Telangana | అది రాజకీయ యుగం. ఎన్నికల సీజన్. అధికార సౌధాన్ని చేర్చే దారి. దానిపక్కన ఒక పులి కూర్చొని ఉంది. ముసలిది! ఒళ్లు డస్సిపోయి, సత్తువ సడలిపోయి, పళ్లు ఊగిపోయి, గోళ్లు ఊసిపోయి, కళ్లు మాడిపోయి, వేటాడే చేవ చచ్చినా ఆ పులిలో డాబుకు తక్కువ లేదు. ఆ పులి చేతిలో ఆరు బంగారు కంకణాలున్నాయి. ఆ దారి పక్కనే దండిగ నీళ్లతో నిండైన చెరువు. ఆ చెరువులో స్నానం చేసేందుకు ఒక బాటసారి వచ్చిండు. పులిని చూసి బెదిరిపోయిండు.
అంతలో పులి అత్యంత వినయంతో, ‘ఓయీ, బా టసారీ. దయచేసి నన్ను చూసి భయపడవద్దు. నేను నిన్నేమీ చేయను’ అన్నది. దీంతో ఆ బాటసారి బెరుకు బెరుగానే ఆగిండు. అతడికి ఇంకా భయం పోలేదని గ్రహించిన పులి… ‘ఇదిగో, నీలాంటి అమాయకుడైన పుణ్యాత్ముడి కోసమే నేను ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న. రా.. ఈ బంగారు కంకణం తీసుకో. నీ దరిద్రాన్ని పోగొట్టుకో! అయితే…’ పులి నమ్మబలికింది.
‘ఆ.. అయితే?’ అనుమానంగా ప్రశ్నించిండు బాటసారి. ‘నేను బాగా వయసులో ఉన్నప్పుడు మనుషులను చంపి తిని బోలెడంత పాపం మూటగట్టుకున్న. ఆ చెరువులో స్నానం చేసి వచ్చిన బాటసారికి ఆరు బంగారు కంకణాలు దానం చేసుకుంటే, మా 60 తరాల పాపాలు పోతాయని ఒక మునీశ్వరుడు నాకు చెప్పిండు. అందుకే నీలాంటి మంచివాడు ఎప్పుడు వస్తడా? అని చూస్తున్న’ అన్నది పులి!
బాటసారికి విషయం అర్థమైంది. ఎందుకంటే అతడు అప్పటికి 70 ఏండ్ల నుంచీ పంచతంత్రంలో ‘పులి- పేరాశ బాటసారి’ కథ చదువుతూనే ఉన్నడు! ‘సరే నువ్వన్నట్టే చేస్తాలే!’ అంటూ అతడు చెరువులో స్నానానికి దిగిండు. అది కాళేశ్వర జలంతో నింపిన చెరువు. అందులో దిగగానే ఆ బాటసారికి ఆ పులి 60 ఏండ్లుగా చేసిన పాపాలన్నీ సినిమా రీల్ తిరిగినట్టుగా కండ్లముందు తిరిగినయి. తాను పడ్డ కష్టాలన్నీ కనిపించి కన్నీళ్లు కారినయి. తమ జాతి పెద్ద చెప్పిన మాటలన్నీ స్ఫురణకు వచ్చినయి. కాళేశ్వర జల ప్రభావంతో ఆ బాటసారి శరీరంలోకి అమితమైన శక్త్తి ప్రసారమైంది. చెరువు నుంచి బయటికి వచ్చిన బాటసారి, నిబ్బరంగా పులి దగ్గరికి చేరుకున్నడు. చూపుడు వేలితో, కుడిచేతి ఒక్క చూపుడు వేలితో పులి గుండెల్లో గుచ్చిండు. ఆ దెబ్బతో పులి మళ్లీ లేవ లేకుండా చచ్చి ఊరుకుంది.
చూపుడు వేలుపై అంటిన పులి రక్తం, అచ్చం ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రంలో పెట్టిన సిరా చుక్కలాగే ఉన్నది!
‘పంచతంత్రంలో పులి చూపిన బంగారు కంకణాలకు ఆశపడి, చెరువు ఊబిలో దిగి, ప్రాణాలు పోగొట్టుకున్న పేరాశ బాటసారిని అనుకుంది పిచ్చి పులి నన్ను. కాలం మారిన సంగతి దానికి తెల్వదు పాపం!’ తనలో తానే అనుకుంటూ ప్రగతి భవిష్యత్తులోకి సాగిపోయిండు బాటసారి!
ప్రతి జీవికీ జాతి లక్షణాలు కొన్ని ఉంటాయి. వద్దనుకున్నా అవి పోవు. తెచ్చుకుందామనుకున్నా కొత్తవి అబ్బవు. కొన్నిసార్లు నక్క పులిచారలు పెట్టుకోవచ్చు. కుడితి గోలెంలో పడ్డప్పుడో, తోటి జంబూకాలు ఊలపెట్టి ఊగినప్పుడో, అసలు రంగు బయటపడొచ్చు. అధికారమనే ఆకలితో నకనకలాడితే, క్రూరమైన పులే కొన్నిసార్లు నక్క వేషమూ వేయవచ్చు. నయవంచక సాధుత్వమూ నటించవచ్చు. పంచతంత్రంలోనే ఇలాంటివి జరిగినప్పుడు ఇక రాజకీయ ప్ర-పంచతంత్రం గురించి చెప్పాల్నా! క్రూరమైన పులి- ఆరు బంగారు కంకణాల కథ వింటుంటే తెలంగాణ కాంగ్రెస్- ఆరు గ్యారెంటీల కథ గుర్తుకు వస్తున్నదా!? అయితే ఆ తప్పు నాది కాదు. అది చరిత్రది. ఎందుకంటే ఆరు అంకెకు, కాంగ్రెస్‌కు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది! ఆరు అనగానే ఆరు సూత్రాల పథకం గుర్తుకు వచ్చిందా? హతవిధీ! నన్నేమి చేయమందురు! అది చరిత్ర పొల్లుపోకుండా రాసిన వారి పాపం! తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం వచ్చిన ముల్కీ రూల్స్‌ను మూలకు పెట్టడానికి 1973లో కాంగ్రెస్ ఆరు సూత్రాలనే కదా ప్రయోగించింది. తెలంగాణ వాడు తెలంగాణ వాడు కాకుండాపోవడానికి, ఈ ప్రాంతవాసి పరాయిగా మారి, స్థానిక హక్కులు కోల్పోవడానికి కారణం కాంగ్రెస్సే కదా! వద్దు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా, ఆరు దశాబ్దాల కిందట తెలంగాణను ఆంధ్రాతో కలిపి, దాదాపు ఆరు పదుల ఏండ్లు ఉమ్మడి పాలన పేరుతో అరిగోస పెట్టి, ఆరేడు పదవుల కోసం వలస నేతలకు ఊడిగం చేసి, ఆరున్నొక్క రాగం తీసిన కాంగ్రెస్, ఇప్పుడు సరిగ్గా ఆరంకెనే ఎంచుకొని, హామీల ఆశజూపి ప్రజల ముందుకురావడం కాకతాళీయమే కాదు; చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదానికి సంకేతం.
కాంగ్రెస్ మొదట ఐదు హామీలే ఇద్దామనుకున్నదట. చివరాఖరి క్షణంలో ఆరో హామీని జత చేశారట! అదేమిటోగానీ కాంగ్రెస్‌కు ప్రజల్ని మోసం చేయాలనుకున్నప్పుడల్లా ఆరంకే గుర్తుకు వస్తుంది ఎందుకో! ‘ఆరు హామీలు అమలుచేస్తం. కాంగ్రెస్ పెద్ద మనుషులుగా మేం మీకు గ్యారెంటీ ఇస్తున్నం’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు సంతకాలు పెట్టి ఇంటింటికీ లేఖలు పంపుతారట! ‘పెద్ద మనుషులు’ అన్న పదం వినగానే, ఆరు దశాబ్దాల నాటి మరో దురాగతం గుర్తుకువచ్చిందా? రాక తప్పదు. 1956లో ఇలాంటి ఆరుగురు ‘పెద్ద మనుషులు’ కలిసే కదా, సుసంపన్న తెలంగాణ నుదుటిపై నల్ల రాత రాసి, చీకటి సంతకం చేసి, పరాధీనం చేసింది! ప్రజల నుంచి ఏ అధికారమూ పొందకుండా, ప్రజల నుంచి ఏ ఆమోదమూ అడగకుండా, తెలంగాణలో ప్రజలంటూ కొందరున్నారన్న సోయే లేకుండా, తెలంగాణ అంటే మనుషులు కాదు; మట్టి అన్నట్టు, అదేదో కాంగ్రెస్ సొంత సొత్తయినట్టు, ఆరేడుగురు కాంగ్రెస్ నేతల జాగీరైనట్టు, ‘పెద్ద మనుషులు’ ఆంధ్రాకు రాసివ్వలేదా! కాంగ్రెస్ కొట్టిన ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి తెలంగాణకు ఆరు దశాబ్దాలు పట్టింది. సాయుధ పోరాటంలో, తొలి, మలిదశ ఉద్యమాల్లో, నక్సల్బరీ ఉద్యమంలో కలిపితే ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ బిడ్డలు ఎందరు? 6 వందలా? 6 వేలా? ఎవరు లెక్కతేల్చాలి! ఆ పాపం ఎవరిది? తెలంగాణను కాంగ్రెస్ పరాస్త్రం చేయడం వల్ల 60 ఏండ్లలో ఈ ప్రాంతానికి కలిగిన నష్టం 6 లక్షల కోట్లా? 60 లక్షల కోట్లా? అటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలంటూ ముందుకు వస్తున్నది.
ఎందుకో ఆ పథకాల పేర్లు వింటే భవిష్యత్తు మీద భయమే కాదు; గతం గుర్తుకువచ్చి ఒళ్లు జలదరిస్తున్నది.
స్వతంత్ర దేశంగా పరిఢవిల్లిన తెలంగాణ మూడు ముక్కలై, మూడు చోట్లకు మారి, సర్వనాశనం కావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ కదా! తర్వాత స్వరాష్ట్రంగా వెలిగిన తెలంగాణ స్వయం ప్రతిపత్తి కోల్పోవడానికి కారకులెవరు? కాంగ్రెస్ కదా! ఎప్పటికప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న హక్కులను దొంగలకు సద్ది కట్టిందెవరు? కాంగ్రెస్ కదా! నా తెలంగాణ గడ్డ మీదే నన్ను పరాయివాడిని చేసిన పాపి ఎవరు? కాంగ్రెస్ కదా! దొంగతనం చేసినవాడే బంగారాన్ని తెచ్చిచ్చి ‘నేను పత్తిత్తును, నిజాయతీపరుడిని, నన్ను నమ్మి మరొక్క చాన్స్ ఇవ్వండి’ అన్నాడంటే, అది ఇంకింత ఎత్తుకుపోయేందుకు వేసిన ఎత్తుగడ మాత్రమే!
1956లో విలీనం నాటికి తెలంగాణ ఎంత బాగుండె? 2014లో కేసీఆర్ యూపీఏ ప్రభుత్వం నుంచి తెలంగాణ గుంజుకొచ్చిన్నాటికి తెలంగాణ ఎంతటి కష్టంలో ఉన్నది? మరి ఈ ఆరు దశాబ్దాల అన్యాయానికి, జీవన విధ్వంసానికి, బలైన బతుకులకు, కార్చిన కన్నీళ్లకు, గుండె గుండే భరించిన పరితాపానికి పరిహారం ఎవరు కట్టిస్తారు.. కాంగ్రెస్సా?! 60 ఏండ్ల పాపాలకు, బలి తీసుకున్న బతుకులకు ఆ పార్టీకి ఎన్నేండ్లు శిక్ష వేస్తే మాత్రం తీరుతుంది?
ఆరు గ్యారెంటీల సంగతి తర్వాత. ముందు పాత వారెంటీ గురించి చెప్పండి! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు, ఆరు దశాబ్దాల పాపాలను అరక్ పేపర్లో అందంగా చుట్టి, మంచి పేర్లు పెట్టి, మాయమాటల మసాలాలద్ది, ఇంటింటికీ పంచి అబ్రకదబ్ర అంటే మోసపోయేది కాదు నేటి తెలంగాణ! ఇది కేసీఆర్ తెలంగాణ!! కొందర్ని కొన్నిసార్లే మోసం చేయవచ్చు. అందర్నీ అన్నిసార్లూ చేయలేం. ఇది కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాల్సిన సత్యం.
పదేండ్ల కేసీఆర్ పాలన ఫలితం… తెలంగాణ ఇప్పుడు బంగారు కొండ! ఆ కొండకు ఎంటిక వేద్దాం. వస్తే కొండ వస్తది. పోతే ఎంటిక పోతది. ఇదీ కాంగ్రెస్ లెక్క. ఇచ్చేదుందా? చచ్చేదుందా? ముందు గెలవడం ముఖ్యం అన్నది దాని పాలసీ. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి గ్యారెంటీలు ఇచ్చిన చరిత్ర లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాల్లో ఇటువంటి గ్యారెంటీలు అమలుచేస్తున్న రికార్డు లేదు. రేపు తెలంగాణలో గ్యారెంటీలు అమలు చేయకపోతే ఏంటన్న కట్టుబాటూ లేదు! ఆరు దశాబ్దాలుగా, పేద్ద ‘పెద్ద మనుషులు’ పంచెలు సవరించుకుంటూ పెట్టిన సంతకాలకే దిక్కులేకుండాపోయింది. ఇక రేవంతులూ, విక్రమార్కలు ఒక లెక్కా! రాష్ట్ర బడ్జెట్ మొత్తం కన్నా ఎక్కువ విలువైన హామీలు ఇచ్చారంటేనే, కాంగ్రెస్ చిత్తశుద్ధి ఎంతో అర్థమవుతుంది. ‘నా ము… కాకుంటే గోల్కొండ దాక దేకు’ అని తెలంగాణలో ఒక ముతక సామెత ఉన్నది.
ప్రతి జీవికీ ఒక జాతి లక్షణం ఉన్నట్టే, ప్రతి పార్టీకీ ఒక స్వభావం ఉంటుంది. కాంగ్రెస్‌కున్న జాతి లక్షణం మాట తప్పడం. తెలంగాణ విషయంలో ఎన్నిసార్లు మాట తప్పి, నాలుక మడతపెట్టిందో మనం చూడలేదా! అంతెందుకు.. మూడు నెలల కిందట కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయక, చేయలేక రోజుకో మాట మాట్లాడుతున్న చిత్రం కనిపించడం లేదా! దాదాపు 6 దశాబ్దాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించి కూ డా మన కోసం ఆలోచించని కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారెంటీలని ఒక పిచ్చికాగితం చూపిస్తే నమ్మాలా? మొన్నటి నిజామాబాద్ ఎన్నికల్లో ఒకాయన పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసివ్వలేదా? ఏమైంది? అయినా మాట మీద నిలకడ ఉంటే పత్రంతో పనేముంది? పార్టీ సక్కనిదైతే గ్యారెంటీల అవసరమేముంది? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తేనైనా నాలుగు సీట్లు వస్తాయనుకొని, తప్పని పరిస్థితిలో ఒప్పుకుంది కాంగ్రెస్. ఇప్పుడేమో తెలంగాణను గెలిస్తే దేశవ్యాప్తంగా ఊపు వస్తుందని గ్యారెంటీల ఎర వేస్తున్నది. దాని ప్రేమంతా కేంద్రంలో అధికారం మీదే; తెలంగాణ మీద కాదు, తెలంగాణ ప్రజల మీద అంతకంటే కాదు!
24 గంటల కరెంటుతో, పచ్చని చేలతో, ఆకాశహర్మ్యాలతో, ఆగకుండా ఆడుతున్న కార్ఖానాలతో, కోట్లు పలుకుతున్న భూములతో మిలమిలలాడుతున్న తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్‌కు బంగారు బాతులా కనిపిస్తున్నది. జలయజ్ఞం కాలం నాటి ‘మూటలు’ గుర్తుకొచ్చి, కండ్లు, నోరూరుతున్నయి. అందుకే మాటిమాటికీ వచ్చి ఓటి మాటలు చెప్తున్నరు! ఆరు గ్యారెంటీల ముచ్చట తర్వాత! ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు కదా? ఏరి? ఆఖరిదాకా అభ్యర్థులెవరో చెప్పలేని వారు, ఆరు గ్యారెంటీల అమలుకు హామీ ఎట్ల పడ్తరు? బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు? సీఎం ఎవరో తేల్చుకోలేని పార్టీ, పూచీకత్తు ఎట్ల పడ్తది? తేడా వస్తే రేపు ఎవరిని అడిగేది?
ఉన్న తెలంగాణను ఊడగొట్టిన కాంగ్రెస్ అటువైపు, 13 ఏండ్లు కొట్లాడి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ఇటువైపు… పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టిన కాంగ్రెస్ అటువైపు, తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచగా వదులుకున్న కేసీఆర్ ఇటు వైపు… యాభై ఏండ్ల పాలనలో తెలంగాణను సర్వనాశనం చేసిన కాంగ్రెస్ అటువైపు, పదేండ్ల పాలనతోనే తెలంగాణను తెరిపిన పడేసిన కేసీఆర్ ఇటువైపు… వెన్నెముక హైదరాబాద్‌ను, విలువైన భూములు, ఆస్తులను అన్యాక్రాంతం చేసిన కాంగ్రెస్ అటువైపు, మన భాగ్యనగరాన్ని మనకే దక్కించి అభివృద్ధి చేసిన కేసీఆర్ ఇటువైపు… మన జీవనదుల్లో మందికి వాటాలు పంచిన కాంగ్రెస్ అటువైపు, మన గోదావరి, మన కృష్ణా నీళ్లు మనకే దక్కేలా ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ ఇటువైపు… మన జీవితాల్లో కన్నీళ్ల సుడిగుండాలు సృష్టించిన కాంగ్రెస్ అటువైపు, మన బతుకు నిండేలా భారీ సాగరాలు నిర్మించిన కేసీఆర్ ఇటువైపు… మన బతుకులను గోస గోస పెట్టిన కాంగ్రెస్ అటువైపు, అసహాయులందరికీ ఆసరాగా నిలిచిన కేసీఆర్ ఇటువైపు! చేసిందేమిటో చెప్పుకోలేని కాంగ్రెస్ అటువైపు.. చేసింది చెప్పి ఓట్లడుగుతున్న కేసీఆర్ ఇటువైపు! మరి మనం ఎటువైపు? ఈ ప్రశ్నే అనవసరం. ‘ఆరు’ నూరైనా కేసీఆర్ గెలుపు ఖాయం. ఎందుకంటే కేసీఆర్ గెలుపు.. బీఆర్ఎస్ గెలుపు మాత్రమే కాదు; అది తెలంగాణ గెలుపు!
అయినా 6 కేసీఆర్ లక్కీ నంబర్. అది కాంగ్రెస్‌కు అరిష్టం!!
