హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 6: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 రోజులుగా వరంగల్ కేంద్రంగా జరుగుతున్న టీ-20 మహిళల క్రికెట్ పోటీల్లో భాగంగా రెండు సెమీఫైనల్ మ్యాచ్లలో మహబూబ్నగర్ జట్టు 34 పరుగుల తేడాతో ఖమ్మం జట్టును ఓడించగా, వరంగల్ జట్టు 48 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టును ఓడించి ఫైనల్కు చేరింది. వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ క్రీడా మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో మహబూబ్ నగర్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణిత 18 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.
జట్టులో అరియానా 41, అక్షర 30 పరుగులు చేసి మరోసారి రాణించారు. 104 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం జట్టును మహబూబ్నగర్ బౌలర్లు కట్టడి చేశారు. ప్రవళిక 5 వికెట్లు, మేఘన 4 వికెట్లు తీయాగా ఖమ్మం జట్టు 17 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ కావడంతో 34 పరుగులతో ఓడిపోయింది.
మరో కీలక సెమీఫైనల్లో వరంగల్ జట్టుతో ఆదిలాబాద్ జట్టు తలపడిగా మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు కృష్ణవేణి 41(29 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలు), మోహనశ్రీ 31( 27బంతులు 4 బౌండరీలు) పరుగుల సహాయంతో నిర్ణిత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
150 పరుగుల లక్ష్యంతో ఆదిలాబాద్ జట్టు హర్షిణి 34 పరుగులు చేసినా మిగిలినవారు విఫలమవ్వడంతో 102 పరుగులకే ఆలౌట్ కాగా 48 పరుగుల తేడాతో వరంగల్ ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు ఉదయం 10 గంటలకు వరంగల్ జట్టుతో మహబూబ్నగర్ జట్టు ఫైనల్లో తలపడతాయని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
