వరంగల్ చౌరస్తా : ఎలాంటి అనుమతులు, అంచనాలు లేకుండా గోవిందరాజుల స్వామి ఆలయం ఆవరణలో చేపట్టిన గోశాల నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్థానిక అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ అనువంశీయ అర్చకులు హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి గోశాల పేరుతో జరుగుతున్న తంతును వివరించారు.
వెంటనే స్పందించిన మంత్రి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీతతో ఫోన్లో మాట్లాడారు. సంబంధిత అంశంపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గోశాల నిర్మాణానికి అనుమతి కావాలని వినతిపత్రం అందించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన అంశాన్ని అనుమతులు మంజూరు చేపినట్లు ప్రచారం చేస్తూ.. అక్రమ వసూళ్లకు పాల్పడటంపై, ఆలయ ఆవరణలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు స్పందించకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దాంతో దేవాదాయశాఖ అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టనున్నారు. మంత్రికి వినతిపత్రం అందించిన వారిలో వరయోగుల శ్రీనివాస్, వరయోగుల లక్ష్మణస్వామి తదితరులు ఉన్నారు.