మహబూబ్‌నగర్ , ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది వరద జలాలను పాలమూరు ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఎందుకు నీళ్లని ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 11వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఉ మ్మడి జిల్లా తరఫున డెడ్ లైన్ విధిస్తున్నామని.. ఈ లోగా పంపులు ప్రారంభించి ఇటు నార్లాపూర్ లో.. అటు కల్వకుర్తి నుంచి చివరి ఆయకట్టు వరకు కాల్వలకు నీళ్లు విడుదల చేయకపోతే భారీఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మొద్దు నిద్రలో కాంగ్రెస్ : మాజీ మంత్రులు
రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తక్షణమే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మోటార్లను, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నార్లాపూర్ పంపులను ఆన్ చేసి, నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్ల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. వరద మొదలై 15రోజులు గడిచినా, శ్రీశైలం జలాశయం నిండుతున్నా రైతులకు నీళ్లు ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవడం దారుణమన్నారు.
తెలంగాణకు అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నీళ్లను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మాల్యాల పంప్ హౌస్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ వేలాది క్యూసెక్కుల నీటిని తరలించుకపోతుంటే , మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసుకోకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రులు అన్నారు.
రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడా?
ఆంధ్రప్రదేశ్ నేతలకు ఉన్న సోయి తెలంగాణ నీళ్ల మంత్రికి లేకపోవడం సిగ్గుచేటని, పాలమూరు లాంటి కరువు జిల్లాలో నీళ్లు ఉండి కూడా నీళ్లను ఎత్తి పోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందికే వస్తుందని, నీళ్ల మంత్రిని శిక్షించిన తప్పులేదని, శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడు కూడా తెలంగాణ రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వకపోవడానికి కారణమేంటి? అని వారు ధ్వజమెత్తారు. చంద్రబాబు కింద పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్‌ను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌కు గతంలోనే అనుసంధానం చేసినందున, నార్లాపూర్ రిజర్వాయర్‌లో నీటిని నింపితే ఎల్‌నినో నేపథ్యంలో కేఎల్ఐ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి పంపులను వెంటనే ప్రారంభించి రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపడంతో పాటు కాల్వలకు నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
పోరుబాటకు సిద్ధం : మాజీ ఎమ్మెల్యేలు
పాలమూరు రైతులకు సాగునీరు అందించేందుకు పోరుబాటకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నా… నీళ్లే లేవంటూ రైతాంగాన్ని కాం గ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఈనెల 11వ తేదీ వరకు డెడ్‌లైన్ విధిస్తున్నామని.. అప్పటిలోగా ప్రారంభించకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్‌ను ముట్టడిస్తామని వారు పేర్కొన్నారు. అక్కడ రైతులు..ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేస్తామన్నారు.