ్లతో పాటు సింధూ నదిని పాకిస్థాన్‌కు కేటాయించారు. అయితే, భారతదేశానికి అదనంగా కొన్ని లభించాయి. పశ్చిమ నదుల నుంచి మంచినీరు, గృహావసరాల నీరు, అప్పటికే సాగులో గల భూములకు నీరు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కోసం నీటిని నిల్వ చేసే సదుపాయం (పాకిస్థాన్ నీటి ప్రవాహాన్ని భంగపరచకుండా) అందులో ఉన్నాయి. పోతే, రెండు దేశాలు ఇంకా ఏమి చేయవచ్చు, ఏమి చేయరాదనే వివరాలు ఒప్పందంలో ఉన్నాయి. వాస్తవ దృష్టితో చెప్పాలంటే ఒప్పందం ఎవరికీ అనుకూలం గాని, ప్రతికూలం గాని కాదు. మొత్తం మీద మంచి ఒప్పందమే గాక ఇరువురి ప్రయోజనాలకు సంతృప్తికరంగానే ఉపయోగపడిందని చెప్పాలి.
వివాదాలు: పాకిస్థాన్ నదికి దిగువ దేశం అయినందున ఎక్కువ ఫిర్యాదులు వారినుంచే వచ్చాయి. భారతదేశం జలాశయాలను, జలవిద్యుత్తు కేంద్రాలను నిర్మించ ప్రయత్నించినప్పుడల్లా వారు ఫిర్యాదు చేశారు. ఆ కారణంగా పథకాలు ఆలస్యం కావటం, నిర్మాణ వ్యయం పెరగటం, భారతదేశంలో అసహనం తలెత్తటం వంటివి జరిగాయి. అయితే, అటువంటి వివాదాల పరిష్కారానికి ఒప్పందంలో వివరమైన పద్ధతులున్నాయి. ఉదాహరణకు చీనాబ్ నదిపై బాగ్లీహార్ వద్ద ఆనకట్ట నిర్మించటాన్ని పాకిస్థాన్ ఆక్షేపించింది. చీనాబ్ నది పాకిస్థాన్ వాటాలోనిది. ఆ ఫిర్యాదుపై 2005లో స్విట్టర్లాండ్కు చెందిన తటస్థ నిపుణుడు రేమండ్ లేఫిట్ ఇచ్చిన నివేదికలో సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది. ఒప్పందంలో నిర్దేశించినట్లు, ఏ వివాదంలోనైనా తటస్థ నిపుణుడి నివేదికే అంతిమ నిర్ణయమవుతుంది. రెండు దేశాలు అందుకు కట్టుబడవలసి ఉంటుంది.
ఒప్పందం నుంచి భారతదేశం ఉపసంహరిం చుకోగలదా?: ఉప సంహరణకు గాని, ఒప్పందం రద్దుకు గాని సింధూ నదీ ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. అయితే, ఒక ఒప్పందం నుంచి, అంగీకార ఏర్పాట్ల నుంచి నిష్క్రమించే హక్కు సాధారణంగా ఏ దేశానికైనా ఎప్పుడైనా ఉంటుంది. ప్రస్తుతం ఒప్పందం నుంచి ఉపసంహరించుకోనున్నట్టు భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితిలో భారత ప్రభుత్వం ఒకవేళ ఆ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్టయితే, ఒప్పందంలోని అనుబంధం-జి లోగల ఆర్టికల్ 9 (5) ప్రకారం ఆర్బిట్రేషన్ కోర్టు నియామకానికి పాకిస్థాన్ కోరగలదని భావించవచ్చు. ఈ విచారణ తగినంత కాలం సాగుతుంది. ఆ విచారణలో పాల్గొనేందుకు ఇండియా సుముఖత చూపకపోయినా, ఒప్పందానికి హామీదారు అయిన ప్రపంచబ్యాంకు, పాకిస్థాన్ అభ్యర్థన మేరకు కోర్టును ఏర్పాటుచేయవలసి ఉంటుంది. ఇదంతా ఎట్లా జరగాలనే క్రమం ఒప్పందంలో ఉంది.
తుది తీర్పునకు ముందు మధ్యంతర తీర్పు ఇవ్వగల అవకాశం కూడా ఉంది. తమ ప్రయోజనాల పరిరక్షణకు ఆ విధంగా మధ్యంతర తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టును మొదటనే కోరే హక్కు ఇరుపక్షాలలో ఎవరికైనా ఉంటుంది. పాకిస్థాన్ ఆ విధంగా కోరగల అవకాశం ఉంది. అందుకు కోర్టు నిరాకరించటం తేలిక కాదు. అటువంటి మధ్యంతర తీర్పు ఇండియాకు అనుకూలం కాకపోవచ్చు. అయితే ఆ తీర్పును భారతదేశం కోరుకుంటే ఉపేక్షించి వదిలివేయవచ్చుగాని, దాని ప్రభావాలు, పర్యవసానాలు ఉంటాయి.
ముగింపు: సింధూ ఒప్పందంలో లోపాలు ఎంతమాత్రం లేవని అనలేం. కానీ, అప్పటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ రీత్యా ఉత్తమమైన ఆలోచనలు, పద్ధతులలో రూపొందించిన ఒక మంచి ఒప్పందమది. ఆ ఒప్పందం నుంచి వైదొలగి, నీటిని నిలిపివేసి, టెర్రరిజానికి మద్దతునివ్వకుండా పాకిస్థాన్‌ను ఒత్తిడి చేయటం ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వైఖరి వల్ల భారతదేశం ఇతరత్రా చాలా కోల్పోగల అవకాశం ఉంది. అదేవిధంగా, ఒప్పందం నుంచి వైదొలగగలమని తర చూ హెచ్చరించటం, ఒక చుక్క కూడా పోనివ్వమన్న జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ తరహా హెచ్చరికలు చివరికి ఆ పని చేయకపోవటం కూ డా దేశ ప్రతిష్ఠను, విశ్వసనీయతను అంతర్జాతీయంగా నష్టపరుస్తుంది. మరొకవైపు అంతర్గతం గా దేశంలోనూ ఆ ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు, దేశంలోని నదులకు ఎగువన గల రాష్ర్టా లు జల ట్రిబ్యునల్ అవార్డులకు కట్టుబడి ఉండదలచుకోనట్టయితే, తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించవచ్చు.
(వ్యాసకర్త: జల వ్యవహారాల అంతర్జాతీయ నిపుణుడు)
-డాక్టర్ బిక్షం గుజ్జా