Congress | కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఏమిటి? ఒకటి.. ఫెడరల్ స్ఫూర్తి లేదు. రాష్ర్టాల మీద గౌరవం లేదు. రెండు.. ప్రజల ఆకాంక్షలు పట్టవు. తాత్కాలిక తాయిలాలతో బండి లాగిస్తుంది తప్ప సమస్య పరిష్కరించదు. మూడు.. సమస్యలు తానే సృష్టిస్తుంది. లేదా ఉన్న సమస్యలో ఆజ్యం పోసి రాజకీయం చేస్తుంది. పరిస్థితి తిరగబడి పీక మీద కత్తి పెడితేనే స్పందిస్తుంది. స్వాతంత్య్రానంతరం దేశ రాజకీయాలను ఎక్కువ కాలం శాసించిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ఆలోచన తీరు స్థూలంగా ఇదే. దేశంలో జరిగిన కొత్త రాష్ర్టాల ఏర్పాట్ల సందర్భాలన్నీ రాష్ర్టాల డిమాండ్లు సాయుధ పోరాటాల స్థాయికి చేరి పరిస్థితి అదుపు తప్పడమో, లేదా తాను రాజకీయంగా సమాధవుతానన్న భయం ఆ పార్టీని వెంటాడటమో జరిగినప్పుడే కాంగ్రెస్ స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటూ ఇలాగే జరిగింది. అందుకే తెలంగాణ ప్రజలు ఆ పార్టీ మీద శాశ్వతంగా విశ్వాసం కోల్పోయారు.
ఎవరి ఆచరణ అయినా వాళ్లు ఆలోచించే సిద్ధాంతాల పైనే ఆధారపడి ఉంటుంది. అది వ్యక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి ఎక్కువ కాలం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవగాహన, ఆచరణ దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. కాంగ్రెస్ రాజకీయ ఆచరణలో ముఖ్యమైన అంశాలు ఏమిటి.
మొదటిది, కాంగ్రెస్ ఎప్పుడూ ఫెడరల్ (సమాఖ్య) స్ఫూర్తిని నమ్మలేదు. బలమైన కేంద్ర ప్రభుత్వం పేరిట రాష్ర్టాల, ప్రాంతాల అధికారాలను అణచి వేస్తూ వచ్చింది. రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలను పేకమేడల్లా కూల్చేయడం అందులో భాగమే. ఇదే వైఖరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా పాటించింది. తెలంగాణను ఇప్పుడే ఆంధ్రతో కలపొద్దని స్టేట్స్ రీ ఆర్గనైజషన్ కమిటీ చెప్పినా కలిపివేయడం వెనుక ఇదే భావజాలం ఉన్నది. ప్రాంతీయ ఆకాంక్షలను చిదిమేసి కేంద్రీయ అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో సుస్థిరం చేసుకోవడమే దీనివెనుక ఉన్న ఏకైక లక్ష్యం. చిన్న రాష్ర్టాల ఏర్పాటు మీద కాంగ్రెస్ అవగాహన ఏమిటి? ఎలా స్పందిస్తుంది? అనుభవాలు చెప్తున్నది ఏమంటే.. కొత్త రాష్ర్టాలను ఏర్పాటుచేయడంలో సాధారణంగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉత్సాహం చూపదు. కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ సైతం ఇదే తెలిపింది. 1960లలో, 70లలో కొత్త రాష్ర్టాల ఏర్పాటును అవి తప్పనిసరి కాబట్టే ఒప్పుకున్నది. ఇక 1980ల తర్వాత కాలంలో బోడో లాంటి ప్రాంతాలతో ప్రత్యేక హిల్ కౌన్సిల్స్ వంటి ఏర్పాటు వరకు ఒప్పుకున్నది. అది కూడా ఈశాన్య భారతంలో, బోడోలు, ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేసిన వాళ్లు, కొన్ని సందర్భాల్లో సాయుధ పోరాటాన్ని మొదలు పెట్టినప్పుడే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల మీద కేంద్రం చేసిన దౌర్జన్యం, రాజకీయ మోసం గురించి ఎన్నో ఉదాహరణలున్నాయి. స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్న జార్ఖండ్ ప్రత్యేక ఆదివాసీ రాష్ట్ర కల, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా నెరవేరడానికి యాభై ఏండ్లు పట్టింది. మూడు దశకాల పాటు పోరాడితేనే జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది తప్ప, తూర్పు భారతంలోని ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్ష కాంగ్రెస్‌ను కరిగించలేదు. హిమాలయాల ఒడిలో ఉన్న ఉత్తరాఖండ్ పహాడీలు ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక ఉత్తరాఖండ్గా ఏర్పడటానికి ఎన్నో దాష్టీకాలను సహించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని బస్తర్ ఆదివాసీలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కోరుకుంటే అది మావోయిస్టుల డిమాండ్‌గా ముద్రవేసి వ్యతిరేకించింది కాంగ్రెస్సే.
ఇక రెండవది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రాంతాల్లో లేక రాష్ర్టాల్లో వచ్చే సమస్యలకు కారణాన్ని కాంగ్రెస్సే సృష్టిస్తుంది, సమస్యలను రెచ్చగొడుతుంది. అందులో భాగమవుతుంది, పరిష్కారం కూడా తానే చూపించగలనని చెప్తుంది. ఈశాన్య భారతం, పంజాబ్, కశ్మీర్‌లలో వచ్చిన నిరాయుధ, సాయుధ ఉద్యమాలకు కాంగ్రెస్ పాలసీలు కారణం కాదా? హైదరాబాద్ రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసి తెలంగాణ భాగాన్ని ఆంధ్రతో కలిపేయడం ఇందులో భాగమే.
ఇక మూడవది, ప్రజాస్వామిక డిమాండ్ల పరిష్కారం కేంద్ర అధిష్ఠానం అధీనంలో మాత్రమే ఉండటం. రాష్ట్ర నాయకత్వం ఎప్పుడూ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ కాదు, వాళ్లు వాళ్ల పార్టీ నాయకత్వానికి మాత్రమే విధేయులు. ఈ అంశ మే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అణచిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప తెలంగాణ ఆకాంక్షలు, అభివృద్ధి పట్టని కాంగ్రెస్ అధిష్ఠానం అరవైయ్యేండ్ల ఘటనలకు, నష్టాలకు జవాబుదారీగా మిగులుతుంది. ఇక్కడ ఒక సంఘటనను ప్రస్తావించుకోవాలి. తెలంగాణ ఏర్పాటుకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ నియమించిన తర్వాత, ఆ కమిటీ పని ఎంత పురోగమించిందో తెలుసుకోవాలని ఒక నాయకుడు వెళ్తే, ప్రణబ్ ముఖర్జీని కాదు సోనియా గాంధీని కలవండని జవాబు వచ్చిందట. అందుకే తెలంగాణకు పరిష్కారం 2014 ఎన్నికల వరకు పోస్టుపోన్ అవుతూ వచ్చింది.
1955లోనే అంబేద్కర్, తాను రాసిన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’లో వివిధ అంశాలపై కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. రాష్ర్టాల పునర్విభజన, కులాలను వాడుకొని కాంగ్రెస్ అధికారం పొందడం, సంపూర్ణ మధ్య నిషేధం వంటి ఆలోచనల వరకు ఎన్నో అంశాలను చాలా క్రిటికల్‌గా చూశారు. ఇదే పుస్తకంలో ఒక సందర్భంలో అయితే ‘దేవుడు తాను నాశనం చేయాలనుకునే వాళ్లను ముందు పిచ్చివాళ్లను చేసి తర్వాత నాశనం చేస్తాడట. ప్రస్తుతం దేవుడు కాంగ్రెస్‌ను అదే చేస్తున్నాడు’ అని వ్యంగ్యాస్త్రం విసిరారు. 1955లోని కాంగ్రెస్ మీద అంబేద్కర్ చేసిన విశ్లేషణ 2014లో తెలంగాణ ఏర్పడేవరకు కూడా వర్తిస్తుంది. ఈ దేశంలో ఎన్నో సమస్యలను సృష్టించి వాటివల్లే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అందులో తెలంగాణ ఒకటి. అందుకే తెలంగాణను ఇచ్చిం ది నేనే అని ఎంత మొరపెట్టుకున్నా అధికారంలోకి రాలేకపోవడం కూడా ఇందుకే కావచ్చు.
చివరగా.. ఈ వ్యాస పరంపర వస్తున్న కాలంలో పాఠకుల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ గురించి ప్రస్తావించడం అసందర్భం కాదని భావిస్తున్నాను. 1960ల నుంచి జై తెలంగాణ ఉద్యమాన్ని చూసిన పాఠకులు, మలిదశ ఉద్యమంలో జరిగిన మలుపులతో పాటు సాగిన పాఠకులు, ఈ వ్యాసాలను చరిత్ర డాక్యుమెంటేషన్‌గా భావించారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఘటనలను, ద్రోహాలను, ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడిన సందర్భాలను తర్వాతి తరానికి చరిత్ర రూపంలో అందించే అవసరం ఉన్నదని భావించారు. అంటే ఏదో మేరకు ఈ విశ్లేషణ ఉద్దేశ్యం నెరవేరినట్టే.
(సమాప్తం)