కొంతమంది రాజకీయ నాయకులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రెచ్చగొట్టడం వల్లే నిరుద్యోగులు పోటీ పరీక్షల నిర్వహణపై ఆందోళనలు చేస్తున్నారని, కోర్టులకు వెళ్తున్నారని విద్యార్థులపై నిందలు వేసిన సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు తీర్పు ఓ చెంపపెట్టు. గ్రూప్-1 పరీక్ష మెయిన్స్‌లో అవకతవకలు జరిగాయని, మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ దిద్దాలని, అలా వీలుకాని పక్షంలో మళ్లీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించిన విషయం విదితమే. ఫలితంగా గ్రూప్-1 పోస్టుల నియామక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. ఉద్యోగ ప్రాధాన్యాల ప్రకారం.. గ్రూప్-1 నియామకాల తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండటంతో వాటి నియామకాలు కూడా ఆగిపోయినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం, సీఎం రేవంత్ మొండి వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది.
వాస్తవానికి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత జీవో 29 కింద అభ్యర్థుల ఎంపిక, స్పోర్ట్స్ కోటా వాళ్లకు చివరి క్షణంలో సమాచారం ఇచ్చి మెయిన్స్‌కి పిలవడం ఇలా అనేక అంశాలు అభ్యర్థుల్లో తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి. అయినప్పటికీ టీజీపీస్సీ జాగ్రత్తపడలేకపోయింది. తన విశ్వసనీయతను నిలుపుకొనే ప్రయత్నం చేయలేకపోయింది. దీని వెనుక ఏదైనా రాజకీయ శక్తులున్నాయేమో తెలియదు. కానీ, తుది ఫలితాల్లో ఒకటి, రెండు సెంటర్ల నుంచే ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు రావడంతో ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు, అర్హత లేని వారితో పేపర్లు దిద్దించారని, తెలుగు మీడియం వాళ్లకి మార్కులు తక్కువగా వేశారని ఇలా ఎన్నో వివాదాలు ముందుకువచ్చాయి. చాలామంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హైకోర్టు తీర్పుతో అయినా చలనం వస్తుందా? నిరుద్యోగుల సమస్యలను రేవంత్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా? అంటే.. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలన్న టీజీపీఎస్సీ నిర్ణయంతో.. ‘అలాంటిదేమీ లేదు. మీరు ఉద్యోగాలపై ఆశలేమీ పెట్టుకోకండి’ అన్నట్టే ఉన్నది. తాజా తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్తే ఆ కేసు మరో ఏడాది పాటు నడుస్తుంది. అంటే అప్పటివరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టరన్నమాట. ఏమైనా అంటే ‘కేసు కోర్టులో ఉంది కదా.. మేమేం చేస్తాం’ అని ప్రభుత్వం తప్పించుకుంటుంది. ఉద్యోగ నియామకాలు చేపట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల బుద్ధిని తెలంగాణ సమాజం, ముఖ్యంగా యువత గమనిస్తున్నది. గ్రూప్-1 కోసం ఎంతో మంది తమ ఉద్యోగాలను వదిలిపెట్టుకొని ప్రిపేర్ అయ్యారు. చాలామంది పెండ్లి కూడా వాయిదా వేసుకున్నారు. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఒక తపస్సులా కష్టపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుద్యోగులను, వారి సమస్యలను తన రాజకీయ నిచ్చెన
ఎక్కడానికి మెట్లుగా వాడుకున్న రేవంత్ రెడ్డి.. ఇలాంటి బాధలను అర్థం చేసుకునే పరిస్థితిలో లేనట్టున్నారు. ఆయనకు సీఎం సీటు కావాలంతే. అది చిక్కింది.
అందుకే నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నా, జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసీ చూసీ నిరాశ చెంది సొంతూళ్లకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ, మళ్లీ నోటిఫికేషన్లు ఎప్పుడేస్తారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న యువత ఆందోళన ఆయనకు అర్థం కాదు. మీదికెళ్లి ఆయన బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మొండి వైఖరి ఇలాగే కొనసాగితే ఆ యువతే రేవంత్ కూర్చున్న కుర్చీని లాగి ఆయన్ను కూలదోసే రోజు ఎంతో దూరంలో లేదు.
మెయిన్స్ రద్దయిన నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుందోనని మెయిన్స్ అభ్యర్థులు, ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్ల నియామకాలు పూర్తై కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారా? అని మిగతా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ సర్కారు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలే తప్ప కోర్టులు, కేసులు, అప్పీళ్లు అంటూ కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించడమో, లేకపోతే ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేయడమో చేయాలి. ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలోనే వేసిన గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్ల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలి. అనంతరం జాబ్ క్యాలెండర్ వేయాలి.
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
– ఎగుర్ల శ్వేత
83330 11335