HYDRA | ‘దేశం మేలు కోసం’ అని ప్రజలను మభ్యపెట్టి అకస్మాత్తుగా ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాల వెనుక రాజకీయ దురుద్దేశమే దాగి ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ, మోదీ పాలనలో పెద్ద నోట్ల రద్దు లాంటివి ఆ కోవకు చెందినవే. స్వీయ ప్రయోజనాల కోసం జన జీవితాలను అతలాకుతలం చేసిన నిర్ణయాలివి. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పుర్రెలో పుట్టిన హైడ్రా ధ్వంసరచన కూడా అలాంటి బాపతే. హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల రక్షణ పేరిట మొదలైన ఈ సంస్థ దూకుడు వెనుక ఉన్న రాజకీయ కోణం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ముందుగా చెరువు పరిధిలో ఉన్న కొన్ని కట్టడాలను కూల్చేసి శభాష్ అనిపించుకుని, మెల్లగా ప్రత్యర్థుల ఆస్తుల వైపు హైడ్రా రూటు మార్చింది.
జన్వాడలో ప్రదీప్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ను కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. హైడ్రా కన్ను ప్రత్యేకంగా ఆ కట్టడంపై పడటానికి కారణం దాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ లీజుకు తీసుకోవడమేనని తెలుస్తోంది. ఆ ఫామ్‌హౌజ్ తనది కానప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే దాన్ని దగ్గరుండి మరీ కూల్చివేయిస్తానని కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇందుకు ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ముందుజాగ్రత్తగా ప్రదీప్ రెడ్డి తన ఫామ్‌హౌజ్ కూల్చివేతపై స్టే కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం హైడ్రా కూల్చివేతలపై విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? యజమాని వద్దనున్న డాక్యుమెంట్లు చూస్తున్నారా? నోటీసులు ఇస్తున్నారా? బఫర్ జోన్ మార్కింగ్ అయిందా? నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ ఉందా? హైడ్రాను ఎలా ఏర్పాటు చేశారు? దాని చట్టబద్ధత ఏమిటి? ఏ నిబంధనలను పాటించి, ఏయే నిర్మాణాలను కూల్చారో వివరించాలంటూ తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. ఇప్పటికైనా ఒకరు కోర్టు తలుపులు తట్టడం వల్ల హైడ్రా దూకుడుకు కళ్లెం పడే అవకాశం వచ్చింది.
కోర్టు ప్రశ్నల నేపథ్యంలో హైడ్రా ఏకపక్ష ధోరణిపై టీవీల్లో కథనాలు వెలువడుతున్నాయి. ‘అన్ని అనుమతులతో కట్టిన అపార్ట్‌మెంట్‌ను ఎలాంటి నోటీసు లేకుండా కూలదోస్తే నా బతుకేం కావాలి?’ అని ఓ రియల్టర్ పడుతున్న వేదనను ఓ చానల్ ప్రసారం చేసింది. ‘గండిపేట సమీపంలో రెండు రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రెస్టారెంట్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. ఇప్పటికే రూ.20 లక్షల వరకు ఖర్చు చేశాం. ముందే సమాచారమిచ్చి ఉంటే.. ఏసీలు, ఫ్రిజ్ లాంటి విలువైన వస్తువులనైనా దక్కించుకొనేవాళ్లం’ అని దాన్ని లీజుకు తీసుకున్న వ్యాపారి లబోదిబోమంటూ బోరున విలపించారు.
జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం మూలాలను వాడుకొని హైడ్రా ఏర్పడింది. నిజానికి వరదలు, తుఫాన్లు లాంటి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను ఆదుకొనే సాహస వీరుల దళమిది. ఆ చట్టం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పరిధిని విస్తృతపరిచి నగరంలో అకస్మాత్తు వైపరీత్యాలను సృష్టించే అధికారాలను దానికి కట్టబెట్టింది. అయితే పుట్టగానే పరుగులు పెట్టినట్లు అది రోజూ నగర పరిధిలోని భవంతులను నేలమట్టం చేస్తున్నది. జీహెచ్ఎంసీ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థకు రాష్ట్రంలోని వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుచ్ఛక్తి, పోలీస్ విభాగాలు సైన్యంగా తోడుంటున్నాయి. ఆక్రమణదారును ఈ విభాగాలన్నీ కలిసి కదలకుండా చేస్తున్నాయి.
హైడ్రాకు చైర్మన్ సీఎం కాగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. జీవో 99 ద్వారా ప్రభుత్వం ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా హైడ్రాకు ఇచ్చిన విస్తృత అధికారాల మూలంగా ‘ఈ కూల్చివేతలు ఆగవు, వెనక్కి తగ్గేది లేదు, ఎవరున్నా వదిలేది లేదు’ అని దాని కమిషనర్ రంగనాథ్ తెగేసి చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన మున్సిపల్, ఇతర విభాగాల అధికారులపై కూడా చర్యలుంటాయని ఆయన కరాఖండిగా చెప్తున్నారు. ఇప్పటికే ఇరవై చెరువుల పరిధిలోని వంద ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఉన్న చట్ట విరుద్ధమైన నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమ ప్రాంతంలోని చెరువులు, పార్కులకు అక్రమార్కుల చెర నుంచి విముక్తి లభిస్తున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కూల్చివేతల్లో రెండు రకాల నిర్మాణాలున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టిన భవంతులు మొదటి రకానికి చెందినవి. శాస్త్రిపురం చెరువు వద్ద కూల్చివేసిన భవంతి అలాంటిదే. జీహెచ్ఎంసీ అనుమతులతో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు రెండో రకానివి. నిజాంపేట్‌లోని ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని కూల్చివేసిన మూడు భవంతులు ఈ కోవకు చెందినవే. పక్కాగా అధికారుల అనుమతులతో నిర్మిస్తున్నందువల్ల ఎందరో వాటిలో ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు. మొదటి రకం నిర్మాణాల కూల్చివేతల వల్ల నష్టపోయేది కబ్జాదారుడే. కానీ, రెండో రకం అలా కాదు. వాటిని కూల్చివేస్తే సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఇలాంటి భవంతుల కూల్చివేతల వల్ల బిల్డర్‌కు పోయేదేం లేదు. అందుకే ఈ వ్యత్యాసాన్ని గుర్తించి కూల్చివేతల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
అక్రమ వెంచర్లకు అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలుంటాయని హైడ్రా బాస్ రంగనాథ్ అంటున్నారు. కూల్చివేతలతో పాటే ఆ పని కూడా మొదలుపెడితే ప్రజలు సంతోషిస్తారు. వాస్తవానికి చట్టాలను జీహెచ్ఎంసీ సరిగ్గా అమలుచేస్తే ఇలాంటి నిర్మాణాలే ఉండవు. ఎప్పటికప్పుడు నగరంలోని కట్టడాలను పర్యవేక్షిస్తే అనుమతులు లేని పనులేవీ సాగవు. కోట్లాది రూపాయల నిర్మాణ సామగ్రి, ఇంజినీర్ల శ్రమ, కూలీల స్వేదం బూడిదపాలు కావు. దుమ్ము, ధూళి, శిథిలాలతో నగరం సిమెంటు దిబ్బ కాదు. కూల్చివేత ఖర్చు ప్రభుత్వంపై పడదు. తప్పంతా అధికారుల్లో ఉంచుకొని శిక్ష ప్రజలకు వేస్తున్నట్లుంది ఈ వ్యవహారం. చేపట్టిన కార్యం అభినందించదగినదే అయినప్పటికీ అమాయకుడికి శిక్ష పడకూడదనే సహజ న్యాయం అణచివేతకు గురవుతున్నది.
హైడ్రా కూల్చివేతలు ఇలాగే కొనసాగితే నగరంలో అశాంతి నెలకొనవచ్చు. దాని కమిషనర్ పోలీస్ అధికారి కాబట్టి, అంతా మిలిటరీ దాడిలాగా సాగుతోంది. ఒక సర్జికల్ ఆపరేషన్ మాదిరి లక్ష్యం వైపు హైడ్రా పయనిస్తోంది. అయితే ఈ కూల్చివేతల్లో ఒక్క సామాన్యుడు నష్టపోయినా దాని పాపం ప్రభుత్వానిదే. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. ఒక్కసారిగా తుఫానులా మీద పడకుండా ఏదైనా ఒక న్యాయ సూత్రాన్ని పాటించాలి. కోర్టు సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.
నిజంగానే హైదరాబాద్ స్థిరాస్తులను కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే అఖిలపక్షం ద్వారా అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి. ఆక్రమణదారులకు ముందుగా నోటీసులిచ్చి వారి వద్ద ఉన్న అనుమతులను పరిశీలించాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి కూడా ఇలాంటి నిర్మాణాలున్నాయని విపక్షాలు అంటున్నాయి. వారి వద్ద నుంచి సమాచారం తీసుకొని ముందుగా అధికార పార్టీ నేతల అక్రమ కట్టడాలను కూల్చి తమ నిజాయితీ నిరూపించుకోవాలి. రాజకీయ దురుద్దేశంతో కాకుండా నగరాన్ని బాగుచేద్దామనే సత్సంకల్పంతో ముందడుగేస్తే అందరూ ముందుకొస్తారు.
– బి.నర్సన్
94401 28169