Congress Govt | పేదల భూములను కాపాడటం కోసం మునుపెన్నడూ లేనివిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూ ప్రక్షాళన చేసింది. అందుకోసం ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకువచ్చింది. కానీ, ధరణిలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేసి ‘భూ భారతి’ పేరిట సరికొత్త పోర్టల్‌ను తీసుకొస్తున్నామని కాంగ్రెస్ పాలకులు నింగికి నిచ్చెనలు వేసే మాటలు చెప్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్తున్నట్టు అన్ని భూ సమస్యలకు పరిష్కారం ఉండే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తే మరి ‘ఊరికో అధికారి మళ్లెందుకు?’ అన్న ప్రశ్న సామాన్య ప్రజల్లో తలెత్తుతున్నది.
ఊరికో అధికారి వల్ల గ్రామాల్లో, మండల కేంద్రాల్లో గతంలో పేద రైతులు తిప్పలు పడేవారు. తమ భూములను తమ పేరు మీదికి మార్చుకోవాలన్నా, వారసత్వ బదిలీ జరగాలన్నా, భూ రికార్డులో తప్పులను సరిచేయాలన్నా గ్రామ పరిధిలో ఉండే రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. అవసరమైతే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ముడుపులు కూడా ముట్టజెప్పాల్సి వచ్చేది. అట్లయితేనే పనులు పూర్తయ్యే పరిస్థితి నాడు ఉండేది. అందుకే, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేసి, సదరు సిబ్బందిని ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసింది. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన చర్యల కారణంగా భూ సమస్యల పరిష్కారం కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. తద్వారా ఎలాంటి పైరవీలు లేకుండానే మండల కార్యాలయాల్లో సాఫ్‌సీదా పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కానీ, మళ్లీ ఇప్పుడు నాటి పాత రోజులను తలపించేలా అధికార కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతున్నది. ఉన్నపళంగా రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారిని మళ్లీ నియమిస్తామని, వారి ద్వారా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా చేస్తామని చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూ సమస్యల పరిష్కారం దేవుడెరుగు.. మళ్లీ పైరవీల కాలం వస్తే రైతన్నల పరిస్థితి ఏమిటి? గ్రామస్థాయిలో ప్రతేక అధికారులు లేకపోయినా భూముల పట్టాలు, భూ సంబంధిత అంశాలు, రైతుల కార్యక్రమాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. మరి ఇప్పడు అధికార పార్టీ గ్రామానికో అధికారిని నియమించి ఎవరికి లబ్ధి చేకూర్చాలని ఆశిస్తున్నది? ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయకుండా ఇలాంటి నిరూపయోగ పనులు చేయడం సబబు కాదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక నిర్ణయమే
– ధని ముదిగొండ