వాణిజ్య రంగంలో చైనా విస్తరణవాదం భారత్‌కు తలనొప్పిగా మారింది. ఇండియా మార్కెట్లను ఆక్రమించుకోవడంతోపాటు పారిశ్రామికరంగాన్ని తమపై పూర్తిగా ఆధారపడేలా చేసుకోవాలనేది చైనా లక్ష్యం. దీంతో భారత్ తన విదేశాంగ విధానంలో మార్పులు చేసి ‘చైనా ప్లస్ వన్’ విధానాన్ని అవలంబిస్తూ ఆ దేశంలోని కంపెనీలను ఆకర్షిస్తుండటం చైనాకు కంటగింపుగా మారింది. దీంతో భారత్‌పై అప్రకటిత వాణిజ్య యుద్ధానికి తెరతీసింది.
భారత్‌కు చైనా నుంచి ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మరోమారు నిరూపితమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను సహేతుకంగా, న్యాయంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని, పరస్పరం అర్థం చేసుకుని మసలుకుందామని ఆరు పాయింట్లతో ఒప్పందం చేసుకున్న చైనా మరోవైపు పన్నాగాలకు పదునుపెడుతున్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా వాణిజ్య యుద్ధానికి తెరతీసింది.
భారత్ దిగుమతి చేసుకునే కీలక పరికరాలు, యంత్రాలపై అప్రకటిత ఆంక్షలు విధించింది. భారత్‌లోని అనేక రంగాలు చైనా ఎగుమతులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇప్పుడీ ఆంక్షల కారణంగా వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. భారత్‌లోని ఎలక్ట్రానిక్, బల్క్‌డ్రగ్, సోలార్ పరిశ్రమలు దాదాపుగా చైనాపైనే ఆధారపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడివి సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన కనిపిస్తున్నది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అత్యంత కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీ సాంకేతికతను బదిలీ చేసేందుకు చైనా నిరాకరిస్తున్నది.
డ్రాగన్ ఆంక్షలు భారత ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. వీటి కారణంగా భారత్‌లో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఫలితంగా దేశీయ మార్కెట్లో ద్రవ్యోల్బణం కోరలు చాస్తుంది. చైనా ఆంక్షల వెనకున్న కారణం ఏమైనప్పటికీ ఇండియాలోని మొబైల్ ఫోన్ పరిశ్రమతోపాటు చైనాపై దాదాపు 100 శాతం ఆధారపడే బల్క్‌డ్రగ్ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. బల్క్‌డ్రగ్ ఎగుమతులపై చైనీయులు ఒత్తిడి తీసుకొస్తే కనుక భారత్‌లో యాంటీబయాటిక్స్ వంటి చౌక ఔషధాల విషయంలో విపత్తు ఎదుర్కోక తప్పదు. అదే జరిగితే భారత్ దీనిని ఎలా ఎదుర్కొంటుందనేది ప్రశ్నార్థకమే.
భారత్‌పై చైనా ఆంక్షలకు ఎలాంటి కారణాలు లేవన్నది నిజం. భారత్‌తో ఈ అప్రకటిత వాణిజ్య యుద్ధాన్ని ముగించేందుకు చైనా కొన్ని షరతులు కూడా విధించినట్టు తెలిసింది. ‘క్వాడ్’ కూటమి నుంచి వైదొలుగుతామని భారత్ కచ్చితమైన హామీనివ్వడం, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ వద్ద 2020 జూన్ నాటికి ముందున్న పరిస్థితిని తీసుకొచ్చేందుకు దళాల ఉపసంహరణ వంటివి ఇందులో కొన్ని. గల్వాన్ ఘర్షణలో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. చైనా వైపు నష్టం బయటకు రాకున్నా అంతకుమించి నష్టం జరిగి ఉంటుందన్న వార్తలు వచ్చాయి.
భారత్-చైనా మధ్య సంబంధాలు పూర్వస్థితికి రావాలంటే ఇరు దేశాల మధ్య తొలుత విమాన సర్వీసుల పునరుద్ధరణ జరగాలని, వీసాల జారీని సులభతరం చేయడంతోపాటు టిక్‌టాక్ వంటి చైనా యాప్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నది చైనా ప్రధాన డిమాండ్. కరోనా సమయంలో ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులు పునరుద్ధరణకు నోచుకోలేదు. చైనా కోపానికి మరో కారణం కూడా ఉన్నది. భారత్‌లోని తమ మొబైల్ కంపెనీలు షావోమీ, వివో, ఒప్పో వంటివాటిపై ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు దాడులు, నిర్వాహకుల అరెస్ట్ వంటి వాటిని జిన్‌పింగ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. అలాగే, ‘చైనా ప్లస్ వన్’ (చైనా నుంచి బయటకు రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడం) వ్యూహాన్ని భారత్ అమలు చేస్తున్నది. ఉత్పాదకత సంబంధిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ద్వారా ఫాక్స్‌కాన్, తదితర కంపెనీలను భారత్ ఆకర్షించింది. ఇది చైనాకు మింగుడుపడటం లేదు.
భారత్‌పై చైనా అన్ని రకాలుగా బిగింపులు తెస్తున్నప్పటికీ ప్రధాని మోదీ మాత్రం ఆయనతో సఖ్యత కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన త్వరలోనే చైనాలో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆంక్షల ఎత్తివేత, ట్రేడ్వార్కు ముగింపు పలకడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కూడా చెప్తున్నారు. అలాగే, భారత్ కనుక ఈ విపత్తు నుంచి బయటపడాలంటే జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. ఈ రెండు దేశాల నుంచి అత్యంత నాణ్యమైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు, సోలార్ ప్యానెల్స్, ఈవీలను దిగుమతి చేసుకోవడం ద్వారా చైనాకు చెక్ పెట్టొచ్చు.
– ఎడిటోరియల్ డెస్క్