జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో-252ను చూస్తే, ఒకప్పుడు హోటళ్లలో అమలైన ‘రెండు గ్లాసుల విధానం’ గుర్తుకు వస్తున్నది. దళితులకు సొట్టబోయిన, పాతబడ్డ గ్లాసులు లేదా గాజు గ్లాసుల్లో, ఇతర సామాజిక వర్గాలకు పింగాణి కప్పులు, తళతళలాడే స్టీల్ గ్లాసుల్లో టీ, కాఫీలు అమ్మేవారు హోటల్ యజమానులు! దళితులను దేవాలయాల్లోకి కూడా అనుమతించేవారు కాదు! నాడు సామాజిక దుర్నీతికి చిహ్నమైన ‘రెండు గ్లాసుల విధానం’ మాదిరిగానే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జర్నలిస్టులకు ‘రెండు కార్డుల విధానం’ తీసుకొస్తున్నది.
రాష్ట్రంలో ఇప్పటివరకు కనీసం ఐదేండ్ల సర్వీసు పూర్తయి, డిగ్రీ ఉత్తీర్ణులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఒకే రకమైన ‘మీడియా అక్రెడిటేషన్ కార్డులు’ ఇచ్చేవారు. ప్రతి రెండేండ్లకోసారి కొత్త కార్డులు జారీ చేసేవారు. ఈ కార్డు కలిగిన జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు చార్జీల్లో రాయితీలు, ఆరోగ్య శ్రీ సంస్థ ద్వారా హెల్త్‌కార్డులు ఇస్తున్నారు. ఈ కార్డు ఉంటే సచివాలయం, అసెంబ్లీ, ఉన్నత శ్రేణి నాయకుల ప్రెస్మీట్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లకు సైతం వెళ్లే సౌలభ్యం ఉంటుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రిపోర్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారికే అక్రెడిటేషన్లు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తొలిసారిగా డెస్క్ జర్నలిస్టులకూ ‘అక్రెడిటేషన్ కార్డులు’ ఇచ్చింది. అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్వయంగా డెస్క్ జర్నలిస్టు కావడం, వార్తా కథనాలను పెద్దగా చదువుకోని సామాన్యుడికి సైతం సులభంగా అర్థమయ్యేలా, సరళంగా రాయడానికి డెస్క్ జర్నలిస్టులు పడే శ్రమ, అర్ధరాత్రి దాటే వరకు పనిచేయాల్సిన వర్కింగ్ కండిషన్స్, డెడ్‌లైన్‌కు అనుగుణంగా పత్రికలను, న్యూస్ బులెటిన్లను తీర్చిదిద్దడంలో పడే టెన్షన్, ఈ సందర్భంగా వారు ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడి.. తదితర అంశాల మీద సంపూర్ణ అవగాహన ఉన్నవాడు కావడంతో దాదాపు అర్హత కలిగిన డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేవిధంగా చొరవ చూపారు. ఈ విధంగా 2022లో దాదాపు 23 వేల మంది జర్నలిస్టులకు కేసీఆర్ ప్రభుత్వం అక్రెడిటేషన్లు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన వివక్షను రూపుమాపింది. దీంతో డెస్క్ జర్నలిస్టులకు కూడా బస్ పాస్‌లు, హెల్త్‌కార్డులు అంది వచ్చాయి. వీటి కాల పరిమితి 2024 జూన్ 30 తో ముగిసింది. దశలవారీగా 2025 డిసెంబ ర్ 31 వరకు పొడిగిస్తూ వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ల జారీకి జీవో-252ను విడుదల చేసింది. డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులకు వేర్వేరు కార్డుల విధానం తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల వార్తలను సేకరించే జర్నలిస్టులకు ‘అక్రెడిటేషన్ కార్డు’లు, ఇతరులకు ‘మీడియా కార్డు’ల పేరిట జర్నలిస్టులను విభజించింది.
ఈ విధానం అమలైతే, ఇకనుంచి జర్నలిస్టులు అందరికీ ఒకే రకమైన న్యాయం ఉండదు. సమాచార సేకరణలో సమన్యాయం వర్తించదు. రెండు కార్డుల విధానం తమ ఆత్మగౌరవానికి విఘాతం కలిగించేలా ఉన్నదని డెస్క్ జర్నలిస్టులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం దీనిని సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలి.
జర్నలిస్టులు కేవలం వేడివేడి పకోడిల్లాంటి రాజకీయ వార్తలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మాత్రమే కవర్ చేయరు. సెక్రటేరియట్లు, అసెంబ్లీలు, రాజకీయ పార్టీల కార్యాలయాల చుట్టూ మాత్రమే తిరగరు. వారి పరిధి చాలా విస్తృతమైనది. అనేక విపత్కర, కఠినతర, ప్రమాదకర పరిస్థితుల్లోనూ సమాచార సేకరణ చేస్తారు. అయితే, తమ చుట్టూ తిరిగేవారు, తమకు కనిపించేవారు, స్టూడియోల్లో తమతో డిస్కషన్లు చేసేవారు మాత్రమే జర్నలిస్టులు అనే అభిప్రాయం చాలామంది రాజకీయ నేతల్లో ఉంటుంది. అలాంటి జర్నలిస్టులు అందించే కథనాలు, ఫీల్డ్‌లో వారి ప్రవర్తన.. ఒక్కొక్కసారి రాజకీయ నేతలను సంతృప్తి పరుస్తుంది. ఒక్కోసారి ‘ఇరిటేట్’ చేస్తుంది. అలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని పాలకులు నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. అది హ్రస్వదృష్టి అవుతుంది. రాజకీయ నాయకులకు కనిపించే, తరచూ వారితో సంభాషించే జర్నలిస్టులు మీడియా సంస్థల నిర్వహణలో ఒక చిన్న భాగం మాత్రమే. వీరితోపాటు బయటకు కనిపించని అనేకమంది పరిశోధనాపిపాసులు, అధ్యయనశీలురు, సృజనశీలురైన జర్నలిస్టుల సమష్టి కృషి ఫలితంగా దినపత్రికలు, న్యూస్ బులెటిన్లు, మ్యాగజైన్లు రూపుదిద్దుకుంటాయి. సమాజంలో మానవీయతను తట్టిలేపే, పెడధోరణులను నిరసించే కథనాల వెనుక ఇలాంటి వారి కృషే ఎక్కువగా ఉంటుంది. వివిధ వేదికల మీద ప్రభుత్వ పెద్దలు, ఇతర ప్రముఖుల ఉపన్యాసంలోని ముఖ్యమైన అంశాన్ని పత్రిక పాఠకుడి, టీవీ వీక్షకుడి హృదయంలో హత్తుకుపోయేలా ప్రజెంట్ చేయడంలో సృజనశీలురైన డెస్క్ జర్నలిస్టులదే కీలకపాత్ర. అలాంటివారందరి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించకూడదు. దురదృష్టవశాత్తు మీడియా అక్రెడిటేషన్ నూతన పాలసీలో అదే లోపించింది. తమను ‘ఇరిటేట్’ చేస్తున్న కొద్దిమందిని ఎలా నియంత్రించాలన్న ఆలోచనే ఈ జీవో రూపకర్తలను ప్రభావితం చేసిందేమోనన్న అనుమానం కలుగుతున్నది. లేకపోతే ‘రెండు గ్లాసుల విధానం’ మాదిరిగా ‘రెండు కార్డుల విధానం’ తీసుకొని రావడం ఏమిటి? దాని పరమార్థం ఏమిటి?
డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డులు (అక్రెడిటేషన్స్) ఇచ్చి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు పేరున్నది. అధికారంలో ఎవరున్నా ఈ ఖ్యాతిని నిలబెట్టుకోవాలి. వాస్తవానికి, జర్నలిస్టు సంఘాల జాతీయ యూనియన్ల నాయకులు కూడా వివిధ రాష్ర్టాల ముందు అదొక డిమాండ్‌గా పెట్టాలి. కానీ, వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి జాతీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే.. జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీసే, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే జీవో రావడమే ఆశ్చర్యకరంగానే కాదు, దిగ్భ్రాంతికరంగా కూడా ఉన్నది. ఇప్పటికైనా దీనిని సరిదిద్దేందుకు మీడియా అకాడమీ చైర్మన్ చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది.
జీవో-252లో భాగంగా వివిధ మీడియా సంస్థలకు కేటాయించిన అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య కూడా జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని, అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రస్తుతం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల కంటే ఈ జీవోలో పేర్కొన్న కోటా చాలా తక్కువగా ఉన్నది. సర్క్యులేషన్ ఆధారంగా ఆయా పత్రికలకు కోటా నిర్ణయించారు. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు ఎక్కువ కార్డులు, అంతకంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు తక్కువ కార్డులు కేటాయించారు. ఇది సహజంగానే ఇప్పటికే బలంగా పాతుకుపోయిన ఆంధ్రా యాజమాన్యాల నిర్వహణలోని పత్రికలకు ఎక్కువ మేలు చేసేదిగానూ, తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రారంభమై ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న తెలంగాణ యాజమాన్యాల నిర్వహణలోని పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎక్కువ నష్టం చేసేదిగానూ ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. విధాన నిర్ణేతలకు తెలంగాణ సోయి లోపించడం వల్ల వచ్చిన సమస్య ఇది. నిజానికి, సర్క్యులేషన్‌తో సంబంధం లేకుండా ప్రతి మీడియా సంస్థకు వాటి అవసరాల మేరకు నిర్దిష్ట సంఖ్యలో జర్నలిస్టులు అవసరం.
ప్రస్తుతం ప్రధాన పత్రికలు రెగ్యులర్‌గా 12 పేజీలకు తక్కువ కాకుండా న్యూస్ అండ్ ఫీచర్స్ పేజీలు ప్రచురిస్తున్నాయి. ఫుల్ పేజీ అడ్వర్టయిజ్మెంట్లు ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా పేజీల సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఈ లెక్కన ప్రతి పత్రికకూ పేజీకి కనిష్ఠంగా ఇద్దరు చొప్పున కనీసం 24 నుంచి 30 మంది వరకు ప్రధాన ఎడిషన్ కోసం డెస్క్ జర్నలిస్టులు పనిచేస్తుంటారు. అంతకుమించిన సంఖ్యలో జిల్లా అనుబంధాల కోసం పనిచేస్తుంటారు.
ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కనీసం 30 మందికిపైగా డెస్క్ జర్నలిస్టులు ఉంటారు. కానీ, జీవో-252లో పేర్కొన్న ప్రకారం అందులో మూడో వంతు మందికి కూడా అక్రెడిటేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం లేదు. ఆ మేరకు ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కోత పెట్టినట్టుగానే పరిగణించాలి. కాబట్టి, ఆయా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వాస్తవిక సంఖ్యకు అనుగుణంగా ఎటువంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ గతంలో మాదిరిగానే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలించాలి. అదేవిధంగా అనర్హులకు ఇవ్వకుండా అవసరమైన మెకానిజాన్ని కూడా రూపొందించాలి. ఈ విషయంలో రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలు కూడా నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేస్తున్నామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధంగా ‘రెండు కార్డుల విధానం’ ఉండటం బాధాకరం. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని జీవో-252ను సరిదిద్దుతారని ఆశిద్దాం.