విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు శాంతి కరువైంది. శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వయసులో ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్‌కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాటి మహాధర్నా వేదికగా రేవంత్ ప్రభుత్వంపై ఉద్యమ నగారా మోగించనున్నారు. అప్పుడెప్పుడో సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఏలకు ఎగనామం పెట్టడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున పెన్షనర్లు ఉద్యమించారు. ప్రస్తుతం మళ్లీ అదే స్థాయిలో పెన్షనర్లు కదం తొక్కడం విశేషం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ సహా పెద్దా చిన్నా కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం పెన్షనర్లను ఆశల పల్లకిలో ఊరేగించారు. డీఏలను వెంట వెంటనే చెల్లిస్తామన్నారు. ఆరు నెలల్లోపు పేరివిజన్ చేస్తామన్నారు. హెల్త్ కార్డులపై ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో నగదు రహిత వైద్య సేవలు అందిస్తామన్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ (ఓపీఎస్) విధానం అమలు చేస్తామన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన సొమ్మును వెంటనే చెల్లిస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. రెండేండ్లు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. పెన్షనర్ల సంఘాల నేతలు చెప్పులరిగేటట్టుగా సచివాలయం చుట్టూ, మంత్రుల ఇండ్ల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయారు. రేవంత్ ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన సుమారు 9 వేల మంది ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన సొమ్ము సుమారు రూ.10 వేల కోట్లు ఉండగా ఇంతవరకు చిల్లి గవ్వ మంజూరు కాలేదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్ వంటివి అలా ఉంచితే కనీసం ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో జీతం నుంచి పొదుపు చేసుకున్న సొంత సొమ్ము జీపీఎఫ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లించకుండా మొండికేస్తున్నది. మొత్తంగా సుమారు 4 లక్షల మంది పెన్షనర్లు తమకు రావాల్సిన ఐదు డీఏల కోసం ఎదురుచూసి ఎదురుచూసి సహనం నశించి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు.
ముఖ్యమంత్రి రేవంత్ కానీ, ఆయన మంత్రివర్గం కానీ ఇంతవరకు పెన్షనర్ల సంఘాలతో విస్తృతంగా ఒక్క సమావేశం నిర్వహించలేదు. సమస్యలడిగి తెలుసుకోలేదు. ఉభయ తారకమైన పరిష్కారాన్ని కనుగొనలేదు. పెన్షనర్లతో అయ్యేదేంది పొయ్యేదేంది అన్నట్టు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. పెన్షనర్ల డిమాండ్లు ముందుకువచ్చినప్పుడల్లా ‘నన్ను కోసినా పైసలు లేవు. అప్పిచ్చేవాడు లేడు. ఏం చేస్తారు కోసుకు తింటారా’ అని ముఖ్యమంత్రి రేవంత్ ఎదురు దాడి చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వమే కారణం అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇలా ప్లేట్ ఫిరాయించడం సమంజసం కాదు. పెన్షన్ల భత్యాల చెల్లింపుల్లో ఎంతో కొంత ఆలస్యం కావడం సహజమే. అందుకు ఎన్నో ప్రభుత్వాల్లో చాలా సందర్భాల్లో పెన్షనర్లు సర్దుకుపోయారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. సుదీర్ఘకాలంగా సమస్య పేరుకుపోతున్నది. నానాటికీ జటిలమవుతున్నది. పెన్షనర్లు పెరిగిపోతున్నారు. బకాయిలు పెరిగిపోతున్నాయి. పెన్షనర్ల అవసరాలు తీరడం లేదు. వారి వయోభారం నానాటికీ పెరుగుతుంది. వయోధికులైన పెన్షనర్లు ప్రభుత్వాన్ని దీవించి సహకరించడానికి బదులుగా శపిస్తూ ఎదురు తిరుగుతున్నారు.
గోరు చుట్టుపై రోకలి పోటు వలె కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా పెన్షనర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2004లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం తొలిసారిగా సీపీఎస్ విధానాన్ని తెచ్చి అంతవరకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న ఓపీఎస్ విధానానికి తూట్లు పొడిచింది. ప్రస్తుత ప్రధాని మోదీ ప్రభుత్వం పెన్షనర్ల పొట్ట కొట్టేవిధంగా ఇటీవల ఒక చట్టాన్ని దొంగచాటుగా తెచ్చి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నది. వాజపేయి తెచ్చిన సీపీఎస్‌కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నవారిపై కొత్తగా మోదీ తెచ్చిన చట్టం పెన్షనర్లను మరింత కృంగదీసింది. ఈ చట్టం ప్రకారం పెన్షనర్లకు ఒకసారి తప్ప మరెప్పుడూ పీఆర్సీ వర్తించదు. అంటే సమాజంలో పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా పెన్షన్ పెరగదన్నమాట. అంతర్జాతీయ ఆర్థిక గజ నేరగాళ్లకు వేల కోట్లు మాఫీ చేస్తున్న కేంద్రం దేశానికి సేవలు అందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్లపై ఇంత క్రూరంగా, అమానవీయంగా వ్యవహరించడం దారుణం. అందుకేనేమో మన రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన 8 మంది లోక్‌సభ సభ్యులు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో 8 మంది శాసనసభ్యులు పెన్షనర్ల సమస్యలపై తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. మౌనం వహిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెన్షనర్లలో ఇంతటి అభద్రత ఏనాడూ తలెత్తలేదు. కరోనా ఉపద్రవం వల్ల పెన్షన్ చెల్లింపుల్లో వారం, పది రోజులు ఆలస్యమైన మాట వాస్తవమే. కానీ, ఇప్పట్లాగా ఐదు డీఏల బకాయిలు, ఏండ్ల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లింపులకు నోచుకోకుండా ఏనాడూ పేరుకుపోలేదు.
సమైక్య రాష్ట్ర చరిత్రలోనే ఇంకా చెప్పాలంటే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పెన్షనర్లకు తొలుత 43 శాతం తర్వాత 30 శాతం వెరసి 73 శాతం ఫిట్మెంట్ లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీ ఏర్పాటుచేసి 5 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి.
గత ప్రభుత్వం ఇంకా ఏదో చేయలేదన్న కోపంతో పెన్షనర్లు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే గోటితో పోయే సమస్యలు గొడ్డలి దాకా ముదిరిపోయాయి. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందంగా తయారైంది పెన్షనర్ల పరిస్థితి. ఇంతకీ వారివేవీ గొంతెమ్మ కోర్కెలు కావు. కొత్తవి కావు. దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు అమలుపరిచిన వాటినే యథావిధిగా కోరుకుంటున్నారు. హక్కు భుక్తంగా తమకు చెందవలసిన వాటినే అడుగుతున్నారు. వాటిని సానుభూతితో మానవీయ కోణంలో పరిష్కరించాల్సింది పోయి ప్రజలకు, పెన్షనర్లకు-ఉద్యోగులకు, పెన్షనర్లకు మధ్య ఒక అగాథాన్ని సృష్టించే ప్రయత్నాలు ప్రభుత్వాధినేతలే చేయడం విచారకరం. ఇంతకాలం పెన్షనర్లు సంఘటితం కాలేదు. సమయం ఆసన్నమైంది. అన్ని పెన్షనర్ల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఐకాసగా చేయి చేయి కలిపాయి. ఇది శుభ పరిణామం. మానసిక ఆందోళన, అనారోగ్యం తదితర సమస్యలతో ఈ రెండేండ్ల కాలంలోఇప్పటికే 40 మంది పెన్షనర్లు చనిపోయినట్టు సమాచారం. అయినా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టినట్టు కూడా లేదు. ఈ దుస్థితి ఇంకా ఇంకా కొనసాగకుండా ఉండాలంటే ఆరోగ్యం, ఇతర పరిస్థితులు సహకరించిన ప్రతి పెన్షనర్ నవంబర్ 17న ఇందిరా పార్క్ వద్దకు తరలిరావాలి. ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపాలి. సంఘటిత శక్తిని ప్రదర్శించాలి. హక్కులను సాధించుకోవాలి. పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్)
– డాక్టర్ అయాచితం శ్రీధర్