కాంగ్రెస్, ప్రజాస్వామిక సంప్రదాయాలు గల పార్టీ అయినప్పుడు, ముఖ్యమంత్రికి వివేకం లేకున్నా తక్కినవారికైనా ఉండనక్కరలేదా? తక్కిన అందరికీ కాకపోయినా కొందరికైనా? కొందరు మంత్రులు, కొందరు పార్టీ నాయకులకు? వీరందరికి మించి ఢిల్లీ పెద్దలకు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు వల్ల ప్రభుత్వ పాలన భ్రష్ఠమవుతూ, కాంగ్రెస్ ప్రతిష్ఠ నానాటికి అడుగంటుతుండగా వీరంతా ఏమి చేస్తున్నట్టు? పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే, ఆ ముఖ్యమంత్రి అనే అతిథి పాత్రధారుని మాట ఎట్లున్నా చివరికి పార్టీతో పాటు తమ పడవ కూడా మునుగుతుందనే ప్రమాదాన్ని గ్రహించలేని వారా వీరంతా?
గత ఏడాదిన్నరగా రేవంత్‌రెడ్డి పరిపాలన, వ్యక్తిగత వ్యవహరణ ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ వాదులు, పార్టీ అధిష్ఠానం గమనిస్తున్న విషయమే. వారు గమనిస్తున్నారనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్నాయి కూడా. మంత్రులు ఆయనతో క్యాబినెట్లోనే విభేదించటం, బయట తమ వారి మధ్య విమర్శించటం, ఎమ్మెల్యేలు తలలు పట్టుకోవటం, కార్యకర్తలూ పార్టీ అభిమానులైతే నిట్టూర్పులూ, ప్రజల వద్ద తాము సైతం వాపోవటం వంటివి ఈ సరికి సాధారణ దృశ్యాలైపోయాయి. రేవంత్‌రెడ్డి వంటి స్వభావం గలవారు, అధికారాన్ని ఆశ్రయించి లాభపడటం తప్ప పార్టీతో ఎటువంటి అనుబంధం లేనివర్గాలు మాత్రం ఆయన కోసం గొంతులు చింపుకొని చిందులు వేయటం కనిపిస్తున్నది.
ఇక ఢిల్లీ నాయకత్వం విషయానికి వస్తే, పార్టీకి రేవంత్‌రెడ్డి ఒక గుదిబండగా మారారన్నది వారికి అర్థమైందని చెప్పేందుకు రెండే రెండు దృష్టాంతాలు మాత్రం చెప్తే సరిపోతుంది. ఒకటి, పార్టీకి మకుటం లేని మహారాజైన రాహుల్‌గాంధీ తనకు ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగినా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం. ఆ స్థితి, లేదా దుస్థితి కూడా అంతకుముందు కూడా ఉండగా, ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆయన కుటుంబంతో సహా ఆహ్వానించి, తెలంగాణ భవన్లో చెమటలు కక్కుతూ ఎదురుచూస్తుండిన ముఖ్యమంత్రికి ఆహ్వాన తిరస్కార సత్కారం చేయటం పుండు మీద కారం చల్లినట్టు చేసింది. ఆయనకు గల గౌరవం, స్థానం ఎటువంటివో ప్రజలకు సరేసరి కాగా, కాంగ్రెస్‌లో ఆబాలగోపాలానికి ఇన్నాళ్లలో మరెప్పుడూ లేనంతగా కొట్టవచ్చినట్టు అర్థమైంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలోనూ తన మాట చెల్లలేదు.
బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో లిస్టెడ్ కంపెనీల స్టాక్ సూచీల ఎగుడు దిగుడులు మనకు రోజువారీగా రిపోర్టు అయినట్టు, నాయకుల స్టాక్ సూచీలు తెలిసే పద్ధతి లేదుగానీ, ఉండి ఉంటే ఆ రోజున రేవంత్ రెడ్డి సూచీ ఎంత పతనమైందో తెలిసేది. పాశ్చాత్య దేశాలలో ‘ప్యూ’ (పీఈడబ్ల్యూ) వంటి ప్రజాభిప్రాయ సేకరణ సంస్థలు ప్రతి ముఖ్యమైన అంశంపై, పరిణామంపై ఎప్పటికప్పుడు సేకరణలు జరిపి ఫలితాలను ప్రకటిస్తుంటాయి. భారతదేశంలో రకరకాల సంస్థలు అనేకం ఉన్నాయి. ఎన్నికలతో సంబంధం గలవి కూడా ఉన్నాయి. కానీ, ఎందువల్లనో ‘ప్యూ’ తరహావి లేవు. ఉండినట్టయితే, రేవంత్ రెడ్డి స్టాక్ ఆ రోజున ఎంత పతనమైందో తెలిసేది. అయితే, రేవంత్ రెడ్డి స్వభావరీత్యా చాలా కక్ష మనిషి. కనుక, తనకు ఇంతగా పరాభవిస్తున్నందుకు రాహుల్‌గాంధీ పేరును ఏ ‘రెడ్‌బుక్’లోనో ఇప్పటికే రాసిపెట్టి ఉంటారు. భవిష్యత్తులో తాను బీజేపీలో గాని చేరితే అప్పుడు కక్ష తీర్చుకోవచ్చునని.
ఇదంతా అట్లుంచితే, పైన చెప్పుకొన్నట్టు రేవంత్ రెడ్డి వల్ల కలుగుతున్న నష్టాలు తెలిసినందువల్లనే ఆయనపై నిఘా కోసమో, నియంత్రణ కోసమో తెలియదు గాని, పార్టీ పర్యవేక్షకురాలిగా రాహుల్‌గాంధీ ఆ మధ్య మీనాక్షి నటరాజన్‌ను నియమించారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం ఒకటి కాగా, ఆమె నియామకం రెండవ సూచన అయింది. రేవంత్ రెడ్డి పట్ల మంత్రివర్గంలో, పార్టీలో ప్రతికూలత అప్పటికే పెరుగుతున్నందున మీనాక్షి రాకను అందరూ రహస్యంగా ఆహ్వానించారు.
కానీ, ఆమె ప్రభావం రేవంత్‌రెడ్డిపై ఏమీ ఉండటం లేదని త్వరలోనే తేలిపోయింది. మంచో చెడో గానీ ఆయన వ్యక్తిత్వం బలమైనదని అంగీకరించక తప్పదు. అసాంఘిక శక్తుల వ్యక్తిత్వాలు ఎప్పుడైనా బలమైనవే అయినట్టు, రేవంత్‌రెడ్డి వంటి నేపథ్యం గల రాజకీయ నాయకులలోనూ అటువంటి బలం కనిపిస్తుంటుంది. తమ వల్ల ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని విమర్శలు వచ్చినా, రేవంత్‌రెడ్డి వంటివారు తమను తాము మార్చుకోకపోవటం, లేదా మార్చుకోలేకపోవటం అటువంటి వ్యక్తిత్వాలకు గల బలంలోని బలహీనత.
ఇక్కడ అర్థం కావలసిన విషయాలు రెండున్నాయి. అటువంటి బలం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక పరిస్థితిలో అవసరమైంది. తెలంగాణలో పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాలేకపోయిన సమయంలో, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులలో ఒక దాదా వలె మాట్లాడి ప్రవర్తించి అధికారం ఆశ కల్పించగల వారు ఎవరూ కనిపించలేదు అధిష్ఠానానికి. హిమాచల్, కర్ణాటక తర్వాత ఇంకొక రాష్ట్రంలోనైనా అధికారం రాకపోతే పరువు నిలిచేటట్టు లేదు. అందుకోసం ‘ఎటువంటి’ వాడైనా సరేననుకున్నారు. అట్లా అనుకోవటానికి, రేవంత్ రెడ్డి తరహా ‘బలా’నికి సరిపోయింది. అందుకు అలవిగాని హామీలను హిమాచల్, కర్ణాటక తరహాలో తోడు చేసుకున్నారు. అంతవరకు అంతా బాగున్నది. లక్ష్యం నెరవేరింది.
ఆ తర్వాత రేవంత్‌రెడ్డి పరిపాలన, వ్యక్తిగత వ్యవహరణ సవ్యంగా ఉండినట్టయితే ఎవరికీ ఏ సమస్య ఉండకపోయేది. స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించి క్యాబినెట్ నియామకాలు గాని, పార్టీ పర్యవేక్షకుల నియామకం గాని, రాహుల్‌తో అపాయింట్మెంట్ గాని, మరొకటి గాని. కానీ, పైన చెప్పుకొన్నట్టు, రేవంత్ ‘బలం’లోని రెండవ కోణం ఆయన తన నాయకత్వ శక్తితో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముందుకురావటం మొదలైంది. అట్లా వచ్చి వచ్చి అందరికీ గుదిబండ కాసాగింది. రెండవ కోణం రుణాంశ అయినందున మొదటి కోణపు ధనాంశను నెగేట్ చేసి శూన్యస్థితికి నెట్టివేసింది.
ఆ విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు తిరిగేసరికి పరిపాలన, కాంగ్రెస్ పార్టీ, తన వ్యక్తిగత ప్రతిష్ఠ, ప్రజాభిప్రాయం, ఢిల్లీ నాయకత్వ అంచనాలు అన్నీ శూన్యంలో స్థిరపడిపోయాయి. ఒకవేళ ఆయన తన అనుభవ శూన్యత వల్ల కలుగుతున్న లోపాలను గ్రహించి క్రమంగా సరిదిద్దుకున్నట్టయితే ప్రస్తుత పరిస్థితి రాకపోయేది. కానీ ఆయన దిద్దుబాటుకు బదులు మరింత రెచ్చిపోయారు.
పైన చెప్పుకొన్న తరహాలో ఆయన వంటి వ్య క్తిత్వం గలవారు సర్వసాధారణంగా అనుభవాల ను బట్టి దిద్దుబాటు చేసుకునే బదులు మరింత రెచ్చిపోతుంటారు. తమ ‘బలా’నికి అదే నిదర్శనమని నమ్ముతారు. మానసికతలు, వ్యక్తిత్వాల రీ త్యా ఇటువంటి వారు ఒక తరగతి. వారు ఒక వయసు తర్వాత మారటం చాలా అరుదు. రేవం త్ ఇక మారడని కాంగ్రెస్ వారే అంటున్నారు.
అందువల్ల, నిర్ణయించుకోవలసింది వారి ఉనికికి బాధ్యులైనవారు. మరొక విధంగా చెప్పాలంటే వారిని భరించేవారు. ప్రజలను ఎక్కడ కదిలించినా ఒక్క రోజు కూడా భరించలేమని అంటున్నారు. ఇంకా మూడేండ్లు భరించాలా అని బాధపడుతున్నారు. నిర్ణయం అంతవరకు వారి చేతుల్లో లేదు. కానీ, పార్టీ చేతిలో ఉంది. ఉద్దేశం తనను తప్పించాలని కాదు. కానీ, సరిదిద్దాలని. ఆయన తనను తాను సరిదిద్దుకోనప్పుడు, కనీసం అటువంటి ఆలోచనైనా ఉన్నట్టు కనిపించనప్పుడు, ఆ బాధ్యతను పార్టీ తీసుకోక తప్పదు. పార్టీ అనే మాటలోకి మంత్రివర్గ సభ్యులు, పీసీసీ, సీనియర్ నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల నుంచి అంతిమంగా ఏఐసీసీ నాయకత్వం వరకు వస్తారు.
వివేకం రేవంత్‌రెడ్డికి లేకపోయినా, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తక్కినవారికైనా ఉండాలి. కానీ, కనిపిస్తున్నదేమంటే, పైన అన్నట్టు కొందరు రేవంత్‌రెడ్డి వల్ల, పార్టీ అధికారంలో ఉండటం వల్ల కలిగే రకరకాల ప్రయోజనాలు పొందటం కోసమని అసలేమీ మాట్లాడటం లేదు, లేదా తనకు మద్దతుగా గొంతులు చించుకొని చిందులు వేస్తున్నారు. కొందరు రేవంత్‌రెడ్డి ఎంత అప్రతిష్టపాలై తొందరగా పోతే తమకంత అవకాశాలు వస్తాయనుకుంటున్నారు. కొందరు జనాంతికంగా మాట్లాడుకోవడం తప్ప మౌనం వహిస్తున్నారు.
ఢిల్లీ నాయకులేమో ఈయన వల్ల కలిగే ప్రయోజనాల కారణంగా సగం సగం మాట్లాడటం, తమ నిరసనను సగం సగం చూపడం తప్ప, విషయం చేయి దాటకుండా ఉండేందుకు, చివరికి పుట్టి మునగకుండా జాగ్రత్త పడటానికి చేయవలసిందేమిటో చేయడం లేదు. సాధారణ ప్రజల్లో అనేకులు మాత్రం, రేవంత్‌రెడ్డి ఇట్లాగే ఉండాలని, మళ్లీ ఎన్నికల దాకా పాలించాలని, అట్లయితేనే తను, కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తు చిత్తుగా ఓడటం ఖాయమవుతుందని కోరుకుంటున్నారు.
మరొక స్థాయిలో ఆలోచిస్తే, 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో నాయకులను, ముఖ్యమంత్రులను, చివరికి ప్రధానమంత్రులను, ఏఐసీసీ అధ్యక్షులను కూడా విమర్శలతో, అవసరమైన చర్యలతో క్రమశిక్షణలో పెట్టిన గొప్ప సంప్రదాయం ఉంది. ఇందిరాగాంధీ కాలం నుంచి అది జాతీయ స్థాయిలో భంగపడింది. ఆ తర్వాత పార్టీ బలహీనపడి అధికారాన్ని కోల్పోతూ, చీలుతూ కొత్త దశ ఆరంభమైంది.
రాష్ర్టాల్లో పార్టీని గెలిపించగలవారి మాటకు దాదాపు ఎదురులేకుండా పోయింది. నిధుల సేకరణకు కూడా వారే ఆధారం కావడంతో వారు మరింత బలవంతులయ్యారు. ఇవే అనుపాతాల్లో కేంద్ర నాయకత్వాలు బలహీనపడసాగాయి. రేవంత్‌రెడ్డి వంటి వారిని అనీ అనలేని పరిస్థితి ఎదురుకావడం వెనుక ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. అవెట్లున్నా అంతిమ విశ్లేషణలో వివే కం లేని తనం వివేకం లేకపోవడమే. కాంగ్రెస్ స్లో మోషన్ ఆత్మహత్యకు అదీ ఒక కారణం.
– టంకశాల అశోక్