గురుకులాలు.. ఈ మాట వినగానే మనకు మొదట గుర్తుకువచ్చే పేరు తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి 1970లో నల్లగొండ జిల్లాలోని సర్వేల్లో మొదటి గురుకుల పాఠశాలను ఆయన స్థాపించారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాలవారీగా మరో రెండు గురుకులాలు ఏర్పాటయ్యాయి. వీటిలో చదివిన చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత పదవులను అలంకరించారు.
గురుకులాలకున్న ప్రజాదరణ, వాటిలో ఉండే విద్యా ప్రమాణాలను గుర్తించిన ఎన్టీఆర్ సర్కారు ప్రతి జిల్లాలో బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున గురుకుల పాఠశాలలు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఎస్సీ విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన విద్యార్థులకు ఎస్టీ గురుకులాలు మంజూరయ్యాయి. 1995 వరకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో గురుకులాలదే హవా. ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు కనీసం ఒక గురుకుల పాఠశాల అందుబాటులో ఉండేది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా వాటిలో అడ్మిషన్లు ఇచ్చేవారు. విద్య ప్రైవేటీకరణ జరిగి కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత మార్కులు, ర్యాంకులు హైజాక్ అయ్యాయి. క్రమంగా గురుకులాలు ప్రభ కోల్పోయాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకువచ్చారు. ఒకేసారి వందకు పైగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, 51 గిరిజన గురుకులాలను నెలకొల్పడమే కాకుండా, బీసీలు, మైనారిటీల కోసం కొత్తగా సొసైటీలు స్థాపించి, వాటి కింద 250 చొప్పున గురుకులాలను ఏర్పాటు చేయడంతో గురుకుల విద్య కొత్త శకానికి నాంది పలికారు. ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు గురుకులాలను నెలకొల్పడంతో రాష్ట్రంలో గురుకులాల సంఖ్య 1022కు చేరుకున్నది. వాటిలో సుమారు 5 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
2016 నుంచి కొత్తగా స్థాపించిన గురుకులాల్లో కొన్నింటికి కేసీఆర్ సర్కారు పక్కా భవనాలను కూడా నిర్మించింది. అన్నింటిలో ఐదు నుంచి ఇంటర్ వరకు తరగతులు నడుస్తుండగా, 2017లో గురుకుల సొసైటీల కింద డిగ్రీ కళాశాలలను కూడా ఏర్పాటు చేసి వినూత్నమైన కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఇంకా సైనిక అధికారులను తయారు చేయడానికి సైనిక్ స్కూళ్లు, క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ స్కూళ్లను కూడా నెలకొల్పారు. సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని అగసార నందిని 2023 ఆసియా క్రీడల్లో దేశానికి కాంస్య పతకం సాధించి ఒక దిక్సూచిగా, ఆశాకిరణంగా నిలిచింది.
గత 18 నెలలుగా గురుకులాలు మరో రకంగా వార్తల్లోకి ఎక్కడం బాధాకరం. ఫుడ్ పాయిజన్, ఇతర కారణాల వల్ల ఇప్పటికే 93 మంది విద్యార్థులు మరణించడం శోచనీయం. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. రకరకాల సమస్యల పరిష్కారానికి విద్యార్థులు రోడ్డునపడటం నిత్యం చూస్తున్నాం. ముఖ్యంగా పురుగుల బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు, పాడైపోయిన కూరగాయలు సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. బిల్లులు విడుదల కాకపోవడంతో టెండరుదారులు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారు. బకాయిలను చెల్లించడం లేదని నిర్మాణంలో ఉన్న భవనాలను కాంట్రాక్టర్లు పూర్తిచేయడం లేదు. అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలో విద్యార్థులు దిక్కుతోచక, గత్యంతరం లేక అన్నీ భరిస్తున్నారు.
గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అంతంతమాత్రంగానే అందుతున్నదనేది విద్యార్థుల మరో ఆరోపణ. పాములు తదితర విషపురుగుల మధ్యన చదువుపై ఏకాగ్రత చూపడం విద్యార్థులకు సవాల్‌గా మారింది. విద్యార్థులు ఇలాంటి సమస్యలతో సహజీవనం చేస్తుండగా, ఉపాధ్యాయులు అసంతృప్తి నీడన బోధిస్తున్నారు. ఇక ప్రధానాచార్యుల సమస్యలు చెబితే భారతమంత, రాస్తే రామాయణమంత. పాఠశాలలు తెరిచి నెల రోజులు దాటినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
క్రమంగా గురుకులాలను నిర్వీర్యం చేస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరిట ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణాలకు పూనుకోవడమే అందుకు కారణం. ఇది పూర్తిగా గురుకుల పితామహుడు పీవీ పేరును మరుగున పడవేస్తూ, గురుకులాల ప్రతిష్టను పునరుద్ధరించి, లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించిన కేసీఆర్ పేరుప్రతిష్టలను మసకబార్చే దుష్ట ప్రయత్నమే. పరిస్థితి ఇలాగే కొనసాగితే గురుకులాలు కాలగర్భంలో కలిసిపోతాయి. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?’.
– శ్రీశ్రీ కుమార్