‘బతుకుదెరువుకని అమ్మ మాయమ్మ.. బొంబాయి బోతున్న అమ్మ మాయమ్మ’ పాట యాదికున్నదా? కన్నీరు తెప్పించే ఆ పాటలాంటి దుఃఖం పెద్ద లింగారెడ్డి పల్లిది. ‘నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య’ అంటూ ఆ పాటలో కన్నతల్లి శోకించినట్టే ఈ ఊరి తల్లులు బిడ్డల కోసం దశాబ్దాలు నిద్రలేని రాత్రులు గడిపారు. గడప గడపకూ ఓ కన్నీటి గాథ వినిపించే పెద్ద లింగారెడ్డి పల్లి ఇప్పుడు పచ్చబడ్డది. నీళ్లు నిండిన చెరువులో కొంగలు వాలినట్టే, వలస రైతులు తిరిగొచ్చిండ్రు! వలసపోయిన బతుకులన్నీ పల్లెపట్టున మళ్లీ పరిశ్రమిస్తున్నయి. కన్నతల్లి కన్నీరు తుడిచి భార్యాబిడ్డలతో కలిసి బతికే రైతు జీవితం పచ్చబడ్డది. నీళ్లు, కరెంటు, రైతుబంధు, మార్కెట్లు తెలంగాణ సేద్యాన్ని బంగారం చేసిన తీరు చెబుతున్నరు మెతుకుసీమ రైతులు.
‘అప్పట్ల ఒక్క ట్రాన్స్ఫార్మర్కు 30 బోరు కనెక్షన్లు ఉంటుండె. 9 గంటలే కరెంటు వచ్చేది. అందరూ ఒకేసారి బోరు మోటర్లు వేసేది. ట్రాన్స్ఫార్మర్ టప్మని ఎగిరిపోయేది. లో వోల్టేజ్‌కి ఒక్కోపాలి మోటర్ కాలిపోయేది. ట్రాన్స్ఫార్మర్ కాలినప్పుడల్లా బాయికి వంద రూపాయలు లెక్కన వసూలు చేసుకొని, ట్రాక్టర్ మీద తీస్కపోయి, రిపేర్ చేయించుకున్నం. ఇంటింటికి తిరిగి, ఊకూకె అడగడం ఇబ్బంది అయితుందని ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న రైతులంతా చిట్టీలేసినం. ఆ పైసలు అర్రాసుకిచ్చినం. ట్రాన్స్ఫార్మర్ కరాబ్ అయితే పైసలున్నోళ్లు రిపేర్ చేయిద్దురు. తర్వాత ఆ చిట్టిల కెల్లి తీసుకుందురు. అన్ని ఊళ్లల్ల రైతులు ఇట్లనే చేసిన్రు. ఇంతజేసినా బాగుపడింది లేదు. కరెంటు సరిపోక వరి మధ్యలనె ఎండుతుండె. మక్కజొన్న, వరి, యాసంగిల కూరగాయలు పండేది. ఆ పండిన మందం మిత్తిలకు గూడ ఎల్లక పోతుండె.
ఓ పదేండ్లు బావుల్ల సుక్క నీళ్లు లేకుండె. బోర్లేస్తే నీళ్లొస్తయేమోనని ఎంతోమంది బోర్లు వేసిన్రు. ఒక ఊరికి బోర్ వేసే లారీ వస్తే రెండు రోజులు పోకుండె. కొబ్బరికాయలు, తంగేడు పూలు పట్టుకుని నీళ్లు పడుతయని చూసేది. ఏడ పడుతయంటె ఆడ బోర్లేసిన్రు. బోరు కోసం నగలమ్మిన్రు. ఎడ్లమ్మిన్రు. బోర్లు పడకపోవు, పడితే నీళ్లు సరిపోవు. పొలం పారక ఎండుతుండె. చేయనీకి పని లేదు. ఈడుంటె అన్నమే లేకపాయె. ఆదాయం లేదాయె. ఎట్ల బతకాలె? చెట్టుకొకల్లం, పుట్టకొకల్లం అయినం. పొట్టచేత బట్టుకుని మహారాష్ట్ర, బొంబాయి, దుబాయికి ఎటు అవకాశం ఉంటె అటు పోయినం. ఏ పని దొరికితే ఆ పని చేశినం. జలగావ్ బార్ షాప్‌ల పని చేసిన’ అని పెద్దలింగారెడ్డిపల్లి రైతు ఆరుట్ల రాజిరెడ్డి ఎనకటి బాధలు యాది చేసుకున్నడు.
అప్పటి వలస బతుకుల రైతు గోస ఎట్లుందని అడిగితే రైతు మొకిల పద్మారెడ్డి పూసగుచ్చినట్టుగ ఇట్ల చెప్పిండు. ‘మబ్బుల నాలుగు గంటలకే లేవాలె. తెల్లారేసరికి సుతారి పనిల ఉండాలె. రాత్రి 11 గంటలకు పండుకునేది. పగోనికి గూడ రావొద్దన్నంత బాధుండేది. అన్నం లేదు. వాళ్లు పెట్టే రొట్టె అలవాటు లేకపాయె. వారానికి ఒక్కరోజు అన్నం పెట్టేది. గొడ్డు చాకిరీ చేయించుకొని రోజుకు 50 రూపాయల కూలి ఇచ్చేది. వదులుకుని వద్దామనుకుంటె ఊళ్లే బతికేటట్టే లేదు. మూడేండ్లల్ల
ఏక్దమ్ మారిపోయింది. కరెంటొచ్చింది. నీళ్లొచ్చినయ్. నాలుగు ఎకరాలకు రైతుబంధు వస్తున్నది. వ్యవసాయం మంచిగున్నది. బొంబాయి పోవుడు బంద్ అయింది. వలస పోయిన రైతులంతా మంచిగ చేలల్ల పని చేసుకుంటున్నర’ని సంతోషంగా చెప్పిండు.
మహారాష్ట్రకు వలసపోయి తిరిగొచ్చిన రైతు తౌటి రామచంద్రు ఎవుసం ఒక సంబురం లెక్కుందని చెబుతున్నడు. ‘నీళ్లు లేక మూడు ఎకరాల భూమి బీడుబడితె.. నాందేడ్, బలగాం, హిమాయత్‌నగర్‌ల కూలి పనులు జేశిన. ఇప్పుడు మా ఊరి సుట్టుముట్టు ఎటు జూశినా నీళ్లే! మా ఊరికే కాదు చుట్టుపక్కల అన్ని ఊళ్లల్ల నీళ్లు పెరిగినయి. రైతుబంధు పైసలతోని గుట్టలు అచ్చుకట్టి ఎవుసం చేసుకుంటున్నం. ఇప్పుడు మూడు, నాలుగు మోటర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్, ప్రతి రైతుకు రెండు పంటలకు రైతుబంధు పైసలు, రెండు పంటలకు కావాల్సినన్ని నీళ్లున్నయ్. మూడు ఏండ్లసంది కాలమైంది. వానకాలంల కరెంటు మోటరు వేస్తలేరు. రోహిణి కార్తెల గూడ బాయిల నీళ్లు చేతికందుతున్నయి! తెలంగాణ రాకముందు మేము వలసపోయినం. ఇప్పుడు బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా కూలీలు మా ఊరికి వలసొచ్చి బతుకుతున్నర’ని చెప్పిండు. పెద్దలింగారెడ్డిపల్లి రైతు నవ్విన రాజ్యంలా మారిందని చెప్పనీకి రామచంద్రు మాటలే సాక్ష్యం.
పెద్దలింగారెడ్డిపల్లిల మారిన రైతు బతుకుల్ని దగ్గరగ చూసిండు మొకిల మోహన్‌రెడ్డి. సిద్దిపేట (రూరల్ మండలం) రైతుబంధు సమితికి ఆయన అధ్యక్షుడు కూడా. ‘ఇప్పుడెట్లుంది మీ ఊరు?’ అంటే?.. ‘మూడేండ్ల నుంచి ఏ ఊళ్ల బోరు ఎండిన మాట వినలే. కరువు ముచ్చటే రాలే. కరెంటు, నీళ్లు, రైతుబంధు, మార్కెట్లు.. ఈ నాలుగే రైతుల తలరాత మార్చినయి. చేసుకునేటోళ్లకు ఊళ్లనే చేతినిండా పని. బొంబాయి, హైదరాబాద్ పోకుండ దగ్గర్ల ఉన్న టౌన్ల చేతనైన పనులు చేసుకుంటున్నరు. చదువుకున్నోళ్లే జాబ్ కోసం హైదరాబాద్ పోతున్నరు. మద్దతు ధరలే కాదు, రోడ్లు పెరిగేసరికి మా భూముల ధరలకు రెక్కలొచ్చినయి. ఒకప్పుడు ఆపద వస్తె అమ్ముతనంటె భూమి కొనేటోడే లేడు. కొన్నా ఎకరం లక్ష రూపాయలు. ఇప్పుడు గుంట లక్షకు తక్కువ లేదు’ అంటున్నడు. పదేండ్ల కింద ఇట్ల నీళ్లుంటయని పెద్ద లింగారెడ్డిపల్లి రైతులు ఊహించలే. కరెంటు ఇట్లొస్తదని, బొంబాయి పోయే బాధలు తప్పుతయని కలలో కూడా అనుకోలే. ఊహకందనంత ప్రగతితో పెద్దలింగారెడ్డిపల్లి లెక్కనే తెలంగాణ పల్లెలు పచ్చబడ్డయి! బతుకులు మెరుగుపడ్డయి! సేద్యమంటే ఇప్పుడొక సంబురం.
తెలంగాణలో నీటి సౌలత్ మస్త్ ఉన్నది. కరెంటు ఫ్రీగా ఇస్తున్నరు. రైతుబంధు సాయమొస్తున్నదని భూమిని, పల్లెను విడిచిపెట్టి పట్నం చేరినోళ్లు మల్లా వెనక్కి వచ్చుడే గాదు… అసలు ఎవుసమే చేయనోళ్లూ ఊళ్లకు వచ్చి పంటలేస్తున్నరు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయినోళ్లు పిల్లల దగ్గర ఉంటూ మనవలు మనవరాండ్లతో సంతోషంగ బతుకుతుంటరు. లేకపోతే ఏదన్నా చిన్న పని చూసుకొని కాలక్షేపం చేస్తరు. కానీ, మారెడ్డి రామిరెడ్డి, మారెడ్డి లక్ష్మారెడ్డి సోదరులు అట్లగాదు. నగరాల్లో ఉండకుండా పుట్టి పెరిగిన (లింగాపురం, ధూళ్మిట్ట్ట మండలం) ఊరికొచ్చిండ్రు. ఎవుసం మొదలువెట్టిన్రు. ఈ వయసుల ఇంత కష్టం ఎందుకంటే?.. ‘అరె గిది తెలంగాణ. ఇక్కడ వ్యవసాయమంటె సంబురం. రిస్క్ లేదిప్పుడు!’ అంటున్నరు. మారెడ్డి రామిరెడ్డి వయసు 83 ఏండ్లు. డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి రిటైర్ అయిండు. ఆయన తమ్ముడు లక్ష్మారెడ్డి కోల్ ఇండియా (మహారాష్ట్ర)ల పని చేసి రిటైర్ అయిండు. పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నరు. కొంతమంది హైదరాబాద్‌ల ఉంటున్నరు. ‘సంతోషంగ ఉండాల్నంటె వ్యవసాయమే బెస్ట్ అనుకున్నం. అనుకున్నట్టే ఉన్నం’ అని ఆ అన్నదమ్ములిద్దరూ చెబుతున్నరు. ‘చెరువులు నింపి నీళ్లు పెంచిన్రు. ఫ్రీ కరెంటు, రైతుబంధు ఇస్తుండ్రు. ఇన్ని ఇస్తుంటె వ్యవసాయం చేయకుండ ఎట్లుంటం? వరి, కందులు పండిస్తున్నం. అప్పట్ల 250 అడుగులేసినా బోర్లల్ల నీళ్లు పడలె. ఇప్పుడు 150 అడుగులకే నీళ్లొస్తున్నయి. నీళ్లు లేక సాగుచేయని భూములన్నీ ఇప్పుడు సాగు చేస్తున్నరు. చూస్తంటె చాలా సంతోషంగ ఉంద’ని అన్న రామిరెడ్డి అంటున్నడు. ‘ఎనిమిదేండ్ల కింద మార్పు మొదలైంది. నీళ్లు లేక తిండిగింజలు పండక అల్లాడిన జనం ఇప్పుడు మంచిగున్నరు. లుక్సానీ అయినా లాభమైనా కేసీఆర్ ధాన్యం కొంటున్నడు. రైతుకు ఇంతకంటె ఇంకేం గావాలె?’ అంటున్నడు తమ్ముడు లక్ష్మారెడ్డి.
మా ఇంట్ల నలుగురం బొంబాయి పోయినం. 15 సంవత్సరాలు సుతారి పని చేశినం. నాలుగేండ్ల నుంచి ఎవుసం మంచి గుంది. రెండు ఎకరాలల్ల మల్బరి తోటవేశిన. పట్టుపురుగుల పెంపకం మొదలువెట్టిన.
-తౌటి యాదయ్య పెద్ద లింగారెడ్డిపల్లి, సిద్దిపేట జిల్లా
అప్పట్ల చినుకు పడిందంటె ఆగమాగంగ ఉంటుండె. సేటు దగ్గరికి పోయి అప్పు అడగంగనె.. ‘ముందు ఇప్పటికే తీస్కున్న బాకీ కట్టిపో, తర్వాత కొత్తగ దీస్కో’ అనేటోడు. ఆ అప్పులు తీర్చలేక, మిత్తిలు కట్టలేక కొంతభూమిని బీడు పెట్టుకున్న. రైతుబంధు వచ్చినప్పటి నుంచే మొత్తం భూమి సాగుచేస్తున్న. రైతుబంధు వచ్చినంక అప్పు చేయలే. అవసరం గూడ రాలే. ఆడీడ అప్పు తీసుకునే బాధపోయింది. సమయానికి ఎరువులు వేస్తున్న. రైతుబంధు పైసలొస్తె ఎరువులు కొని స్టాక్ పెట్టుకుంటున్న. మా ఊళ్లో మస్తుమంది సేట్లు ఉండేది. భూములు, బంగారం తాకట్టు పెట్టుకునేటోళ్లు. అట్ల బతికిన సేట్లు రైతుబంధు వచ్చినంక మిత్తి బేరం నడువక ఊరు వదలిపెట్టిన్రు. ఈ రైతుబంధే లేకపోతే మా రైతుల గోస తీరకపోతుండె. రైతుబంధు వచ్చినంకనే రైతు సల్లంగుండు. వచ్చిన పంట లాభంలమూడొంతుల ఒక వంతు రైతుబంధుదే!
-వంగాల శ్రీకాంత్ రెడ్డి ఆకునూరు, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా
ఒకప్పుడు అప్పుతోనే వ్యవసాయం మొదలుపెట్టేది. పురుగు మందులు, విత్తనాల కోసం అప్పుకు పోతే ఎక్కువ ధర. పైసలిస్తే అగ్గువ. ఆపై మిత్తి.. పండినదంతా షావుకారుకి పోతుండె. రైతుకేమీ మిగలకుండె. రైతుబంధు వల్ల అప్పు భారం తగ్గింది. ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి పోయింది. రైతుబంధు లేకుంటే చిన్న రైతులు ఆగమే. రైతు బంధు పైసలొస్తే విత్తనాలు,
ఎరువుల బస్తాలు తెచ్చుకుంటున్నం. ఎరువుల ధరలు ఏక్దమ్ పెరిగినా ఇబ్బంది లేదంటే.. కారణం రైతుబంధు మేలే. ఎకరం వరికి ఇరవై నుంచి ఇరవై అయిదు వేలు పెట్టుబడి కావాలె. ఎంత పండినా ఎకరానికి మిగిలేది పది వేలే. అంతకంటే ఎక్కువ రాదు. ఇప్పుడు రైతుకు వచ్చే లాభమంటే రైతు బంధే!
-తుశాలపురం కనకయ్య, ధూళ్మిట్ట, సిద్దిపేట జిల్లా
–నాగవర్ధన్ రాయల
-నర్రె రాజేష్