వారిప్పుడు గ్రామ సర్పంచ్‌లు కారు. 2024, జనవరి 31తో వారి పదవీకాలం ముగిసి మాజీలైపోయారు. తమ హయాంలో గ్రామాభివృద్ధి కోసం వారు ఎన్నో పనులు చేశారు. గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. చెత్త రవాణాకు ట్రాక్టర్లు కొన్నారు. అన్నీ కూడా పంచాయతీ సమావేశాల్లో తీర్మానాలకు అనుగుణంగానే జరిగాయి. ముందో, వెనకో ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని భరోసాతో దొరికిన కాడ అప్పులు తెచ్చి మరీ గ్రామాలకు సౌకర్యాలు కల్పించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వారు ఊపిరాడని ఆర్థిక చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఇప్పటికీ వారు చేసిన పనుల బిల్లుల చెల్లింపు ఆగిపోవడమే అందుకు కారణం. నెలనెలా వడ్డీ భారం పెరిగి, తెచ్చిన అప్పు వచ్చే బిల్లును దాటిపోతున్నది. దీంతో అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు.
బిల్లుల మంజూరు కోసం మాజీ సర్పంచ్ లు చేయని ప్రయత్నం లేదు. చివరికి విసిగివేసారి నవంబర్ 4న తమ జేఏసీ నాయకత్వంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. న్యాయంగా వారికి రావలసిన సొమ్ము చెల్లించకపోగా, వారికి నిరసనలు తెలిపే అవకాశం కూడా రేవంత్ సర్కారు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు, గృహ నిర్బంధాల ద్వారా మాజీ సర్పంచ్ల కాలు కదలనీయలేదు. హైదరాబాద్ చేరుకున్నవారిని, సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని ఇస్తామన్నా పోలీసులు ఒప్పుకోలేదు. ఇది రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచ్ల బిల్లుల బకాయిల దుస్థితి.
మాజీ సర్పంచ్ల ఆందోళన, అరెస్టుల విష యం వార్తల్లో హల్చల్ చేయడం, బీఆర్ఎస్ నేత లు వారికి మద్దతుగా నిలవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు విప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేని విషయం అర్థం చేసుకోవాలని, వచ్చే మార్చి 31 దాకా మాజీ సర్పంచులు ఓపిక పట్టాలని కోరారు. రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవలసిన ప్రభుత్వం మరో 5 నెలలు ఆగమనడం దారుణం. వారి రుణ భారాన్ని తగ్గించే బాధ్యత తమదేనని ప్రభుత్వం మరిచిపోవడం విడ్డూరం.
పేద సర్పంచ్ల పక్షాన నిలబడి వారి కష్టాలను తీర్చాల్సిన మంత్రి సీతక్క అందుకు విరుద్ధంగా, అప్పటి పనులపై విచారణ చేసి బిల్లులు చెల్లిస్తామనడం అత్యంత ఖండనీయం. పైగా ఇప్పుడు అధికారంలో లేని కేసీఆర్, హరీశ్‌రావుల ఇండ్ల ముందు ధర్నా చేయాలని ఆమె చెప్పడం హాస్యాస్పదం.
సర్పంచ్‌గా కొనసాగితేనే అప్పులిచ్చిన వాళ్లు ఓపిక పడతారు. పదవిలోంచి దిగిపోతే అప్పులవాళ్లు ఇంటి మీదకు రావడం ఖాయం. ఇలాంటి దుస్థితి వస్తుందని ముందే గ్రహించిన మాజీ సర్పంచ్‌లు ఫిబ్రవరి మొదట్లోనే ముఖ్యమంత్రిని కలిసి… స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దాకా తమనే పదవుల్లో కొనసాగించాలని వేడుకున్నారు. అయితే, వారి అభ్యర్థనను పక్కనపెట్టిన సీఎం సర్పంచ్ల అధికారాలను ప్రత్యేక అధికారులకు అప్పగించారు. ఇదిలా ఉంటే బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తేలేదాకా ఎన్నికలు జరగవు. కొత్త సర్పంచ్‌లు వచ్చేదాకా గ్రామాల్లో పనులు సాగవు. పాత బిల్లుల ప్రస్తావన ఇంకెక్కడొస్తుంది? ఇంత క్లిష్ట సమస్య ల్లో చిక్కుకున్న మాజీ సర్పంచ్ల బాధను ప్రభు త్వం అర్థం చేసుకోకుండా వారిని మరింత మానసిక ఒత్తిడికి గురిచేయడం బాధాకరం.
మాజీ సర్పంచ్‌లు కోరినట్లు పదవీకాలాన్ని ఆరు నెలలు లేదా ఏడాదికాలం పొడిగించి ఉంటే వారిపై అప్పుల ఒత్తిడి ఉండేది కాదు. అధికారం పోయాక ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు అవి సొంత అప్పులుగా మిగిలిపోయాయి. అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు భరించలేక ఒక సర్పంచ్ తన పదవీకాలాన్ని ఎలక్షన్లు ప్రకటించేదాకా పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆయన అభ్యర్థనను కొట్టివేసింది. వెంటనే ఎన్నికలు జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఇద్ద రు సర్పంచ్‌లు కోర్టుకెళ్లారు. ఎన్నికల పట్ల ప్రభు త్వ నిర్లక్ష్యాన్ని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. సుదీర్ఘకాలం స్పెషల్ ఆఫీసర్లను కొనసాగించడం చట్టాన్ని అతిక్రమించడమేనని వారు ఆ పిటిషన్లో తెలిపారు.
బిల్లుల మంజూరు కోసం ఇప్పటికే మాజీ సర్పంచ్‌లు రెండుసార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టిని ఐదు సార్లు కలిశారు. ఇలా ఎమ్మెల్యేలను, పంచాయతీరాజ్ కమిషనర్‌ను, ప్రిన్సిపల్ సెక్రెటరీని పలుమార్లు కలిసినా ఫలితం శూన్యం. జూలైలో గవర్నర్‌ను కలిసి తమ బాధలు చెప్పుకోగా త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంకా నెరవేరకపోవడం శోచనీయం.
ఇక లాభం లేదనుకొని వారు ఆందోళన బాట పట్టారు. సెప్టెంబర్ 23 నాడు హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శాంతియుత ధర్నా చేశారు. సెప్టెంబర్ 30లోగా తమ బిల్లు చెల్లించకపోతే ఆందోళనను నిరవధికంగా కొనసాగిస్తామని, మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించా రు. బిల్లులు చెల్లించని పక్షంలో అధికారులను సైతం ఊర్లలో అడుగు పెట్టనీయమన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేస్తామని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పం దించలేదు. ఎన్నికల్లో గెలవగానే నిధులు మం జూరు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పింది. న్యాయంగా డిమాండ్ చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు.
– నర్సన్ బద్రి 94401 28169