ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థకు, మిగతా ప్రపంచ దేశాలకు కష్ట కాలమే. వృద్ధికి అవసరమైన సంస్కరణలను సృష్టించడంలో భారత్ విఫలమైంది. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం కారణంగా సతమతమైన దిగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక విధానాలు రూపొందించాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో పర్యావరణ హిత ఇంధన పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలి.
దేశంలో నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలు మాత్రమే మరింత ధనవంతులవుతుంటే, మిగతా వారంతా వెనకబడి ఉన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలకు ఒక విధమైన పరిస్థితులు, రైతులకు మరొక విధమైన పరిస్థితులు నెలకొనడం పెద్ద సమస్యే. కానీ ఇది పెట్టుబడిదారుల వల్ల వచ్చిన సమస్య కాదు. కొవిడ్ సంక్షోభ కాలంలో ఇంటి నుంచి పని చేసిన ఎగువ మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరిగింది. కానీ పరిశ్రమల్లో పనిచేసేవారు తమ ఆదాయాన్ని కోల్పోయారు. కరోనా సంక్షోభ సమయంలో ఈ విభజన పెరిగింది. ధనవంతులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. పేదలకు రేషన్, ఇతర సామాగ్రి లభించింది. కానీ దిగువ మధ్య తరగతి వారికే చాలా నష్టం జరిగింది. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది.
దేశంలో తదుపరి విప్లవం సేవా రంగంలో వస్తుంది. అమెరికాకు వెళ్లకుండా మనం ఇక్కడి నుంచే ఆ దేశం కోసం పని చేయవచ్చు. ఉదాహరణకు డాక్టర్లు అమెరికాకు టెలీ మెడిసిన్ సేవలు అందించి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించవచ్చు. మన సేవల ఎగుమతి మనల్ని ఎగుమతుల్లో సూపర్ పవర్‌గా తయారు చేస్తుంది. సంప్రదాయేతర ఇంధన వనరులను మనం సమర్థంగా వినియోగించుకోవచ్చు. మన భవనాలను హరిత భవనాలుగా తీర్చిదిద్దుకోవచ్చు. పెద్ద పెద్ద గాలి మరలు, సౌర విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించవచ్చు. వీటికి భారీ డిమాండ్ ఉంది. మనం సృజనాత్మకంగా, ప్రగతిశీల దృక్పథంతో ఆలోచించాలి. మనకు చాలా అవకాశాలున్నాయి. వాతావరణ మార్పుల వల్ల జరిగే నష్టం అధికంగా దక్షిణాసియాలోనే చోటుచేసుకుంటున్నది. ప్రకృతి విపత్తులతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే సతమతవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భారత్ పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. మనం కూడా అదే భౌగోళిక ప్రాంతంలో ఉన్నాం. కాబట్టి మనం చాలా కష్టపడాలి.
ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి మందగిస్తున్నది, భారత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎగుమతులు కాస్త తగ్గాయి. భారత్‌లోని ద్రవ్యోల్బణ సమస్య ప్రధానంగా వస్తువుల ధరలకు సంబంధించింది. అది వృద్ధికి ప్రతికూలంగా మారనుంది. కరోనా సంక్షోభం ఆర్థిక వృద్ధి సమస్యలో ఒక భాగం మాత్రమే. కరోనా సంక్షోభానికి ముందే దేశ ఆర్థిక వృద్ధి మందగించింది. దేశంలో ప్రస్తుతం అతి పెద్ద సమస్య నిరుద్యోగం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించవు కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వ్యవసాయంలో సాంకేతిక వినియోగాన్ని పెంచితే కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం గురించి ప్రజలకు చాలా తక్కువ విషయాలు తెలుసు. వినియోగదారులకు రక్షణ ఉంటే వారు తమ హక్కులను తెలుసుకోగలుగుతారు.
– రఘురామ్ రాజన్
(వ్యాసకర్త: ఆర్బీఐ మాజీ గవర్నర్)
(బిజినెస్ స్టాండర్డ్ సౌజన్యంతో)