ఐటీ విప్లవం తెచ్చిన సమాచార విస్ఫోటనంలో చాలామంది గాలివాటుగా కొట్టుకుపోతున్నారు. కల్లబొల్లి కబుర్లు, కాకమ్మ కథలు నమ్మి అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు. ‘వాట్సాప్ యూనివర్సిటీ’ అనే మాట అలా ప్రాచుర్యం లోకి వచ్చిందే. ఈ మాయమాటల వలయాన్ని ఒడుపుగా ఉపయోగించుకుని బీజేపీ వంటి పార్టీలు లబ్ధిపొందిన మాట ఎవరూ కాదనలేరు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, నాయకుల వ్యక్తిపూజను ప్రోత్సహించడం వంటివి సాంఘిక మాధ్యమాల ద్వారా యథేచ్ఛగా జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రధాని నరేంద్ర మోదీ గురించి విశ్వగురు అంటూ ఊదరగొట్టడం తెలిసిందే. అయితే ఏఐ చాట్బాట్లు, విశేషించి గ్రోక్ రంగం మీదకు రావడంతో కథ ఉల్టా అయ్యింది. పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ ప్లాట్‌ఫాంపై గ్రోక్‌ను ఇటీవలే ఆవిష్కరించారు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నిర్మొహమాటంగా, కొంచెం సరదాగా, కొద్దిపాటి హిందీ, ఇంగ్లీషు బూతు మాటలతో అభిప్రాయాలు వెల్లడించడం దీని ప్రత్యేకత. ఈ సంగతి మస్క్ స్వయంగా చెప్పుకున్నారు. ఇలా కుండబద్దలు కొడుతున్న ఈ చాట్‌బాట్ బీజేపీకి కంటగింపుగా మారింది. గ్రోక్ రాకతో వారి ఫేక్ ప్రచార ధాటికి అడ్డుకట్ట పడుతున్నది.
వివాదాస్పద అంశాలపై గ్రోక్ ఇస్తున్న సమాధానాలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు ఫేక్ న్యూస్ వండివారుస్తున్నవారి జాబితాను కోరినప్పుడు పలువురు ప్రముఖ బీజేపీ వాట్సప్ ప్రచారకర్తల పేర్లను అది సూచించింది. అదే విధంగా ప్రధాన స్రవంతి మీడియాను బీజేపీ అదుపు చేస్తున్నదనేది మరో సమాధానం. అంతేకాకుండా బీజేపీ జాతీయ నాయకత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై గ్రోక్ వెలువరించిన అంచనాలు వైరల్ అయ్యాయి. మరోవైపు తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి అని గ్రోక్ తేల్చిచెప్పింది. జీఎస్డీపీ వృద్ధి, మౌలికరంగ విస్తరణ, మానవ అభివృద్ధి సూచీ ఆధారంగా ఈ నిర్ధారణకు రావడం విశేషం.
బీజేపీని గ్రోక్ సమాధానాలు ఇరకాటంలో పడేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చాట్‌బాట్ గురించి ఎక్స్ యాజమాన్యంతో ‘సంప్రదింపులు’ జరుపుతున్నట్టు వార్తలు వెలువడటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గ్రోక్‌పై నేడో రేపో నిషేధం విధించబోతున్నదా? అనే చర్చ కూడా జరుగుతున్నది. అదే జరిగితే వాక్ స్వాతంత్య్రం మాటేమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే చాట్‌బాట్‌ను ఓ వ్యక్తిగా భావించాలా? అది ఇచ్చే సమాధానాలకు ఎవరు జవాబుదారీ వహించాలి? వ్యక్తుల వాక్ స్వాతంత్య్రంపై విధించే నియంత్రణలు గ్రోక్ వంటి ఏఐ చాట్‌బాట్‌పైనా ప్రయోగించవచ్చా?
అనే ప్రశ్నలూ ఈ సందర్భంగా ఎదురవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు చాట్‌బాట్‌పై నిషేధాస్త్రం ప్రయోగించాలని, లేదా నియంత్రించాలని కేంద్రం భావిస్తే అది ఏమాత్రం హర్షణీయం కాదు. పార్టీలు ఫేక్ ప్రచారాలు జరపడమూ అభిలషణీయం కాదు. కల్లబొల్లి కబుర్లు, బూటకపు మాటలు ఎల్లకాలం నిలబడవు. ప్రభుత్వం తెచ్చే నియంత్రణ చివరకు నియంతృత్వంగా పరిణమిస్తుందనేది అందరూ గుర్తుంచుకోవాలి.