రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్‌కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కేసీఆర్ సర్కార్ ఆదాయ పరిమితిని, భూపరిమితిని పెంచిందని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం రేవంత్ సర్కార్ ఆ మార్గాన్నే అనుసరించాలని సూచించారు. ఇటీవల కులగణన సర్వే సందర్భంగా సర్కార్ చెప్పిందొకటి, రేషన్‌కార్డుల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గం మరొకటని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల జారీ విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా..
రేషన్‌కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గం. అభయహస్తం మ్యానిఫెస్టోలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించి, అమలు చేస్తుండటం ముమ్మాటికీ మోసం చేయడమే. క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం చేయకుండా, అర్హులైన వారికి ఎగనామం పెట్టే విధంగా ఉన్న నిబంధనలను, మీ వైఖరిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. యావత్ తెలంగాణ ప్రజల తరఫున నిలదీస్తున్నాం.
తెలంగాణ పౌరసరఫరాల శాఖ 2025 జనవరి 12న మెమో నంబర్ ఐటీ -2/2196/2025తో ఇచ్చిన ఉత్తర్వుల్లోని నిబంధనలను లక్షలాది మంది నిరుపేదలకు రేషన్‌కార్డు దూరం చేసే విధంగా రూపొందించడం శోచనీయం. 2025, జనవరి 11న పౌరసరఫరాల శాఖ జారీచేసిన మెమో (మెమో నెంబర్1784/ సీఎస్.ఐ-సీసీఎస్ /2024) ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రామాణికంగా తీసుంటున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు, గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన మెమో నెంబర్ 653/మండల్స్/ ఏ1/2014, పౌరసరఫరాల శాఖ మెమో నెంబర్ 900/ సీఎస్.ఐ-సీసీఎస్ /2024 నిబంధనలను పాటిస్తామని తెలిపారు. పదేండ్ల కిందటి నిబంధనలను యథాతథంగా ఇప్పుడు అమలు చేయడమంటే కోతలు విధించి, లక్షల మంది అర్హులను దూరం చేయడమే. లబ్ధిదారులకు మొండిచెయ్యి చూపడమే.
2014 అక్టోబర్ 10 నాటికి అమల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిబంధనలను యథాతథంగా పాటిస్తే లక్షల మంది నిరుపేదలు రేషన్‌కార్డులు పొందేందుకు అనర్హులవుతారని గుర్తించి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. అందులో భాగంగా ఆదాయం, భూపరిమితిలో సడలింపులు చేస్తూ 2014 నవంబర్ 28న ఉత్తర్వులు జారీచేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు ఉంటే, ఆ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.50 లక్షలకు పెంచింది. అదే విధంగా మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట 5 ఎకరాలుగా ఉన్న భూ పరిమితిని.. మాగాణి మూడున్నర ఎకరాలకు, మెట్ట ఏడున్నర ఎకరాలకు పెంచింది. తద్వారా లక్షల మంది నిరుపేదలకు రేషన్‌కార్డు పొందే అర్హతను కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది.
ఇప్పుడు మీ ప్రభుత్వం, పది సంవత్సరాల కిందటి నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, ఇప్పటికీ అవే ఆదాయ, భూపరిమితుల నిబంధనలను కొనసాగించడం వల్ల లక్షల కుటుంబాలు రేషన్‌కార్డు పొందే అర్హతను కోల్పోతున్నాయి. ఉదాహరణకు 2014లో అంగన్వాడీల వేతనం రూ.4,200 ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం మూడు దఫాలుగా పెంచి వారి వేతనాన్ని రూ.13,650కి చేర్చింది. 2014లో వీరి వార్షికాదాయం రూ.50,400 ఉండగా, పెరిగిన వేతనం ప్రకారం ఇప్పుడు వారి వార్షికాదాయం రూ.1,63,800. రేషన్‌కార్డుల జారీలో 2014 నిబంధనలను అనుసరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతీ అంగన్వాడీ కార్యకర్తకు రేషన్‌కార్డు రానట్టే. అదేవిధంగా ఆశావర్కర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిరు ఉద్యోగులకు మీ ప్రభుత్వ అశాస్త్రీయ నిబంధనల వల్ల రేషన్‌కార్డులు రాని దుస్థితి నెలకొంది.
గడిచిన పదేండ్లలో ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరానికి సగటున 5.42 శాతం ఉందని, పది సంవత్సరాలకు గాను సుమారు 69.60 శాతం ద్రవ్యోల్బణం రికార్డు అయినట్టుగా ఓఈసీడీ అండ్ వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేశాయి. దీని ప్రకారం.. 1.7 రెట్లు ధరలు పెరుగుదల నమోదైనట్టుగా అర్థం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల ఆదాయ పరిమితిని, ద్రవ్యోల్బణం ప్రకారం గణిస్తే రూ.2.55 లక్షలుగా తేలుతుంది. అంటే నాటి 1.50 లక్షలు.. నేటి రూ.2.55 లక్షలతో సమానం. అదే విధంగా పట్టణ ప్రాంత రూ.2.50 లక్షల ఆదాయ పరిమితిని ద్రవ్యోల్బణం ప్రకారం గణిస్తే రూ.3.40 లక్షలు అవుతుంది. అంటే నాటి రూ.2.50 లక్షల ఆదాయం నేటి రూ.3.40 లక్షలకు సమానం. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అనుసరించి రేషన్‌కార్డుల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.2.55 లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో రూ.3.40 లక్షలుగా సవరించాలని, తద్వారా పేదలందరికీ లబ్ధి చేకూరే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
2025 జనవరి 12న పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి కులగణన సర్వే ఆధారంగా రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితా తయారవుతాయని పేరొనడం పేద ప్రజల పాలిట శాపంగా మారింది. కులగణన సర్వే తప్పనిసరి కాదని, స్వచ్ఛందమని పేరొనడం వల్ల, ఎంతోమంది ఈ సర్వేలో పాల్గొనలేదు. పాల్గొన్నవారిలో చాలా మంది వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు పంచుకోవడానికి ఇష్టపడలేదు. మంత్రులు సైతం కులగణన సర్వేతో ప్రభుత్వ పథకాలకు ఎలాంటి లంకె ఉండదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కులగణన సర్వే ఆధారంగా రేషన్‌కార్డులు ఇస్తామని ప్రకటించడం యావత్ తెలంగాణ ప్రజలను వంచించడమే.
ప్రజా పాలన పేరిట 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 1 వరకు 1.25 కోట్ల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఇందులో సుమారు 10 లక్షల మందిపైగా తమకు రేషన్‌కార్డులు కావాలని కోరినట్టు సమాచారం. కులగణన సర్వే ఆధారంగా కాకుండా ఈ దరఖాస్తుల ఆధారంగా రేషన్‌కార్డులు మంజూరు చేసి, అత్యధిక పేద వర్గాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో ఒక రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని గోబెల్స్ ప్రచారం చేశారు.
అధికారంలోకి వచ్చాక కూడా వాస్తవాలను తొకిపెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మరోసారి ఈ లేఖ ద్వారా స్పష్టత ఇస్తున్నాం. 2016-17 నుంచి 2022-23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 కొత్త రేషన్‌కార్డులను అందజేసింది. ప్రభుత్వంలో ఇప్పుడు మీరే ఉన్నరు. ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ నుంచి తెప్పించుకొని చూసుకోవచ్చు. ఇకనైనా ఆ అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని, నిరుపేదలకు ఆసరా అయ్యే రేషన్‌కార్డుల్లో కోతలు విధించకుండా అర్హులందరికీ అందించాలని కోరుతున్నాం. అభయహస్తం మ్యానిఫెస్టోలో రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు.
కానీ, అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా ఈ విషయమై అతీగతీ లేదు. మ్యానిఫెస్టోలో మేము పెట్టకపోయినప్పటికీ రేషన్‌కార్డు ద్వారా కుటుంబంలోని ఒకో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని 4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచాం. కుటుంబానికి 20 కిలోలే ఉన్న పరిమితిని ఎత్తివేసి, ఎంతమంది ఉంటే అంత మందికి ఒకొకరికి 6 కిలోల చొప్పున ఇచ్చినం. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే (జనవరి 1, 2015వ తేదీ నుంచే) మధ్యాహ్న భోజనం, గురుకులాలు, హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసినం.
ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం, పాలనను గాలికొదిలేయడం మానేసి అభయహస్తం మ్యానిఫెస్టోలో పేరొన్నట్టుగా రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ, అర్హులైన వారందరికీ బీపీఎల్ రేషన్‌కార్డులు, కొత్త రేషన్‌కార్డులు అందించాలి. అన్ని రేషన్ షాపులను మినీ సూపర్ మారెట్లుగా అభివృద్ధి చేసి, రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నా.
-తన్నీరు హరీశ్‌రావు