మొన్నటివరకు రైతులు, విద్యార్థుల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల భూములపై కన్నేసింది. గోపనపల్లి సర్వే నంబర్ 36, 37లలో ఉన్న189 ఎకరాలపై సర్కారు దృష్టిసారించింది. ఉద్యోగులు తమకు గృహ నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా 2005లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపనపల్లిలో 437 ఎకరాలను టీఎన్జీవో, ఏపీ ఎన్జీవో, సచివాలయ ఉద్యోగులకు కేటాయించడమైనది. టీఎన్జీవో, సచివాలయ ఉద్యోగులు తమకు కేటాయించిన స్థలంలో ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. కానీ, ఏపీ ఎన్జీవో సొసైటీకి కేటాయించిన 189.11 ఎకరాల్లో వివిధ కారణాల వల్ల గృహాల నిర్మాణం జరగలేదు.
ఏపీ ఎన్జీవోకి కేటాయించిన మొత్తం భూమిలో నుంచి 142 ఎకరాలను లేఔట్ చేసి, మౌలిక సదుపాయాల కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు 40 శాతం మార్టుగేజ్ చేసి నిర్దేశించిన రుసుము చెల్లించి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఏపీ ఎన్జీవో సొసైటీ నాయకత్వంలో నెలకొన్న విభేదాల కారణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉధృతమవడంతో ఏపీ ఎన్జీవో సమైక్యాంధ్ర ఉద్యమంపై దృష్టి పెట్టింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు.
ఆ సమయంలో నేను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. జూన్ చివరి వారంలో నా నేతృత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర కార్యవర్గం కలిసింది. పీఆర్సీ, హెల్త్‌కార్డులు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై దాదాపు 4 గంటలు చర్చించి నివేదిక సమర్పించాం. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సొసైటీకి కేటాయించిన భూమిపై కూడా చర్చ జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులకు హైదరాబాద్‌లో భూములు అవసరం లేదని, వారికి కేటాయించిన భూమిని తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వం మెమో 1088, తేదీ 2014 జూలై 2న ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ఎన్జీవో సొసైటీ కేసు వేసింది. కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. అప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నది. అయితే, హైకోర్టు చాలా స్పష్టంగా in the meanwhile the respondents shall not alienate the land in question in favour of any third party and maintain status Quo existing as on today with regard to the possession of the land in question అని ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ ఎన్జీవో సొసైటీకి కేటాయించిన 189.11 ఎకరాల్లో తమ భూములు 90 ఎకరాలు ఉన్నాయని ప్రైవేట్ వ్యక్తులు డి.నరసింగరావు, ఇతరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్ర రాజకీయ నాయకుల వ్యూహంలో భాగంగా ఈ కేసు వేశారనే ఆరోపణలు వచ్చాయి. కానీ, సకాలంలో సొసైటీ కౌంటర్ అఫిడవిట్ వేయకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు వేసిన కేసును విచారించి న్యాయం చేయాలని 2019లో కోర్టు ఆదేశించింది. దీనిపై రంగారెడ్డి కలెక్టర్ విచారణ జరిపారు. సొసైటీ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల 90 ఎకరాల భూమి లేదని కలెక్టర్ తన నివేదికలో స్పష్టం చేశారు.
దీంతో నకిలీ పత్రాలతో కోర్టును ఆశ్రయించారని ప్రైవేట్ వ్యక్తులపై ప్రభుత్వం కేసు వేసింది. ఆ తర్వాత సదరు వ్యక్తులు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. 2019 వరకు భూమి తమకు ఇవ్వాలని ఏపీ ఎన్జీవో సొసైటీ పలు రకాలుగా ప్రయత్నించింది. ఆ సొసైటీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు 2019లో ప్రత్యేకంగా సమావేశమై తమ సొసైటీ పేరును భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీగా మార్చుకున్నారు. కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఉద్యోగులకు కేటాయించిన భూమి విషయంలో సానుకూలంగా స్పందించి 189.11 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఎవరికి ఇవ్వకుండా కాపాడిందనే విషయం ఉద్యోగులందరికీ తెలుసు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భూమిపై ప్రైవేటు వ్యక్తుల కన్నుపడింది. విలువైన ఆ స్థలాన్ని కాజేయాలని ప్రైవేట్ సైన్యం కంచెలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అధీనంలో ఉన్న భూమిలో రోడ్లు నిర్మిస్తున్నా కాంగ్రెస్ సర్కారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఉద్యోగులు నియమించుకున్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి, పంపించివేసినా స్పందన లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల పేరిట ప్రభుత్వ భూమిపై ప్రైవేట్ వ్యక్తులకు యాజమాన్య హక్కులు కల్పించే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే గతంలో సర్వే నంబర్ 37లో విధించిన నిషేధాజ్ఞలను ఎత్తివేసింది. రిజిస్ట్రేషన్లు జరగడానికి అనుమతి ఇచ్చింది. గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను సైతం మార్చినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వాలు మారగానే నివేదికలు మారడం దేనికి సంకేతం?
మొత్తం 189 ఎకరాల భూమిని కొట్టేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెరవెనుక ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత పది రోజులుగా సొసైటీ స్థలంలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఆ స్థలాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి టీఎన్జీవో రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.
గత ప్రభుత్వాలు కాపాడిన ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ సర్కారు స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుని, ఉద్యోగులకు కేటాయించి వారికి న్యాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఉద్యోగులు, విద్యార్థులు, రైతుల భూములను కాపాడే బాధ్యతను మరిచిపోయి ‘కంచె చేను మేసినట్టు’ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరం. అన్ని వర్గాలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు వస్తే తప్ప, ఈ ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం లేదని గ్రహించాలి.
-వ్యాసకర్త: పూర్వ టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్