మాటలు నేర్చినప్పటి నుంచీ
మాట్లాడుతూనే వున్నాను.
కొంత ధ్వనిగా
మరికొంత ప్రతిధ్వనిగా.
పునరుక్తులు కావవి
ఒక అనంత సంభాషణలో భాగం.
చూడటం తెలిసినప్పటి నుంచీ
చూస్తూనే వున్నాను
ఇష్టమైందే చూసే ఛాన్స్ లేదు
కనిపించినవే చూస్తున్నాను
అవి అపారదృశ్యంలోని కొన్ని శకలాలు.
వాసన తెలిసినప్పటి నుంచీ
ముక్కు లెగరేస్తూనే వున్నాను
పరిమళం కావొచ్చు
మరోటి కావచ్చు
మనిషి వాసన మాత్రం
అలవాటు కాలేదు.
స్పర్శ అమ్మతోనే మొదలైంది
అన్ని ఇంద్రియాలూ
దానిలో మిళితమై వున్నాయి.
మరి మనస్సో!?
అది అర్థమైతే ఇలా వుండను
కవిత్వం అబ్బినందుకే
నాకు కొంత
అమూర్త జీవితం మొదలైంది.