నేటి సమాజంలో కొందరి దృష్టిలో, కొన్ని చోట్ల వ్యాపారానికి పెద్ద కేంద్రంగా భక్తి మారింది. కొత్త ఆలయ నిర్మాణమంటే భక్తులు, పాలకమండళ్ల ప్రతినిధులు, పాలకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఆలయం ఎంత పెద్ద స్థలంలో, ఎన్ని అంతస్తుల్లో కడుతున్నారన్నదే ప్రధాన అంశం అవుతున్నది. దేశంలో ఓ కొత్త గుడి కట్టగానే ‘మీరు చూశారా? చూసొచ్చారా?’ అనే చర్చ మొదలవుతున్నది. భక్తుల తాకిడి, హుండీ రాబడి పెరుగడంతో ఆలయ నిర్వాహకుల్లో ధన పిశాచి రెక్కలు విప్పుకొంటున్నది. దేవుడంటే భయభక్తులు ఉన్నవారు దర్శనాలతో తరిస్తుంటే, అస్సలు భయం లేనివారి దారి మరోలా ఉన్నది. చిన్న దొంగ తాను దొంగనని ఒప్పుకొంటాడు. పెద్ద దొంగ మాత్రం మహాభక్తుడిగా వేషం కట్టి, సంప్రదాయ పద్ధతులు పాటించి, అవకాశం చిక్కగానే బందిపోటుగా మారుతాడు.
సాధారణ జనం నమ్మకం, ధనవంతుల పాపపరిహారం గుడులను బతికిస్తున్నాయి. గుడి ఆదాయాన్ని బట్టి నిర్వాహకుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఆధునిక హిందూ దేవాలయ నిర్మాణాల్లో అయోధ్య రామాలయం సర్వోన్నతమైనది. ఈ ఆలయం పూర్తికావడానికి ఏడాది ఉండగానే భక్తుల రద్దీ పెరిగింది. అంత గొప్ప పేరున్న రామమందిరం ఈ మధ్య ఊహించని రీతిలో ఇంటి దొంగల బారిన పడి ఎంతోమంది పరువును గంగలో కలిపింది. భక్తిపారవశ్యంలో వరదలా వచ్చిన రామమందిర నిర్మాణ సొమ్ముకు లెక్కే లేకుండా పోయింది.
ఆ ధనరాశుల ముందు నిర్వాహకుల భక్తి, నిష్ఠలు తేలిపోయాయి. దేవుడికిచ్చిన సొమ్ము గురించి భక్తులు లెక్కలు అడుగుతారా? అనే ధీమాతో తోచినంత దోచుకున్నారు. 2021లో ఈ ఆలయం కోసం సింధీ సమాజం ఇచ్చిన రూ.రెండు కోట్ల విలువైన వెండి ఇటుకలకు ఇంకా రసీదు అందలేదు. కానీ నకిలీ రసీదు పుస్తకాలు ముద్రణ అయ్యాయి. సీసీ టీవీల కంటపడకుండా నోట్ల సంచులు రోజుల తరబడి రవాణా అయ్యాయి. ఇదంతా తాత్కాలిక ఉద్యోగుల నిర్వాకమైనా..? పెద్దల అండ లేనిదే ఇదంతా సాధ్యం కాదు. ‘ఇంత బరితెగిస్తారా?’ అని ప్రజలు దిగ్భ్రాంతి చెందుతున్నారు. గుడి నిర్మాణాన్ని ప్రతిష్టగా తీసుకొన్న బీజేపీ పెద్దలు కంగుతిన్నారు. ప్రజల ముందు ముఖం చాటేయలేక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. సీఎం ఎన్ని సర్దుబాటు మాటలు మాట్లాడినా దోపిడీని కాదనలేని పరిస్థితి. ఇది బహిరంగ రహస్యమే కానీ, నోరు విప్పలేని అవస్థ. ‘ఈ హుండీ దొంగల కేసులను ఎట్టిపరిస్థితిల్లోనూ వాదించబోం’ అంటూ ఫైజాబాద్ న్యాయవాదుల సంఘం తేల్చిచెప్పింది. ఒకవేళ ఎవరైనా వాదించడానికి ముందుకు వస్తే వారికి రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
జాతీయ ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో రామాలయంలో జరిగిన భారీ దోపిడీపై విమర్శనాత్మక చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ, ఎద్దేవా చేస్తూ ఎన్నో రకాల కార్టూన్లు వస్తున్నాయి. ఆయా కార్టూన్ల ప్రభావం సామాన్య పాఠకులపై తప్పకుండా ఉంటుంది. ఇంత జరిగినా దుష్టశిక్షణ చేయాలని బాల రాముడికి అనిపించడం లేదా? అని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు.
అయోధ్య రామాలయంలో నిధులు స్వాహా అయ్యాయని తెలియగానే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గాయనే వార్తలు వస్తున్నాయి. దేవుడనేవాడు ఈ విగ్రహాల్లో ఉంటాడా? పూజలు, యాగాలు ఆయన కోరుకుంటాడా? కానుకలు సమర్పిస్తే కోరికలు తీర్చుతాడా? అనే అనుమానాలు రాకుండా ఇంతకాలం గడిచింది. ఇప్పటివరకైతే అన్నీ దేవుడే చూసుకుంటాడు, వారి కర్మ వారే అనుభవిస్తారని దొంగలను వదిలేసే దయాగుణం భక్తులకు ఉన్నది. ఇంత భారీగా ఆలయ సొమ్ము కాజేసిన దొంగలకు తగిన శిక్ష పడుతుందన్న నమ్మకాన్ని కేంద్రం, యూపీ ప్రభుత్వం కలిగించాలి. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణ ఘనత తమదేనని చెప్పుకొనే బీజేపీ, గుడి పేరుతో రాజకీయంగా లబ్ధి పొందిన బీజేపీ, ఇప్పుడు ఎందుకు స్పందించదు? రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మౌనం వహించడం ఎంతవరకు సమంజసం?
– బద్రి నర్సన్