‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది. కేసీఆర్ 4.06 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తే… ఇతను 8.12 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చి ఆదివాసులకు అన్నవుతారేమోనని భ్రమపడ్డరు. మొన్న రంగారెడ్డి జిల్లా లగచర్ల గిరిజనుల మీద పోలీసుల దాడి.. ఇప్పుడు భద్రాచలం-కొత్తగూడెం జిల్లా ఇరవైండి గ్రామం కొసగుంపు వలస ఆదివాసి మహిళలపై అటవీ అధికారుల అమానవీయ రాక్షసం చూస్తుంటే.. నల్లమల పులి బిడ్డ ఆదివాసీల పాలిట శాప బిడ్డ అనే అనుమానం కలుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో 22 ఆదివాసీ గూడేల మీద ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారు. దట్టమైన అటవీ విస్తీర్ణం ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ఆదివాసీల మీద ఇన్ని దాడులు జరుగలేదు. లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడే దుర్మార్గానికి పరాకాష్ఠ అనుకుంటే.. అంతకుమించి ఇరవైండి గ్రామ ఆదివాసీ మహిళల మీద అటవీ అధికారులు తెగబడటం, చీరలను చింపి నిర్దాక్షిణ్యంగా కొట్టడం ముమ్మాటికీ అహంకారంతో రేవంత్ ప్రభుత్వం చేసిన రాక్షస చర్యకు కొలమానం. ఒక తీవ్రమైన అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, అటువంటిది పునరావృతం కాకుండా తక్షణం కట్టుదిట్టం చేయడంతో పాటు సమస్య మూలాలను స్పృశించి దీర్ఘకాలిక ప్రయోజనాలను రూపొందించటం పాలకులు, ప్రజా నాయకుల పని. ఇక్కడో సంఘటన గుర్తుచేయాలి.
2019లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం జలగలంచ గూడెం మీద ఫారెస్ట్ అధికారులు అట్లనే విరుచుకుపడ్డరు. పోడు భూములు దున్నుతున్న ఆదివాసీల మీద మహిళలు అనే విచక్షణ జ్ఞానం మరిచిపోయి దాడి చేశారు. ఈ సంఘటన జరిగిన 48 గంటల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.
అటవీ శాఖ పీసీసీఎఫ్ను పిలిపించి ‘ఎవరు చెప్తే గిరిజనుల మీద దాడులు చేశారు? పోడు భూములు దున్నుతున్న ఆదివాసీలను తరిమేయాలనేది మా ప్రభుత్వ విధానం కాదు, ఆ.. అధికారం మీకు ఎవరిచ్చారు?’ అంటూ నిలదీశారు. 2005, డిసెంబర్ 13 తర్వాత తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులందరినీ అడవి నుంచి వెళ్లగొట్టాలని సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే తాము ఆదివాసులను బయటికి పంపిస్తున్నామని సమర్థించుకోవటానికి చూసిన అధికారిని కేసీఆర్ తీవ్రంగా మందలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ‘అడవిని కాపాడుకుంటాం.. మిమ్మల్ని రీకాల్ చేస్తాం ఢిల్లీకి వెళ్లిపోండి’ అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆదివాసీల మీద ఫారెస్ట్ అధికారుల దాడులు జరుగలేదని చెప్పలేను కానీ.. ఆదివాసీల మీద అడ్డూ అదుపు లేని దాడులు నిలువరించారని మాత్రం చెప్పగలను. అంతటితో సమస్యను వదిలేయలేదు. సెక్రటేరియట్లో ఏండ్లకేండ్లుగా పడావు పడిన పోడు భూముల ఫైళ్ల దుమ్ము దులిపిండు. రాష్ట్రవ్యాప్తంగా 1.51 లక్షల మంది ఆదివాసీలకు 4.06 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను ఇచ్చారు. ప్రతి ఎకరాకు రైతుబంధు మంజూరు చేశారు. భూ పోరాటంలో వారి మీద ఫారెస్ట్ అధికారులు నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించారు. పోడు భూముల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసే వెసులుబాటు, 3 ఫేజ్ విద్యుత్తు కనెక్షన్ సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులోనూ 48,161 ఎకరాల పోడు భూములు పంపిణీ చేశారు. నల్లమలలోని కోర్ ఏరియాలో కేసీఆర్ ప్రభుత్వం 42 చెంచు పెంటలకు కలిపి 1600 ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది. అటవీ హక్కుల చట్టంలోని యాజమాన్యపు హక్కు కింద నల్లమలలోని దాదాపు వెయ్యి కుటుంబాలకు ఉమ్మడి ఆస్తిగా లభించింది.
ఆటవిక తెగలు, ఆధునిక సమాజాలు రెండు వేర్వేరు సహజాతాలు. అడవిలోనే పుట్టి పెరిగారు. జంగల్ వాళ్లది. జల్, జమీన్ వాళ్లది. పోడు భూములను దున్నుకోవటం గిరిజనులకు కేసీఆర్ కల్పించిన హక్కు.. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు. హక్కుగా సంక్రమించిన పోడు భూముల్లో బూర్గంపాడు మండలం ఇరవెండి పరిధిలోని కొసగుంపు వలసలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్నారు. ముప్ఫై ఏండ్లుగా అక్కడి పోడు భూముల్లో పంటలు పండిస్తున్నారు. అనివార్య కారణాలతో వారి పట్టాలకు క్లెయిమ్ నెంబర్లు రాలేదు. అంతమాత్రాన వారి మీద అటవీ అధికారులు దాడులకు తెగబడటం, ఆటవిక జంతువుల తీరు ప్రవర్తించటం ముమ్మాటికీ 1/70 పెషా చట్టాల ఉల్లంఘన కిందికే వస్తుంది. అంతకుముందు ఏటూరు నాగారం మండలం రోహీర్ బీట్ పరిధిలోని చల్పాక రహదారి వెంట అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ, పోలీసులు జేసీబీ, డోజర్ వాహనాలతో నేలమట్టం చేశారు.
దుమ్ముగూడెం మండలం గడ్డోరిగట్టు, కాగజ్నగర్ మండలం కోలాంగొందిగూడెం, దర్పల్లి మండలం కొటాల్పల్లి, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పొల్ అటవీ ప్రాంతం, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కొత్తగడ్డంగూడ ఇలా చెప్పుకొంటూ పోతే.. ఫారెస్ట్ అధికారుల బూట్ల కింద నలిగిపోని ఆదివాసీ గూడెం లేదు.
పర్యావరణ సమతూకానికి, అటవీ ఆవరణ వ్యవస్థ అవసరమే. అడవి పెరిగిన చోట తప్పనిసరిగా జంతు జీవజాల సమతుల్యత ఉంటుంది. ఆదివాసీ సంస్కృతి, జీవనవిధానం విశిష్టమైనది. గిరిజనుల జీవన చర్యలు జంతుజాల జీవనచక్రంలో ఎప్పటికీ జోక్యం చేసుకోవు. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. వేసవికాలం మినహా మిగిలిన రెండు కాలాల్లో సూర్యాస్తమయం కంటే ముందే అడవిలో పొద్దుగూకుతుంది. ఆ సమయంలో వన్య జీవరాశులు తావుల్లోంచి బయటికి వస్తాయి. పొద్దు కుంగటానికి ముందే గిరిజనులు గుడిసెకు చేరుతారు. వంటావార్పు, భోజన కార్యక్రమాలు పూర్తిచేసుకొని కుందేటి సుక్క పొడవకముందే నిద్రలోకి జారుకుంటారు. రాత్రంతా వన్యప్రాణులు ఆడవిలో స్వేచ్ఛా ఆహార ఆన్వేషణ చేస్తాయి. మళ్లీ సూర్యోదయం వేళకు గుహలు, పొదల్లోకి వెళ్లిపోతాయి. తిరిగి ఆదివాసీల దినచర్య మొదలవుతుంది. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. ఇవేమీ పట్టకుండా అటవీ అధికారులు ఆగి, అదును చూసి ఆదివాసీల మీద పడుతున్నారు. ఆదివాసీల సాంస్కృతిక మూలాల విధ్వంసంతో మొదలైన ఈ దాడి భౌతికంగా మారి వారిని అడవి నుంచి తరిమే కేంద్రప్రభుత్వ కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నది. ఆదివాసులు అంటేనే నిత్య అనుమానితులుగా, పూర్తి అభద్రత జాతిగా మార్చేశారు.
గ్లోబలైజేషన్ మీద పడి ఆటవిక విధ్వంసం జరుగుతుంటే.. మనుగడ కోసం గిరిజనం తావు దొరికిన చోటికి వెళ్లిపోతున్నది. ప్రపంచీకరణ విధ్వంసాన్ని నిలువరించి ఆదివాసులకు, ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని అధ్యయనం చేసి అపురూప మానవ జాతులను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా మూలవాసుల మీద అమానుషంగా దాడి చేయడం దుర్మార్గం. తెలంగాణలో కేసీఆర్ పంచిన పోడు పట్టాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ పోడు పంచిన విధానం ఆధారంగా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం రక్షిత అడవులైనా, రిజర్వ్ అడవులైనా అందులో నివసించే గిరిజనులకు హక్కులు కల్పించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందేనని గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలోని పోడు భూముల పరిష్కారానికి దిశానిర్దేశంగా ఉన్న తెలంగాణలోనే ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై దాడులు చేయటం చట్టాలను ఉల్లంఘించటమే. నల్లమల బిడ్డగా ప్రకటించుకున్న నాయకులు, అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉన్నది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు