e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News మద్దతు ధరకు కొత్త సూత్రం

మద్దతు ధరకు కొత్త సూత్రం

సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్‌ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి.

సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో, తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల సంఖ్య ఏటా పెరిగిపోతున్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన ఒక క్రూర పరిహాసంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే, 23 రకాల పంట ఉత్పత్తులకు (ఏడు రకాల ధాన్యాలు, ఐదు రకాల పప్పులు, ఏడు రకాల నూనెగింజలు, నాలుగు వాణిజ్య పంటలు) కనీస మద్దతు ధర కల్పించే ప్రతిపాదనకు చట్టపరంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

రైతులకు ముఖ్యంగా చిన్నస్థాయి రైతులకు కనీస ఆదాయాన్ని గ్యారెంటీ చేయగలిగితే అది పరిశ్రమలకు అవసరమైన డిమాండ్‌ను పెంచి ఆర్థికరంగానికి గొప్ప తోడ్పాటు అందిస్తుంది. ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు ఇది చాలా మేలు చేస్తుంది. అంటే ఎమ్మెస్పీతో రైతులేకాదు వ్యవసాయేతర రంగాల్లో ఉన్న ప్రజలు కూడా లాభపడుతారు. కాబట్టి, ఎమ్మెస్పీకి చట్టపరంగా రక్షణ కల్పించే అంశం చర్చకు వచ్చినప్పుడు వీటన్నింటినీ పరిశీలించాలి. అయితే, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అమలయ్యే జాతీయ ఆహార భద్రత పథకానికి (ఎన్‌ఎఫ్‌ఎస్పీ), ఎమ్మెస్పీకి కొందరు లంకె పెట్టి.. ఒకటి ఉంటే మరొకటి సాధ్యం కాదని వాదిస్తారు. దీనిని పరిశీలిద్దాం. నిత్యావసరాలను నిల్వ చేయటమేగాక, వాటి ధరలను స్థిరీకరించటానికి 1955లో ఎన్‌ఎఫ్‌ఎస్పీకి రూపకల్పన చేశారు. ప్రస్తుతం దీని అమలుకు కేంద్రప్రభుత్వం ఏటా సగటున రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నది. విషయం ఏమిటంటే.. దీనికి మరికొంత మొత్తం కలిపి.. రైతులకు ఎమ్మెస్పీని కూడా అందజేయవచ్చు. ఆ విధంగా, ఓవైపు రైతులకు ఆదాయ భద్రత కల్పించటమేగాక మరోవైపు నిత్యావసరాల ధరలను స్థిరీకరించవచ్చు. ఇది ఎలా చేయవచ్చో చూద్దాం.
23 రకాల పంటల్లో ప్రతీ పంటకు గరిష్ఠ-కనిష్ఠ ధరలను నిర్ణయించాలి. పంట బాగా పండే సీజన్‌లో కనిష్ఠ ధర, తక్కువ పండే సీజన్‌లో గరిష్ఠ ధర పెట్టవచ్చు. దీనివల్ల మార్కెట్‌లో సంబంధిత పంట ధరల్లో హెచ్చుతగ్గులను నియంత్రించటానికి వీలవుతుంది. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో పండే తృణధాన్యాల వంటి వాటికి ఎక్కువ ధరలను నిర్ణయించవచ్చు.

ఎమ్మెస్పీకి స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకుంటే ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.17 లక్షల కోట్లు వ్యయం అవుతుంది. అయితే, ఇది వాస్తవ అంచనాకన్నా ఎక్కువేనని చెప్పవచ్చు. ఎలాగంటే.. 1. పంట దిగుబడిలో రైతులు తమ సొంత వినియోగం కోసం కొంత పక్కన పెట్టుకుంటారు. దీనిని మార్కెట్‌కు తరలించరు. వాటికి ఎమ్మెస్పీ అనే ప్రస్తావనే రాదు. 2. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జరిపే అమ్మకాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఎమ్మెస్పీ వ్యయం నుంచి తీసివేయాలి. 3. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ధరల స్థిరీకరణ జరుగుతుంది. దీనివల్ల కలిగిన ఆర్థిక ప్రయోజనాన్ని కూడా ఎమ్మెస్పీ వ్యయం నుంచి తగ్గించాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఎమ్మెస్పీ నికర వ్యయం రూ.5-7 లక్షల కోట్లు దాటదు. దేశ జనాభాలో గరిష్ఠంగా ఐదు శాతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ తదితర ఆర్థిక ప్రోత్సాహకాలతో (దాదాపు 5 లక్షల కోట్లు) దీనిని ఒకసారి పోల్చి చూడండి. కొద్దిమంది బడా వ్యాపారులకు ఇచ్చే పన్ను రాయితీలు మొదలైనవాటితో (రూ.4 లక్షల కోట్లు) పోల్చి చూడండి. కేవలం 28 మంది బ్యాంకుల నుంచి రుణం తీసుకొని కట్టకుండా ఎగవేసిన రూ.10 లక్షల కోట్లతో ఈ మొత్తాన్ని పోల్చి చూడండి (ఈ 28 మందిలో విజయ్‌మాల్యా ఒక్కడు తప్ప మిగిలినవారందరూ గుజరాత్‌కు చెందినవారే). ఈ నిజాల వెలుగులో ఇప్పుడు చెప్పండి.. దేశ జనాభాలో సగం ఉన్న రైతుల కోసం రూ.5-7 లక్షల కోట్లు ఖర్చు చేయటం అసాధ్యమైన పనా? రైతులకు రాజకీయంగా గట్టి గొంతు లేకపోవటం వల్లనేనా వారిపై ఇంత నిర్లక్ష్యం?

సానుకూల పరిస్థితులు లేనప్పటికీ విపరీతమైన నీటి వినియోగం ఉండే వాణిజ్య పంటలు వేయటం, నీటిఎద్దడిని ఎదుర్కొనే పౌష్టికాహార పంటల ఉత్పత్తి తగ్గటం, వాతావరణ సంక్షోభం తోడవటం- వీటన్నింటి వల్ల దేశంలో ఆహారభద్రత ప్రశ్నార్థకమవుతున్నది. దీనిని మార్చే చర్యలు చేపట్టాలి.

రైతులను ముఖ్యంగా చిన్నస్థాయి రైతులను బాగా ఇబ్బందికి గురి చేసే మరో అంశం అప్పులు. ప్రైవేటు వడ్డీవ్యాపారుల మీద ఆధారపడటం రైతులను రుణవలయం నుంచి బయటపడలేని పరిస్థితి కల్పిస్తున్నది. దీనికి పరిష్కారంగా సాగులో ఉండే ఒక్కో ఎకరాకు నిర్ణీతమొత్తం రుణం ఇచ్చేలా బ్యాంకులను అంగీకరింపజేయాలి. ఎమ్మెస్పీ కింద విక్రయించే ధాన్యం మొత్తానికి ఒక సర్టిఫికెట్‌ జారీ చేసి, దానిని బ్యాంకులు గ్యారెంటీగా తీసుకొని రుణం ఇచ్చే పథకాలను తీసుకురావచ్చు. చివరగా.. ఈ మార్పులన్నింటినీ పంచాయతీలు, గ్రామసభల ద్వారానే అమలు జరిగేలా చూడాలి. వాటికి ఆర్థికాధికారంతోపాటు స్వయంప్రతిపత్తి ఉండాలి. పంచాయతీలు, మహాపంచాయతీలతో సంఘటితం కావటం వల్లనే సాగుచట్టాల రద్దు కోసం మహాద్భుతంగా పోరాడి తమ డిమాండ్‌ను సాధించుకోగలిగారు రైతులు. ఇప్పుడు ఆ పంచాయతీల ద్వారానే గ్రామీణ ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింపజేయాలి.

ప్రొఫెసర్‌ అమిత్‌ భండారి
(జేఎన్‌యూ ఢిల్లీ మాజీ అధ్యాపకుడు)

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement