మహాత్మా జ్యోతిరావు ఫూలే భావాలతో ప్రభావితమై, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో తనను తాను పదును పెట్టుకొని, కారల్ మార్క్స్ ఆశయాలను శ్వాసించి సామాజిక న్యాయ జెండాను ఎగరేసిన మహనీయుడు కర్పూరీ ఠాకూర్. ప్రజల మనిషి, బలహీనవర్గాల పట్ల అమితమైన ప్రేమ గల జననాయకుడాయన. నిస్వార్థం, త్యాగం కలగలిపిన వ్యక్తిత్వం ఆయనది. బలహీనవర్గాల ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేసిన కర్పూరీ అసలు పేరు కర్పూరీ ప్రసాద్ ఠాకూర్.
స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయవేత్త, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ అంబేద్కర్ సిద్ధాంతాలతో ప్రభావితమై కాంగ్రెస్‌కు, గాంధీకి దూరంగా ఉంటూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. ఓబీసీ రాజకీయాలకు ఆయనే ఆద్యుడు. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ ఆలోచనల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన అనంతర కాలంలో సోషలిస్టు నేపథ్యం ఉన్న నాయకుల్లో దిగ్గజంగా ఎదిగారు. జయప్రకాష్ నారాయణకు అతి సన్నిహితుడైన కర్పూరీ ఎమర్జెన్సీ సమయంలో ఆయనతో కలిసి పోరాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి.
బీహార్ రాష్ర్టానికి తొలి కాంగ్రెసేతర సీఎంగా చరిత్ర సృష్టించిన ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1970-71 వరకు మొదటి పర్యాయం 1977-79 వరకు రెండో పర్యాయం ఆ పదవిలో కొనసాగిన కర్పూరీ ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి ప్రతిరూపం.
భారతరత్నతో ఊరించకుండా బీసీ కులగణనను చేపట్టి, రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినప్పుడే కర్పూరీ ఠాకూర్‌కు ఇచ్చిన భారతరత్నకు అర్థం, పరమార్థం
వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జీవితాంతం పోరాడిన ఆయన తాను సీఎంగా ఉన్న కాలంలో వాటిని అమలు చేసి చూపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన కులాలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరిలాల్ కమిషన్ సిఫారసులను 1978లో అమలు చేశారు. ఈ రిజర్వేషన్ పాలసీనే కర్పూరీ ఠాకూర్ ఫార్మూలాగా ప్రసిద్ధిగాంచింది. మండల్ కమిషన్‌కు ఈ సిఫారసులే ప్రేరణగా నిలిచాయి. అయితే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జనతా పార్టీలోని కొందరు నాయకులకు నచ్చలేదు. దీంతో ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు వారంతా కుట్రలకు తెరలేపారు. తద్వారా రిజర్వేషన్ విధానాన్ని నీరుగార్చాలన్నది వారి పన్నాగం. అందుకోసం దళితుడైన రామ్ సుందర్ దాస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించి ఆ నాయకులు అనుకున్నది సాధించారు.
ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసినా మరణించిన తర్వాత ఆయనకంటూ మిగిలిన ఆస్తి పెంకుటిల్లే. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారన్నది. పేదరికం వెంటాడినా, ఏనాడు అధికారాన్ని దుర్వినియోగం చేయకపోవడం విశేషం.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పితౌంజియా గ్రామంలో కర్పూరీ జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడైన కర్పూరీ 26 నెలల జైలు జీవితాన్ని గడిపారు. స్వాతంత్య్రానంతరం సొంత గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అనంతర కాలంలో రాజకీయాల్లో అడుగుపెట్టి.. 1952లో సోషలిస్ట్ పార్టీ తరఫున తేజాపూర్ విధానసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1970లో టెల్కో కార్మికుల ఉద్యమానికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆయన జననాయక్‌గా ప్రసిద్ధిచెందారు. ఆ క్రమంలోనే రెండుసార్లు ముఖ్యమంత్రిగానూ సేవలందించారు. 1979లో జనతా పార్టీ చీలిపోయినప్పుడు చరణ్‌సింగ్ వర్గానికి అండగా నిలిచిన కర్పూరీ 1988 ఫిబ్రవరి 27న మరణించారు. ఆయన మరణానంతరం పితౌంజియా గ్రామం పేరు కర్పూరీగా స్థిరపడిపోయింది.
సంఘ సంస్కరణలు, సాంఘిక చైతన్యమే లక్ష్యంగా పరిపాలన సాగించిన కర్పూరీ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాలు తమ అజెండాలను మార్చుకుని బీసీల అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరం ఉన్నది. సరిదిద్దలేని చారిత్రక అన్యాయాన్ని ఇన్నేండ్లు మహా బోనంగా మోసిన జాతీయ పార్టీలు ఇప్పుడిప్పుడే బీసీల గడపలను తొక్కుతున్నాయి. అవకాశవాదం కోసమో, ఆశయ సాధనకో, ప్రత్యర్థి కాంగ్రెస్‌ను నిలువరించటానికో, బీసీ వర్గాలను దగ్గర చేసుకోవటానికో, దేనికైతేనేం దార్శనికుడు కర్పూరీ మరణించిన 35 ఏండ్లకు ఆయన్ను బీజేపీ గుర్తించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్నను ప్రకటించడం గర్వించదగిన పరిణామం.
దేశ జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మారింది. జాతీయ పార్టీల ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలతో కల్పిస్తున్న రిజర్వేషన్లు కేంద్రంలో 20 శాతానికి, రాష్ర్టాల్లో 25 శాతానికి మించి అమలు కావటం లేదు. సంక్షేమ పథకాలతో సరిపుచ్చకుండా బీసీ లక్ష్యాల పట్ల సామాజిక దృక్పథంతో అన్నిరంగాల్లో సామాజిక న్యాయం కల్పించినప్పుడే బీసీలపై ఉన్న ప్రేమ నిజమవుతుంది.
-వనపట్ల సుబ్బయ్య
94927 65358