‘ఇది అరుపు కాదు.. ఏడుపు. నెమలి పిట్టల ఏడుపు. ఆదమరిచిన యాళ్ల ఆపద గుర్తెరిగి మగ నెమిళ్లు ఒర్రుకుంట ఒప్పనోన్ని గెదిమేందుకు గొంతు పోను పెడుతున్న పొగుల్ ఘాతలు. తావు చెదిరిన తల్లి నెమిళ్లు, పిల్ల నెమిళ్లు గొల్లు గొల్లున ఏడుస్తున్న ఏడుపులు’ అని చెంచు అంజన్న అనుభవం చెప్పిండు. నెమలి ఏడుపు అడవికి అరిష్టమని పూర్తి వీడియో చూడటానికి కూడా అంజన్న ఇష్టపడలేదు.
అర్ధరాత్రి వేళ సర్కారు పంపిన బుల్డోజర్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడి గ్రీన్ హంట్ చేస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరలైంది. 40.. 50 బుల్డోజర్లు ఏకధాటిగా వృక్షాలను కొరికేస్తుంటే.. ఆ ఆవాసంలోని నెమళ్లు చేస్తున్న హృదయ విదారక ఆర్తనాదాలు హృదయం ఉన్న ప్రతి మనిషిని కలచివేశాయి. ఇదే వీడియో క్లిప్పింగ్‌ను అచ్చంపేట జర్నలిస్టు మిత్రుడు చందు నాయక్ నల్లమల దట్టమైన అడవిలోని ఓ పెద్దమనిషి చెంచు అంజన్నకు చూపించాడు. ఇది నెమలి పిట్టల అరుపు కాదు.. ఏడుపు అని అంజన్న ఆవేదన చెందాడు. నెమలి తొమ్మిది తీర్లు పలుకుతుందట.. ఆకర్షణ, సంభోగం కోసమే ఏడు తీర్లుగా మగ నెమలి అరుస్తుంటే.. ఆడ నెమలి మురుస్తుందట. మిగిలిన రెండు శబ్దాలు ఒకటి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు శత్రువును భయపెట్టడానికి మగ నెమలి చేసే హెచ్చరికలు.. మరోటి ప్రమాదం తప్పదని తెలిసి ఆడ నెమలి ఏడుస్తుంటే.. తల్లిని చూసి పిల్ల నెమళ్లు గొల్లుగొల్లున ఏడుస్తాయని వివరంగా చెప్పిండు. అట్లని అంజన్న ఆర్నిథాలజిస్టు కాదు. నాగరికపు మాయ, రాజకీయ మర్మం తెలియని నిఖార్సయిన అడవి మనిషి. అడవి మీద అంతులేని పట్టున్న చెంచుజాతి ఆటవికుడు. యురేనియం తవ్వకాల కోసం నల్లమల అడవి మీదికి సర్కారు మళ్లీ జేసీబీలు పంపింది అనుకున్నాడట. గుడిసెలకు ఉరికి విల్లంబు అందుకున్నడు.. తనవాళ్లకు కేకేసి పిలిచిండు. సూనగాండ్లు దొంగ దెబ్బకొడుతన్నర్.. ‘ఏన్నో సూపిద్దు పా సారు’ అనుకుంటా యుద్ధానికి సిద్ధమైండు. ఇక్కడ కాదు పట్నంల అని వారిస్తుండగా.. ఏన్నైతేంది. పిట్టల ఏడుపు ఎవరికి సుతి ముడ్త లేదా? అని జర్నలిస్టు చందును నిలదీసిండట.
‘పిట్టల ఏడుపు ఎవరికి సుతి ముడ్త లేదా?’ అని అంజన్న ఆవేశంతో అన్నాడో.. ఆవేదనతోనో అన్నాడో గానీ, నెమలి తల్లి పిల్లల ఏడుపు ధర్మ దేవతకు సుతి ముట్టింది. అర్ధరాత్రి వేళ జాతీయ పక్షులు చేసిన హాహాకారాలు తెల్లారేసరికి తెలంగాణ జాతిని మేల్కొల్పినయి. ధర్మాసనం తలుపు తట్టి, మదపుటేనుగు ఒగరుబోతుతనాన్ని దించింది. ప్రభుత్వ పంచన చేరిన ప్రకృ తి కవులు, పదవులు అనుభవిస్తున్న ఉద్యమకారులు ఇప్పటికీ నోరు తెరవటం లేదు. రుషికొండ అని, మడ అడవులని గుండెలు బాదుకునే పరాయి మీడియాకు హైదరాబాద్ అంతర్గర్భంలోని ఆటవిక విధ్వంసం కనిపించలేదు. కానీ, రక్తమాంసాల స్పర్శకు సోషల్ మీడియా స్పందించింది. పాలకుల దాష్టీకాన్ని నిష్కర్షగా ఖండించింది. అటవీ భూమిని కాపాడటానికి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి అండగా నిలబడింది.
నిజమే..! రెవెన్యూ రికార్డుల ప్రకారం… హెచ్‌సీయూ భూములు అటవీ భూములు కావు. కానీ, వేల ఏండ్లనాటి నుంచి జంతుజాల జీవనానికి ఆవాసంగా మారిన అటవీ ఆవరణం. బయో డైవర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం 400 ఎకరాల విస్తీర్ణంలో 40 వేల చెట్లతో ఎదిగిన స్క్రబ్ అడవి. పుట్టగొడుగుల ఆకృతి చిలపరాళ్లు.. 72 చెట్ల జాతులు, క్షీరదాలు, సరీసృపాలు, 230 రకాల పక్షులున్నాయి. మచ్చల జింకలు, బెంగాల్ మానిటర్ బల్లులు, కొండచిలువలు, నెమళ్లు, కుందేళ్లు, గుడ్లగూబలు, ఫ్లెమింగో పక్షులు, నక్షత్ర తాబేళ్లు, అడవిపందుల ఆవాసం. మార్కింగ్ నట్, మష్రూమ్ రాక్స్ ఇక్కడి ప్రత్యేకత. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఇక్కడ పెరిగే ప్రతి జీవికి జీవించేహక్కును కల్పించాలి. 2002 ఏపీ వాల్టా చట్టం ఇక్కడ పెరిగే ప్రతి చెట్టుకు భద్రత కల్పించాలి. 1912 అటవి, పక్షుల భద్రత చట్టం ఇక్కడ ఎగిరే ప్రతి పిట్ట ప్రాణాలకు భరోసా కల్పించాలి. ప్రైవేట్ భూమి అయినప్పటికీ వన్య జీవుల మనుగడకు చట్టపరమైన భధ్రత కల్పించాల్సిన బాధ్యత అటవీశాఖ మీద ఉన్నది. దాన్ని ఆ శాఖ సంపూర్ణంగా విస్మరించింది.
2003లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గచ్చిబౌలిలోని సర్వే నం.25లోని ఇదే భూమిని బిల్లీరావు అనే వ్యక్తి సృష్టించిన ఐఎంజీ అనే సంస్థకు అప్పగించారు. ఎకరానికి రూ.50 వేల చొప్పున 400 ఎకరాలు రూ.2 కోట్లకు అమ్మినట్టుగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను అప్పటికే అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2006, సెప్టెంబర్‌లో రద్దుచేసింది. వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని బిల్లీరావు కోర్టులో సవాల్ చేశారు. ఇక అప్పటినుంచి కోర్టులో కేసు నడుస్తున్నది గానీ, భూమి మాత్రం హెచ్‌సీయూ ఆధీనంలో ఉన్నది. అప్పటినుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు సంరక్షించి సంపూర్ణ అరణ్యంగా మలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 400 ఎకరాల చుట్టూ ఇనుప కంచె వేయించారు. హైకోర్టులో ఉన్న కేసుపై సమీక్షించి ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించారు. కేసీఆర్ దిగిపోయాక నాలుగు నెలలకు రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు రావటమే ఆలస్యం సీఎం రేవంత్‌రెడ్డి కండ్లు ఆ భూముల మీద పడ్డాయి. మొదట ఆ భూములను కొల్లేటరల్ సెక్యూరిటీగా పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్నారు. తాజాగా ఆ భూమిలో చెట్లు నరికివేసి, వన్యప్రాణులను చంపి మొత్తంగా ప్లాట్లు చేసి అమ్మటానికి సాహసం చేసింది సర్కార్. మాస్టర్ ప్లాన్ తయారు చేసి వేలంగా సహకారం అందించేందుకు ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కన్సల్టెంట్ ఎంపిక కోసం రిక్వెస్ట్ ప్రపోజల్ జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడన్నీ ఆగిపోయాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఆక్రమించే దుర్మార్గమైన ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతిఘటించిన విద్యార్థులపై లాఠీల కాఠిన్యం, అక్రమ కేసులు, అరెస్టులు క్రూరమైనవే… అయినా రాష్ట్రంలో ప్రజాస్వామిక స్ఫూర్తి మరింత వేగవంతం కావటానికి, విస్తరించడానికి హెచ్‌సీయూ విద్యార్థుల ఉద్యమం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆరు గ్యారంటీలని చెప్పి కాళేశ్వరం, శ్రీరామ్‌సాగర్, సీతారామసాగర్, పాలమూరు, భీమా, నెట్టెంపాడు ఆరు ప్రాజెక్టులను ఎండబెట్టింది. మార్పునకు ఓటేసిన ఫలితం.. తెలంగాణ సకలజనులను కన్నీళ్లు పెట్టిస్తున్నది. గురుకుల, ఆశ్రమ పాఠశాలలపై కక్షగట్టింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. 15 నెలల పాలనతో రోజుకు ఇద్దరు చొప్పున మట్టిపూలు అర్ధాంతరంగా రాలిపోతున్నయి.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే అక్కసునే ముందేసుకొని చేస్తున్న పరిపాలనకు తెలంగాణ పల్లెలు గోడు గోడున ఏడుస్తున్నయి. ఈ ఏడుపు ఆ దేవునికి ఎన్నడు సుతి ముడుతుందో అని రైతాంగ, విద్యార్థి, మహిళాలోకం ఎదురుచూస్తున్నది. నెమలీకలు కలిసి బంధించిన మదపుటేనుగు ఉదంతంతో ఉద్యమ సమాజం దృష్టిలో, ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం పలుచబడ్డది. ఆ పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ మైలేజీని పన్నెండు ఆమడల దూరం వెనక్కినెట్టింది. ఇదే మోకా మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ‘ఔర్ ఏక్ ధక్కా పక్కా’ అనిపిస్తున్నది.