అబద్ధాలతో అమాయక ప్రజలను నమ్మించి ఎన్నికలలో గెలిచాక ఊసరవెల్లులు కూడా సిగ్గుపడేటట్టు ఈ నాయకులు ఎందుకు తయారవుతున్నారు? వారిలో కనీస మానవ విలువలు లేకనా, లేక ప్రజల బుద్ధి మందగిస్తున్నదా? దీనికి ఏది కారణమైనా, బలయ్యేది మాత్రం నిస్సహాయులైన సామాన్య ప్రజలే!
ప్రస్తుతం మన దేశ పరిస్థితి గమనిస్తే ఈ నరబలి ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తుంది. గుజరాత్‌ను అప్రతిహతంగా మూడు సార్లు గెలిచి పాలించిన ప్రస్తుత ప్రధానమంత్రి పాలన ఆ రాష్ట్రంలో ఎలా జరిగిందో ఇతర రాష్ర్టాల ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో చేస్తున్నట్టే ప్రజాధనం కోట్లల్లో ఖర్చుపెట్టి మోదీ మానియా సృష్టించి తప్పుడు ప్రచారాలు చేసి ఉంటారాయన. సాంకేతికత అభివృద్ధిని స్వార్థ ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవచ్చో పాశ్చాత్య రాజకీయ నాయకులు మన ప్రధానమంత్రి దగ్గర నేర్చుకోవాలి.
అసలు ఇది మౌఖికంగా మొదలుపెట్టినది ఆయన కంటే సీనియర్ని, యాభై ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్నవాడినని ప్రచారం చేసుకునే నారా చంద్రబాబు నాయుడు. పదే పదే చెయ్యని పనులు తానే చేశానని చెప్పడంతో దేశంలో, రాష్ట్రంలో నిరక్షరాస్య, అమాయక పల్లెటూరి ప్రజలు, ఆయన వలన లబ్ధి పొందిన ఇతర అక్రమ వ్యాపారాలు చేసేవాళ్లూ నమ్మే పరిస్థితి వస్తుంది.
నిన్న మొన్న కడపలో బాబు చేసిన ప్రసంగం విన్నాం. తను 1999 నుంచీ 2004 వరకు వేసిన పునాదుల మీద కేసీఆర్ నడిచి తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టించగలిగారని పాపం ఆ అమాయక ప్రజలకు చెప్పారు. మానవ చరిత్రలో ఇప్పటిదాకా అత్యంత ధనవంతుడు హైదరాబాద్ రాష్ట్ర అధిపతి నిజాం అన్న సంగతి పాపం ఆంధ్ర ప్రాంతం వారికి ఏమి తెలుస్తుంది? అయితే ఇప్పుడున్న భారతదేశ రాజకీయ నాయకులలో బాబు గారు అత్యంత ధనవంతుడన్న విషయం అందరికీ తెలిసిందే! మరి 1978లో రాజకీయాలలో అడుగుపెట్టినప్పుడు ఈయన ఉమ్మడి ఆస్తి రెండెకరాలు మాత్రమే ఉన్నవాడు.
బాబు సంపద తాను అధికారంలో ఉన్న పద్నాలుగేండ్లలోనే సంపాదించారన్నది తేటతెల్లం, ఎలా సంపాదించాడో అన్నదానికి మనకు రుజువులు దొరకకపోయినా! ప్రస్తుతం మోదీ, అదానీ, అంబానీ సాలెగూడు ప్రజలను కీటకాలని చేసి మింగేస్తుందన్న విషయాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. 2014 ఎన్నికలకు ఆయన ఇస్తానన్న రూ.15 లక్షల ధనం 11 ఏండ్లయినా ప్రజలకు పైసా కూడా అందలేదు. కానీ, ఈ 11 ఏండ్లలో మోదీ వేల కోట్లు ప్రజా ధనం వెచ్చించి 154 విదేశీయాత్రలు చేశారన్నది మాత్రం సత్యం. పాపం 10 లక్షల డ్రెస్సు, 2 లక్షల నల్ల కళ్లజోడు, ఒక లక్ష రూపాయల బూట్లు ధరించి ఆ యాత్రలు చేసినా ఫలితం దక్కలేదు.
పాకిస్థాన్ ఉగ్రవాదులు భారతీయులని నిర్దాక్షిణ్యంగా చంపినా, ఈ విశ్వ గురువు అనుకుంటున్న వారికి ఏ ఒక్క దేశమూ అండగా నిలవలేదు, రష్యాతో సహా. మరి ఈ పదకొండేండ్లు ఇటు ప్రజలకు ఏమి చెయ్యక, అటు విదేశాలలో పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్టలు సంపాదించక ఈయన ఏమి ఉద్ధరించినట్టు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం, గెలిచిన విపక్ష నాయకులను భయపెట్టో, డబ్బిచ్చో కొనేయడం తప్ప ఈయన ఏమి సాధించినట్టు. అత్యంత వైవిధ్యం కలిగిన దేశంలో మత విద్వేషాలను రగిలించి, ప్రజలను విడదీయటం, విపక్షాల మీద అధికారం ఉపయోగించి కక్ష తీర్చుకోవటం తప్ప ఈయన ఆత్మకథలో ఇంకేముంటుంది?
ఇక యాభై ఏండ్ల రాజకీయ అనుభవజ్ఞుడు, తెలంగాణలో సర్ప్లస్ ధనం దోచుకొని, ఉద్యోగాలు, వ్యాపారాలు, తన వర్గం వారికి దోచిపెట్టి, భూములు ఆక్రమించి, ఏ సంక్షేమమూ తెలంగాణ వారికి రాకుండా జాగ్రత్త వహించి, 58 ఏండ్ల వలస పాలనలో జరిగిన 35 వేల రైతు ఆత్మహత్యలలో సింహభాగం ఆయన పాలనలో జరగగా నేతన్నల కడుపులు మాడ్చి, వేలమంది యువకులను నక్సలైట్ల నెపంతో చంపించి, కేవలం ఆంధ్ర వ్యాపారస్థులను అపర కుబేరులని చేసినది ఈయన ప్రజా పాలనే. రెండు కండ్ల సిద్ధాంతం వల్లిస్తూ, తెలంగాణ అన్న పదాన్ని అసెంబ్లీలో వాడొద్దని నిషేధించిన నియంత ఈయన. పోనీ తెలివి ఉందా అంటే మోసపూరిత విధానాలే కానీ ప్రగతికి కావలసిన మేధ లేదు. మూడేండ్లలో కట్టబడిన తెలంగాణ సచివాలయం లాంటి భవనం తన అమరావతిలో ఒక్కటీ కట్టలేకపోయారు. పదేండ్లలో వెనుకబడిన తెలంగాణ అని ముద్రవేసిన ఈ రాష్ట్రం ఒక మేధావంతుడి చేతిలో అన్నిరంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఇక మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మోసపూరిత విధానాలలో చంద్రబాబు గురుకులంలోనూ, కక్ష సాధింపు విధానాలలో గుజరాతీ గురుకులంలోనూ ఉన్నతస్థాయి శిక్షణ పొందిన నాయకుడు. సామాన్య ప్రజలను పీడించటానికి బహుశా ఏ నియంతకూ ఈయనకు వచ్చినన్ని ఆలోచనలు వచ్చి ఉండవు.
చెరువుల పరిరక్షణ పేరిట బీదవారి ఇండ్లు కూల్చడం, ట్రాఫిక్ నియంత్రణ కోసమని చిరు వ్యాపారులను తరిమెయ్యడం, స్వపక్ష నాయకులను కాపాడుతూ, విపక్ష నాయకుల నిర్మాణాలు కూల్చేయటం, పచ్చని పొలాలలో ఫార్మా కంపెనీ పేరిట విధ్వంసం, ప్రమాదకర కెమికల్ ఫ్యాక్టరీల కోసం బక్క రైతుల భూములు లాక్కోవటం, బడుగు రైతుల భూములలో గోశాలలు వంటివి సామాన్యులకు ప్రత్యక్షంగా నష్టం కలిగిస్తే, కాళేశ్వరం వంటి ప్రాజెక్టును బద్నాం చేసి, ఇతర ప్రాజెక్టులు పూర్తిచెయ్యకుండా, తెలంగాణను అత్యంత నష్టపరిచే బనకచర్ల వంటి ప్రాజెక్టుల మీద, నీటి చౌర్యం మీద నోరు మెదపకపోవటం తెలంగాణ వ్యతిరేక విధానాలకు అద్దం పడుతున్నాయి. ఓ వైపు అడుక్కు తినాల్సిన పరిస్థితి అంటూనే ప్రపంచ అందాల పోటీలు, రాష్ట్రంలో కరెంటు ఇవ్వకుండా ఎక్కడో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు విద్యుత్తు ప్లాంట్లు పెడతామనడం ఏ రకమైన తెలివో ప్రజలే తేల్చుకోవాలి.
– కనకదుర్గ దంటు 89772 43484