చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత విడాకుల కేసును వెనక్కు తీసుకున్నారు. చెంగల్పట్టు కోర్టు విచారణకు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత.. ఈ కేసును తాను కొనసాగించబోనని అందుకు గల కారణాలను తెలిపారు. దీంతో ధర్మాసనం కేసును ముగిస్తున్నట్టు పేర్కొంది. భవిష్యత్లో విడాకులు కోరే హక్కును సంగీతకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయ్ తనకు తెలియకుండా ఓ అగ్రనటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని.. ఈ విషయం తనకు 2021 ఏప్రిల్లో తెలిసిందని సంగీతన తన పిటిషన్లో పేర్కొన్నారు. వారిద్దరి సంబంధం తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని.. ఆమెతో సంబంధం ముగిస్తానని విజయ్ హామీ ఇచ్చినా.. మళ్లీ కొనసాగిస్తున్నాడని సంగీత వెల్లడించారు. విజయ్ కావాలనే తనను దూరం పెట్టాడని, ఆ నటితో కలిసి విదేశీ టూర్లకు వెళ్తున్నట్టు సంగీత పిటిషన్లో పేర్కొన్నారు.
విజయ్ ప్రవర్తన, 2024లో సోషల్ మీడియాలో చెలరేగిన వివాదాల వల్ల తాను, తన ఇద్దరు పిల్లలు తీవ్ర మానసిక వేదనకు గురైనట్టు సంగీత వెల్లడించారు. అప్పట్లో ఈ ఆరోపణలు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఏప్రిల్ 20న ఈ కేసు విచారణ జరగడం కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ కేసుపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు సంగీత కేసు వెనక్కు తీసుకోవడంతో ఇద్దరూ కలిసిపోయారా లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తెలియరాలేదు.