యావత్ ప్రపంచమే మెచ్చిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింతగా వ్యవహరిస్తున్నారు. పూటకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. మొన్నటివరకు అభాంబాలు వేస్తూ, ఆరోపణలు చేసిన కాళేశ్వరం నీళ్లనే వాడుకోవాల్సి రావడంతో ఆయన కొత్త అబద్ధాలకు తెరలేపారు. హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు తెస్తామని చెప్తూనే, ఆ నీళ్లు కాళేశ్వరం జలాలు కావని నాలుక మడతేస్తుండటం హాస్యాస్పదం.
హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా గండిపేట వద్ద నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మరోమారు తన నోటికి అబద్ధాల పనిచెప్పారు. కాళేశ్వరం ఎప్పుడో కూలిపోయిందని, ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లను తెస్తున్నామని కొత్త రాగం ఆలపించారు. ఓ వైపు కాళే శ్వరంపై నిందలు వేస్తూనే, మరోవైపు కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ను వాడుకోవడం కాంగ్రెస్ సర్కార్ కపటనీతికి నిదర్శనం. ఎల్లంపల్లిని కాంగ్రెస్సే నిర్మించి ఉంటే, తెలంగాణ రాకముందు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు అప్పుడే నీళ్లెందుకివ్వలేదు? హైదరాబాద్‌కు గోదావరి జలాలను ఎందుకు తరలించలేదు? తెలంగాణ వచ్చాక ఎల్లంపల్లిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. శంకుస్థాపన జరిగిన 12 ఏండ్లకు, తెలంగాణ వచ్చిన రెండేండ్ల తర్వాత 2016, నవంబర్‌లో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు వేములవాడ మండలంలోని ఫాజిల్‌నగర్ నుంచి చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ మైనర్ ఇరిగేషన్‌కు గోదావరి జలాలను విడుదల చేశారు. ఇక మల్లన్నసాగర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు దాన్ని కూడా కాంగ్రెస్ సర్కారు నిర్మించిందని చెప్పడం వింతల్లో కెల్లా వింత. మల్లన్నసాగర్‌ను నిర్మిస్తే భూకంపాలు వస్తాయని రైతులను భయపెట్టిన చరిత్రను మర్చిపోతే ఎట్లా రేవంత్‌రెడ్డీ? ప్రాణహితలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మల్లన్నసాగర్ కెపాసిటీ 1.15 టీఎంసీలే. కానీ, కేసీఆర్ కట్టిన మల్లన్నసాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు. కాంగ్రెస్ నాయకులు మాటిమాటికీ చెప్పే ప్రాణహిత-చేవెళ్ల మొత్తం కెపాసిటీ 16 టీఎంసీలే.
ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లను చేరవేసేందుకు పెద్ద తతంగమే నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను మధ్య మానేరుకు తరలించారు. రెండో దశ లో మొత్తం మూడు ప్యాకేజీలున్నాయి. మొదట ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్‌లోకి, అక్కడినుంచి శ్రీరాంసాగర్ వరద కాలువకు, ఆ తర్వాత మధ్యమానేరుకు నీళ్లు చేరుతాయి. మూడో దశలో భాగంగా మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని తరలిస్తారు. మొదట మధ్యమానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు, అక్కడినుంచి శ్రీరంగనాయకసాగర్కు, అక్కడినుంచి మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు వచ్చి పడుతాయి. కేసీఆర్ నిర్మించిన మేడారం, అనంతగిరి, శ్రీరంగనాయకసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు, అప్రోచ్ కెనాల్స్, టన్నెళ్లు.. లేకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు గోదావరి జలాలను మళ్లించగలరా?
హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపును గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతిపాదించింది. అయితే, కొండపోచమ్మసాగర్ నుంచి వెయ్యి కోట్లతో కేసీఆర్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దానినే రేవంత్ ప్రభుత్వం మల్లన్నసాగర్‌కు మార్చి, ప్రాజెక్టు వ్యయాన్ని 7,300 కోట్లకు పెంచి, నీళ్లకు బదులు కమీషన్ల వరద పారించాలని చూస్తున్నది. గండిపేట నుంచి మల్లన్నసాగర్ సుమారు 118 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 557 మీటర్ల ఎత్తున ఉంటుంది. అదే కొండపోచమ్మసాగర్ గండిపేటకు 70 కిలోమీటర్ల దూరంలో, 618 మీటర్లపైన ఉంటుంది. 540 మీటర్ల ఎత్తున ఉండే గండిపేటకు 618 మీటర్ల ఎత్తున ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో నీళ్లను తీసుకురావచ్చు. ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు కాళేశ్వరంలో భాగంగా నీళ్లు తరలించే మార్గం అందుబాటులో ఉండనే ఉన్నది. కానీ, అలాచేస్తే కమీషన్లు రావు కదా? ఫలాలిచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు.. ఇట్లా కాళేశ్వరం ప్రయోజనాలను వాడుకుంటూ దాని మీదనే నిందలు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు, మేధావులు, బుద్ధిజీవులు, ముఖ్యంగా అన్నదాతలు ఇకనైనా కాంగ్రెస్ నైజాన్ని గ్రహించాలి. కాళేశ్వరంతో పాటు తెలంగాణను కాపాడుకోవాలి. అప్పుడే తెలంగాణతోపాటు మనమూ మనగలుగుతాం.
(వ్యాసకర్త: కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి)
– గంగుల కమలాకర్