తెలంగాణ వెనుకబడిన ప్రాంతమనేవారు ఉమ్మడి ఏపీ రోజుల్లో. అయితే, తెలంగాణ వెనుకబడిన కాదు వెనుకవేయబడిన ప్రాంతమనేది తెలిసిందే. తెలంగాణ మొదటినుంచీ సంపన్న రాష్ట్రమనేది చరిత్రలో నమోదైన నిఖార్సయిన నిజం. కాకపోతే ఇక్కడి ఆమ్దానీ అక్కడ ఖర్చుచేయడం వల్ల తెలంగాణ నీరసించిపోయేది. నిధులు, నీళ్లు, నియామకాల్లో అన్యాయం జరుగుతున్నదని బరిగీసి కొట్లాడింది అందుకే. స్వరాష్ట్రం తెచ్చుకొని దేశం మెచ్చేటట్టు అభివృద్ధి పరచుకున్నదీ మనకు ఆ శక్తి ఉండటం వల్లనే. కేసీఆర్ దీక్షాదక్షతల ఫలితంగా మన జీఎస్డీపీ 2014-2024 మధ్య దశాబ్దకాలంలో 196 శాతం పెరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ జీడీపీ పెరుగుదల 134 శాతం ఉండటం గమనార్హం. ఈ దశాబ్దకాలంలోనే తలసరి ఆదాయం 2014-15లో రూ.1,24.104 నుంచి 2023-24లో రూ.3,47,299కి అంటే రెట్టింపు పైగా పెరిగింది. జాతీయ సగటు రూ.2.2 లక్షలతో పోలిస్తే ఇది ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
వ్యూహాత్మక పెట్టుబడులు, సంస్కరణల ఫలితంగా తెలంగాణ అంగ లు వేసిందని ఆర్థికవేత్తలు కొనియాడారు. పుస్తకాలూ రాశారు. తెలంగాణ ప్రగతి దేశానికే ఓ మోడల్‌గా నిలిచింది. సంపన్న తెలంగాణను మరింత సుసంపన్నంగా నిలబెట్టింది కేసీఆర్. అవార్డులు, రివార్డులు సాధించి పెట్టింది కేసీఆర్. పైగా ఇవన్నీ సాధించింది కేంద్రం సరైన సహకారం అందించని పరిస్థితుల్లో అనేది మరువరాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయలేదని కాదు, చేసింది. చేసిన అప్పులను సద్వినియోగం చేసింది. ప్రాజెక్టులు కట్టింది, వ్యవసాయాన్ని విస్తరించింది. గ్రామీణ, ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చింది. పరిశ్రమలను ప్రోత్సహించింది. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధిరేటు (17.93 శాతం) జాతీయ వృద్ధిరేటు (8.09 శాతం) కంటే రెట్టింపు స్థాయిలో ఉండటం బీఆర్ఎస్ ఆర్థిక విధానాలకు ఓ కితాబుగా చెప్పాలి. సంపద పెంచడం, పది మందికీ పంచ డం అనే సూత్రాన్ని నమ్మిన కేసీఆర్ తెలంగాణకు మహోజ్వల శకాన్ని సాధించిపెట్టారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇందుకు కేంద్రం ఇష్టమున్నా, లేకున్నా ఇవ్వక తప్పిన అవార్డులే సాక్ష్యం.
కానీ, ఇప్పుడంతా తారుమారైంది. తిట్లు, ఒట్లతో తికమక పెట్టి, హామీలు, గ్యారెంటీలంటూ గారడీ చేసి అధికారంలోకి వచ్చినవాళ్లు తమ చేతకానితనంతో రాష్ర్టాన్ని ఏడాదిన్నర కాలంలో నానాటికీ తీసికట్టు చేయించారు. ఖాళీ ఖజానా చేతికిచ్చి పోయారన్నారు. బడ్జెట్‌కు ముందు ప్రచురించే ఆర్థిక పత్రంలో వారే అంతా సజావుగా ఉందని రాసుకున్నారు. బీఆర్ఎస్ అప్పులు చేసిందని, అలా చేయడం తప్పన్నట్టుగా మాట్లాడారు. తర్వాత వాళ్లే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు తెచ్చా రు. వేరేవాళ్లు చేస్తే తప్పు, వాళ్లు చేస్తే ఒప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆర్థికాన్ని నడపలేని అసమర్థ పాలకుడు ఇప్పుడు బజారున పడి బీద అరుపులతో ఊదరగొడుతున్నాడు. సంపద పెంచే కిటుకు తెలియక అప్పులు పుట్టడం లేదని శోకాలు పెడుతున్నాడు. ఏం చెయ్యాలో మీరే చెప్పండని చేతులు ఎత్తేస్తున్నాడు. కాంగ్రెస్ కుటుంబపాలన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుంభకోణాలకు తెరతీస్తున్నాడు. మరోవైపు దివాలా కోరు మాటలతో రాష్ట్రం పరువు తీస్తున్నాడు. అడ్డగోలు హమీలు ఇచ్చినప్పుడు తెలియదా? పేరుపేరునా దేవుళ్ల మీద ఒట్లు వేసినప్పుడు తెలియదా? ఈ వాలకం చూస్తుంటే ఎగవేతలకు, కోతలకు తెగబడేందుకు సిద్ధమవుతున్నదా సర్కారు? అనే సందేహాలు కలుగకమానవు.